బడుగుజీవులపై భారం మోపుతారా?

` బస్సు ఛార్జీలు పెంపుపై కేటీఆర్‌ ఆగ్రహం
హైదరాబాద్‌(జనంసాక్షి): జంట నగరాల్లో బస్సు ఛార్జీల పెంపు నిర్ణయం దుర్మార్గమని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ విమర్శించారు. ఈమేరకు ఆయన ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. సిటీ బస్సు ఛార్జీలను ఏకంగా రూ.10 పెంచారని చెప్పారు. పేద, మధ్యతరగతి ప్రయాణికుల జేబులను కొల్లగొట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించారన్నారు. ఛార్జీల పెంపుతో ప్రతి ప్రయాణికుడిపై నెలకు రూ.500 అదనపు భారం పడుతుందని పేర్కొన్నారు. బడుగు జీవులు ఎలా బతకాలో సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ‘‘ఇప్పటికే విద్యార్థుల బస్సు పాసులు, టీ-24 టికెట్‌ ఛార్జీలను పెంచారు. కనీస ఛార్జీలపై 50 శాతం ధర పెంచడం అసమర్థ విధానాలకు నిదర్శనం. సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌ ప్రజలపై కక్ష పెంచుకున్నారు. ఉచిత బస్సు పథకంతో ఆర్టీసీ దివాలా తీసింది. సంస్థను గట్టెక్కించాల్సిందిపోయి సామాన్యుల నడ్డి విరుస్తున్నారు’’ అని కేటీఆర్‌ విమర్శించారు. కాగా సామాన్య ప్రజలంటే సీఎం రేవంత్‌రెడ్డికి ఎందుకంత కోపమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ప్రశ్నించారు. బస్సు ఛార్జీల పెంపుపై ఆమె ‘ఎక్స్‌’ వేదికగా విమర్శలు చేశారు. ఇటీవల బస్సు పాస్‌ ధరలు పెంచి చిరుద్యోగులపై పెనుభారం మోపారన్నారు. ఇప్పుడు బస్సు ఛార్జీలను అమాంతం పెంచేశారని మండిపడ్డారు. బస్సు ఎక్కడమే పాపం అన్నట్లుగా ప్రజల జేబులను గుల్ల చేస్తున్నారని విమర్శించారు. గ్రీన్‌ జర్నీ పేరుతో సామాన్యుల రక్తాన్ని పీల్చేస్తున్నారని ఆరోపించారు.