బడ్జెట్‌ ‘గండం’ ఎలా తప్పించుకుందాం

సహచర మంత్రులతో సీఎం సమాలోచనలు
హైదరాబాద్‌, మార్చి11 (జనంసాక్షి) :
బడ్జెట్‌ సమావేశాల్లో విపక్షాలు పన్నుతున్న అవిశ్వాసం వ్యూహాల నుంచి ఎలా తప్పిం చుకుందామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రి వర్గ సహచరులను సలహాలు అడిగారు. బ్జడెట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ముఖ్యమంత్రి అందుబాటులో ఉన్న మంత్రులు, అధికారులతో చర్చించారు. శాసనసభలో అధికార పక్ష బలం నానాటికీ తగ్గిపోతోందని, ప్రభుత్వం గడ్డుపరిస్థితుల్లో ఉందంటే మరికొందరు పార్టీని వీడినా సందేహించాల్సిన అవసరం లేదని, ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ పిలుపునిచ్చిన అవిశ్వాసం వ్యూహం ఏ మేరకు పనిచేస్తుంది అని చర్చించారు. టీడీపీ అనివార్యంగా అవిశ్వాసానికి మద్దతిస్తే పార్టీ ఎంత మంది ఫిరాయించవచ్చు అనే అంశంపై సమాలోచనలు జరిపారు. అవిశ్వాసం వల్లే తలెత్తే విపరిణామాలు ఏమిటి అని అడిగారు. బయటికి ఎంతో ధైర్యంగా కనిపించినా ఎన్నికలకు ఏడాది ముందు ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించేందుకు ఎక్కువ సంఖ్యలో మొగ్గు చూపితే సర్కారు కూలిపోవడం ఖాయమని, ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి వ్యూహాలు అనుసరిస్తే గట్టెక్కవచ్చో అడిగి తెలుసుకున్నారు. ప్రతిపక్షాలకు అలాంటి అవకాశం ఇవ్వకూడదనే ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ పదవికి ఆరో అభ్యర్థిని పార్టీ తరుఫున నిలబెట్టకుండా బొత్సా సీఎంను గట్టిగా వారించారు. అనంతరం వివిధ సమస్యలపై విపక్షాలు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పేందుకు సిద్ధంగా ఉండాలని మంత్రులకు సూచించారు. ఎలాంటి సమస్యనైనా ఎదుర్కోవాలని అన్నారు. అలాగే తగిన సమాచారంతో సిద్ధంగా ఉండాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. శాసనసభ, మండలిలో సభ్యులడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేందుకు వీలుగా కీలక అంశాలకు సంబంధించి కనీసం 20 ఏళ్లకు చెందిన ముఖ్య సమాచారాన్నంతా అందుబాటులో ఉంచాలని సీఎం ఉన్నతాధికారులను ఆదేశించారు. అందుబాటులో ఉన్న మంత్రులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులతో బ్జడెట్‌ సమావేశాలపై ముఖ్యమంత్రి సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్షా నిర్వహించారు. సమావేశాలు ముగిసేంత వరకు అధికారులెవరూ సెలవుల్లో వెళ్లరాదని ప్రతిరోజు ఉదయం ఫోన్‌లో మంత్రులకు అందుబాటులో ఉండాలని సీఎం కోరారు. గత సమావేశంలో సమాధానాలు ఇవ్వని ప్రశ్నలకు తక్షణం సమాధానాలు పంపాలని సీఎం సూచించారు. వివరాలను ఎప్పటికప్పుడు అందించేందుకు వీలుగా తయారుగా ఉండాలన్నారు. ముఖ్యంగా విద్యుత్‌, వ్యవసాయం, మంచినీటి సమస్య, జలయజ్ఞం తదితర అంశాలపై సమాధానాలకు సిద్దం కావాలన్నారు. శాసనసభలో ప్రతిపక్షాలు ఏ రకమైన దాడి చేసినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి బస్వరాజు సారయ్య తెలిపారు. ప్రజలు తమకు అండగా ఉన్నారని, తమ దృష్టికి వచ్చిన ప్రజా సమస్యలను కచ్చితంగా పరిష్కరిస్తామని ఆయన అన్నారు. సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన సమావేశంలో సభలో అనుసరించాల్సిన పలు అంశాలపై చర్చించామన్నారు.