బయ్యారం అట్టిదే… బొత్సా పరాచకాలు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 22 (జనంసాక్షి) :
బయ్యారంలో ఉన్న ఇనుప ఖనిజం అట్టిదేనని పీసీసీ అధ్యక్షుడు బొత్సా సత్యనారాయణ పరాచికాలాడారు. సోమవారం గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతంలోని సహజ వనరులను చులకన చేసి మాట్లాడారు. తెలంగాణ ప్రజలు ఉక్కు కర్మాగారం కావాలని కోరుకోవడంలో ఎలాంటి తప్పులేదని, అయితే ఇక్కడి ముడి సరుకును అడ్డుకుంటామని ఉద్యమాలు చేయడం సరైంది కాదని పేర్కొన్నారు. గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటు కోసం అవసరమైన ముడిసరుకు లభ్యత లేదని, అది కూడా నాణ్యమైనది కానే కాదన్నారు. బయ్యారంలో ముడిసరుకును ఎపిఎండిడిసికి ఇచ్చి ప్రభుత్వ రంగసంస్థ అయిన వైజాగ్‌ స్టీల్‌ కర్మాగారానికి అప్పగించామన్నారు. ఇందులో ఏదురుద్దేశం లేదన్నారు. దీనిపై ప్రాంతీయ వాదన ముడిపెట్టకూడదన్నారు. బయ్యారంలో ఉన్న ముడిసరుకు కూడా ఫ్యాక్టరీ నిర్వహణకు సరిపోదన్నారు. దీనివల్ల ప్లాంట్‌ పెట్టే అవకాశాలు లేనే లేవని మిగతా 2లోబొత్స స్పష్టం చేశారు. వైజాగ్‌ ఉక్కు కర్మాగారం మిగతా ప్రాంతాల్లోని ముడిసరుకును కలుపుకుని ఉత్పత్తి చేస్తుందని యాజమాన్యం చెపుతోందన్నారు. బయ్యారం గనులను రద్దుచేసిన ఘనత తనదేనని బాలినేని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. బయ్యారం గనుల విషయంలో ఆందోళనలు మానుకోవాలని ఆయన ఉద్యమం చేస్తున్న పార్టీలకు హితవు పలికారు. నాణ్యమైన, అవసరమైన ముడిసరుకు ఉంటే కాంగ్రెస్‌ పార్టీయే ముందుగా బయ్యారంలో స్టీల్‌ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తుందన్నారు. ఇప్పటికైనా వాస్తవాలు గుర్తించి అనవసర రాద్దాంతం చేసి పరిస్థితులు ఉద్రిక్తం చేయవద్దని సూచించారు. దీనిపై సంబందిత ఫైల్‌ను పరిశీలించవచ్చన్నారు. పోలవరం ప్రాజెక్టు పనులను త్వరలోనే చేపడుతామని, దీనికి అవసరమైన విద్యుత్‌ ఉత్పత్తిపై దృష్టి పెట్టడం జరిగిందన్నారు. త్వరలోనే విద్యుత్‌ ఉత్పత్తికి సంబందించిన టెండర్లు పూర్తవుతాయన్నారు. విద్యుత్‌ ప్రాజెక్టు లేకుండా పోలవరం చేపట్టడం సాధ్యంగాదని గుర్తించినందునే కాలువలు, రిజర్వాయర్‌ జోలికి వెల్లడం లేదన్నారు. ప్రత్యేక తెలంగాణా విషయంలో కాంగ్రెస్‌ నేతలు అసంతృప్తితో ఉన్నారని, పార్టీని వీడే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోందన్న అంశంపై బొత్స కొట్టిపారేశారు. తెలంగాణా రాష్ట్రం ఇస్తే కాంగ్రెస్సే ఇస్తుందని నాయకులు, ప్రజలు కూడా విశ్వసిస్తున్నారని, దీనిపై అనవసర రాద్దాంతం మీడియా చేయొద్దన్నారు.