బడీడు పిల్లలను వెంటనే స్కూళ్లలో చేర్చాలి

తల్లిందండ్రులు పిల్లలపై శ్రద్ద పెట్టాలి: కలెక్టర్‌

భద్రాద్రికొత్తగూడెం,జూన్‌5(జనం సాక్షి): ప్రతిగ్రామంలో బడిఈడు పిల్లలంతా స్కూళ్లలోనే ఉండాలని, అందుకు గ్రామస్థులు మిష్టిగా సహకరించాలని కలెక్టర్‌ రాజీవ్‌గాంధీహన్మంతు పిలుపునిచ్చారు. సకల సౌకర్యాలతో ప్రభుత్వం బడిబాట కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందన్నారు. ర్కార్‌ స్కూళ్లలోనే పిల్లలను చేర్పించి అనవసర ఖర్చులకు దూరంగా ఉండాలన్నారు. కార్పోరేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు పెరిగాయని అన్నారు. స్కూళ్లలో విద్యార్థుల నమోదు పెంచడం, అందరికీ విద్య నందించడం కోసం బడీడు పిల్లలను బడిలో చేర్పించాలని అన్నారు. జిల్లా వ్యాప్తంగా బడిబాట కార్యక్రమం ప్రారంభమైందని, గ్రామాలకు వచ్చే టీచర్లు, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు అవగాహన కల్పిస్తున్నారని అన్నారు. జిల్లాలోని మొత్తం 1479 పాఠశాలల్లో బడిబాట కార్యక్రమం చురకుగా సాగుతోందని అన్నారు. మొదటి రోజు మన ఊరి బడి కార్యక్రమంలో పాఠశాలను అలంకరించి, ర్యాలీలు నిర్వహించి కరపత్రాలు పంచారు. తల్లిదండ్రుల సమావేశాన్ని నిర్వహించి విద్యాభివృద్ధికోసం చేస్తున్న కార్యక్రమాలు, విధానాలను సమావేశంలో వారికి తెలియజేశారు. పాఠశాల విద్యాకమిటీ ఉపాధ్యాయ బృందం కలిసి వార్షిక కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులు, గ్రామపెద్దలు, స్వచ్ఛంద సంస్థలు, పూర్వ విద్యార్థుల సహకారంతో పాఠశాల అభివృద్ధి కోసం ప్రణాళికను రూపొందించారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు, నాణ్యమైన విద్యను అందించేందుకు తీర్మానాలు చేశారు. బడిబాటలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ప్రతీరోజు ర్యాలీలు నిర్వహించి నమోదును పెంచేందుకు కృషి చేయాలన్నారు. విద్యార్థుల నమోదు వివరాలను విధిగా ప్రతీరోజు ఎంఈవో కార్యాలయానికి పంపాలన్నారు. అన్ని ఆవాస ప్రాంతాల్లో ఇంటింటి సర్వే నిర్వహించి బడీడు పిల్లలను గుర్తించి బడిలో చేర్పించాలన్నారు. నమోదైన విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనీఫాం అందజే యాలని, 14 సంవత్సరాలలోపు పిల్లలు ఎట్టి పరిస్థితుల్లో బడిలో ఉండే విధంగా చూడాలన్నారు. పనిప్రదేశాల్లో 14 ఏళ్లలోపు పిల్లలు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.