బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై టాస్క్‌ఫోర్స్‌

CC

60 రోజుల్లో నివేదిక

కేంద్రమంత్రులు నరేంద్రసింగ్‌, జె.పి.నడ్డా, జవదేకర్‌తో సీఎం కేసీఆర్‌ భేటీ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి6(జనంసాక్షి): బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీపై అడుగు ముందుకు పడింది. అక్కడ పరిశ్రమ ఏర్పాటు చేయాలన్న సంకల్పం మేరకు సిఎం కెసిఆర్‌ కార్యాచరణ చేపట్టారు. ఇందులో భాగంగా ఇప్పటికే ప్రభుత్వం నివేదిక అందించింది. తాజాగా  కేంద్ర మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌తో సమావేశమైన సీఎం కేసీఆర్‌ బయ్యారం ఉక్కు పరిశ్రమపై చర్చించారు.  బయ్యారంలో ఉక్కు కార్మాగారం ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్ర గనుల శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ను సీఎం విజ్ఞప్తి చేశారు. దీనిపై తోమర్‌ మాట్లాడుతూ తెలంగాణ సర్కార్‌ సమర్పించిన నివేదికను పరిశీలించిన 60 రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని అన్నారు. పరిశ్రమ ఏర్పాటు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని అన్నారు. ఈ సందర్భంగా సీఎం కెసిఆర్‌ మాట్లాడుతూ.. బయ్యారం ఉక్కు పరిశ్రమపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో టాస్క్‌ఫోర్స్‌ కమిటీ వేస్తామన్నారు. 60 రోజుల్లోగా అధ్యయనం చేసి నిర్ణయం తీసుకుంటామన్నారు. బయ్యారం ఉక్కు పరిశ్రమకు ప్రభుత్వం తరపున రాయితీలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని సీఎం చెప్పారు.  ఖమ్మం జిల్లాలో బయ్యారం ఉక్కు ఖర్మాగారం ఏర్పాటు అంశంపై కేంద్రమంత్రితో చర్చించామన్నారు. సిఎం వెంట ఉన్న కేంద్రమంత్రి దత్తాత్రేయ మాట్లాడుతూ తనవంతుగా ఫ్యాక్టరీ కోసం కేంద్రంతో చర్చిస్తానన్నారు. ఇక్కడ పరిశ్రమ ఏర్పాటుకు అవకాశాలు ఉన్నాయన్నారు. ఈ సమావేశంలో కేసీఆర్‌ వెంట కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, టీఆర్‌ఎస్‌ ఎంపీలు , మంత్రి జూపల్లి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. తరవాత  కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమావేశమయ్యారు. రాష్ట్రంలో నెలకొల్పే పరిశ్రమలకు పర్యావరణ అనుమతులపై సమావేశంలో చర్చించారు. వివిధ పరిశ్రమలకు అవసరమైన పర్యావరణ అనుమతులను త్వరగా వచ్చేలా చేయాలన్నారు. నల్గొండ జిల్లాలో ఏర్పాటు చేయనున్న థర్మల్‌ విద్యుత్‌ కేంద్రానికి పర్యావరణ అనుమతులు ఇప్పించాలని ప్రకాష్‌ జవదేకర్‌ను కోరారు.  మరో మంత్రి జేపీ నడ్డాను కలిసి తెలంగాణలో ఎయిమ్స్‌, ఫార్మా కంపెనీ ఏర్పాటుపై సీఎం చర్చించారని ఎంపీ వినోద్‌ తెలిపారు. అదేవిధంగా తెలంగాణలో నియోజకవర్గాల సంఖ్యను పెంచాల్సిందిగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శి హెచ్‌.ఎస్‌ బ్రహ్మను కేసీఆర్‌ కోరారని చెప్పారు. అయితే నియోజకవర్గాల పెంపునకు కేంద్రం సానుకూలంగా లేదని, కేంద్రం ఆదేశిస్తే నియోజకవర్గాలను పెంచుతామని బ్రహ్మ అన్నట్లు ఎంపీ వివరించారు. ఢిల్లీ పర్యటనకు వచ్చిన కేసీఆర్‌ కేంద్ర మంత్రులతో సమావేశాలు నిర్వహిస్తూ ఢిల్లీలో బిజీబిజీగా ఉన్నారు.