బయ్యారం ఉక్కు ముమ్మాటికీ తెలంగాణ హక్కే

ప్రధానికి లేఖ రాస్తా
ఆంధ్రజ్యోతి పిచ్చిరాతలు మానుకో… : కేసీఆర్‌
టీఆర్‌ఎస్‌లోకి రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి రమణాచారి
హైదరాబాద్‌, ఏప్రిల్‌ 21 (జనంసాక్షి) :
బయ్యారం ఉక్కు ముమ్మాటికీ తెలంగాణ ప్రజల హక్కే, ఇక్కడ ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించి స్థానికులకు ఉద్యోగా వకాశాలు కల్పించమని ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు లేఖ రాస్తానని టీఆర్‌ఎస్‌ అధినేత కె. చంద్రశేఖర ్‌రావు అన్నారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఉక్కుఫ్యా క్టరీకి అవసరమైన అన్ని వనరులు బయ్యారంలో  ఉన్నాయని అన్నారు. ఉక్కు ఫ్యాక్టరీని బయ్యారంలోనే ఏర్పాటు చేయాలని డిమాండు చేశారు. బయ్యారం ఉక్కును విశాఖ పరిశ్రమకు తరలించొద్దని, ఖమ్మం జిల్లాలోనే ఉక్కు ఫ్యాక్టరీని స్థాపించాలని కోటి సంతకాలు సేకరించి కేంద్రానికి పంపిస్తామని అన్నారు. వైఎస్‌ఆర్‌ హయాంలో రక్షణ స్టీల్స్‌కు గనులు కేటాయించినప్పుడు తొలుత అభ్యంతరం వ్యక్తం చేసింది టీఆర్‌ఎస్‌ పార్టీయేనని అన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్నప్పుడు.. లేని అభ్యంతరం.. బయ్యారం ఉక్కు.. తెలంగాణ ప్రజల హక్కు అంటే ఎందుకు ఉలిక్కిపడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. విశాఖ ఉక్కు ప్లాంటులో తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు కేవలం 3 శాతం మంది మాత్రమే ఉన్నారన్నారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు అజ్ఞానంతో అక్కసుతో మాట్లాడుతున్నారన్నారు. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని ఎలా పడితే అలా మాటలు మీరకూడదన్నారు. ఇప్పటికైనా దిక్కుమాలిన ఆరోపణలు మానుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబుకు హితవుపలికారు. తమ పార్టీని విమర్శించే స్థాయి చంద్రబాబుకు లేదన్నారు. టీడీపీ కూలిపోతోందని, ఆయన పార్టీపై ఎవరికీ ఆశలు లేవన్నారు. అలాంటి చంద్రబాబు తమ పార్టీని ఫాంహౌస్‌ పార్టీ అని వ్యాఖ్యానించడం విడ్డూరంగా ఉందన్నారు. అక్కడ తాను వ్యవసాయం చేస్తున్నానని, అక్కడున్నది ఫాంహౌస్‌ కాదని ఫాం మాత్రమేనని చెప్పారు. ఉద్యమంపై అక్కసుతోనే చంద్రబాబు ఫాంహౌస్‌ అంటున్నారన్నారు. తెలుగుదేశం పార్టీని హేరిటేజ్‌ పార్టీగానో పాలు, కూరగాయల పార్టీగానో ఆయన పార్టీని పిలువవచ్చునా అని ప్రశ్నించారు. తమది సూట్‌ కేసుల పార్టీ అని చంద్రబాబు వ్యాఖ్యానిస్తున్నారని, అసలు సూట్‌కేసుల పార్టీ ఆయనదేనని అన్నారు. ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎండీ రాధాకృష్ణపై కేసీఆర్‌ నిప్పులు చెరిగారు. ఆ పత్రిక ఎన్ని రాతలు రాసినా చంద్రబాబు అధికారంలోకి వచ్చే అవకాశమే లేదన్నారు. రాష్ట్రీయ భావాలు లేని వారు జాతీయ భావాల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని చెప్పారు. ఇప్పటికైనా పిచ్చిరాతలు రాయడం మానుకోవాలని ఆ పేపరు అధినేతను కోరుతున్నా నన్నారు. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటు చేసేందుకు కేంద్రంపై ఒత్తిడి తేవాలని తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ మంత్రులకు విజ్ఞప్తి చేశారు.
టీఆర్‌ఎస్‌లోకి రిటైర్డ్‌ ఐఏఎస్‌ రమణాచారి
రిటైర్డు ఐఏఎస్‌ అధికారి రమణాచారి టీఆర్‌ఎస్‌లో చేరారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో కేసీఆర్‌ను కలిసి పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ రమణాచారి తమ పార్టీలో చేరడం గొప్ప విషయమని అన్నారు. నీతికి, నిజాయితీకి మారుపేరైన రమణాచారి తమ పార్టీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. ఆయన తెలంగాణవాది అని అన్నారు. ఆయన చేరికతో పార్టీ మరింత బలోపేతమవుతుందని పేర్కొన్నారు.