బలహీన ప్రతిపక్షమే కారణం…
రాజకీయాల్లో గెలుపు ఓటములు అత్యంత సహజం. ఓటమే ఎరుగకుండా విజయాలు సాధించడం అల్లావుద్దీన్ దీపం చేసే అద్భుతమేమికాదు. వరుసగా ఇలాంటి ఫలితాలు వస్తున్నాయంటే ఒకటి పాలకులు అంత్యంత శక్తి వంతులయినా అయి ఉండాలి, ప్రతిపక్షాలు చేవజచ్చి, చేష్టలుడిగినవైనా అయి ఉండాలి. గుజరాత్ నరేంద్రమోడి హ్యాట్రిక్ విజయం తర్వాత దేశం యావత్తూ అటే చూస్తోం దనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ల వేలం వెర్రిలో ప్రస్తుతం ఇదొక్కటే వార్తగా చెలామణి అవుతోంది. ఒక రాష్ట్ర ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు, అందునా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీజేపీ ప్రధాన మంత్రిగా ప్రచారంలో ఉన్న సందర్భంలో వెలవడిన ఫలితాలకు ప్రాధాన్యం ఉందనడంలో ఎలాంది సందేహమూ లేదు కాని ఆ పక్కనే ఎన్నికలు జరిగిన మరో రాష్ట్రం హిమాచల్‌ప్రదేశ్ ఫలితాన్ని ఇక్కడ అంతేస్థాయిలో చూపాలి. ఎందు కంటే ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి అభ్యర్థి అయినా వీరభద్రసింగ్‌ను అవినీతిని పరుడిగా పేర్కొంటూ అనివార్యంగా కేంద్ర మంత్రివర్గం నుంచి తప్పించారు. ఆయనపై ఉన్న అవినీతి ఆరోప ణలను ప్రజలు అంతగా పట్టించుకోలేదని ఎన్నికల ఫలితాల అనంతరం అవగతమైంది. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవల్సింది ఏమి టంటే గుజరాత్‌తో పాటు హిమాచల్‌ప్రదేశ్ కూడా బీజేపీ పాలిత రాష్ట్రమే. ప్రధాని అభ్యర్థి రేసులో ఉన్న నరేంద్రమోడి ఇక్కడ విస్తృత స్థాయిలో ప్రచారం నిర్వహివంచారు. కానీ గుజరాత్‌లో వలె ఫలితాలు రాలేదు. అంటే ఇక్కడ మోడి మేనియా పనిచేయలేదనుకోవాలా? ఆయన చరిష్మా గుజరాత్‌కు మాత్రమే పరిమితమా? అనే సందేహాలు కాషాయ దళంలో గుబులు రేపుతున్నాయి. ఇక్కడ గుజరాత్ ఫలితాన్నే ఎందుకు ప్రత్యేకంగా ప్రస్తావించాల్సి వస్తుందంటే ఆ ఫలితాల ప్రభావం దేశవ్యాప్తంగా ఉంటుందని ఆ పార్టీ నాయకులే పలు సందర్భాల్లో పేర్కొన్నారు. కానీ 2007లో జరిగిన ఎన్నికలతో పోలిస్తే బీజేపీ ఏడు శాసనసభ స్థానాలను కోల్పోయింది. కాంగ్రెస్ పార్టీ కాస్త బలపడింది. 2001లో గుజరాత్ భూకంపం తదనంతరం చోటు చేసుకున్న పరిణాలతో కేశూభాయ్ పటేల్ నుంచి ముఖ్యమంత్రి పగ్గాలందుకున్న మోడి మరుసటి ఏడాది జరిగిన ఎన్నికల్లో హిందుత్వ ఎజెండాతో మోడి విద్వేశాగ్ని రగిల్చి విజయం సాధించాడు. వీహెచ్‌పీ, భజరంగదళ్ భావజాలం ఉన్న మోడి గోద్రా ఊచకోతల్లో వందలాది మందిని పొట్టనబెట్టుకున్నాడు. దాని తాలూకు ప్రభావాన్ని ఆయన ఇంకా ఎదుర్కొంటున్నారు. బీజేపీ ఉన్నంతకాలం ఎదుర్కోక తప్పదు. మోడిపై గోద్రా మచ్చవేస్తున్నారని, అది ఎప్పుడో మాసిపోయిందని చెప్పుకునే బీజేపీ నేతలు వందల ఏళ్లక్రితం నాటి అయోధ్య రామాలయం కుల్చివేత పునాదులపైనే తమ పార్టీని నిర్మించుకున్న విషయాన్ని విస్మరిస్తోంది. మోడియే కాదు బీజేపీ గోద్రా దురాఘతానికి ఎల్లప్పటికీ జవాబుదారి కాకతప్పదు. అంతపెద్ద మారణహోమం సృష్టించిన మోడి ఇప్పటి వరకు ఆ ఘటనపై కనీసం విచారం వ్యక్తం చేయలేదు. మృతుల కుటుంబాలకు క్షమాపణ కూడా చెప్పలేదు. విచారం వ్యక్తం చేస్తేనో, క్షమాపణ చెప్తేనే ఆయా గుండెలకు ఆయన గాయం మానిపో దు. ఆయా కుటుంబాలకు జరిగిన నష్టం పూడ్చుకుపోదు. కనీసం పశ్చాత్తాప పడటం మానవ సహజం. ఆ సహజత్వానికి మోడి అతి దూరంగా ఉన్నాడు కాబట్టే ప్రపంచానికే పెద్దన్న లాంటి అమెరికా ఆయనను తమ దేశంలో అడుగుపెట్టవద్దంది. ఇప్పటి వరకు ఆయనకు వీసా జారీ చేసేందుకు నిరాకరిస్తోంది. 2002 ఎన్నికల్లో గోద్రా తదనంతరం పరిణామాల నేపథ్యంలో ఎన్నికల్లో విజయం సాధించిన మోడి 2007 ఎన్నికల్లో గుజరాతీల ఆత్మగౌరవ నినాదాన్ని అందుకు న్నాడు. రాష్ట్రం అభివృద్ధి పథంలో ఉందికాబట్టి మళ్లీ తనకే పట్టం కట్టాలని ఓటర్లను వేడుకున్నాడు. అప్పుడు విజయం సాధించిన మోడి పాలనలోనూ తన హిందుత్వ ఎజెండానే కొనసాగించి ఒక వర్గాని కి మాత్రమే ముఖ్యమంత్రి అనే భావన కలిగించారు. అలాగే ఆ వర్గం ఓటర్లను ఓటు బ్యాంకుగా మలుచుకున్నాడు. ఇందుకు స్థానిక కాంగ్రెస్ పార్టీలో బలహీన నాయకత్వం కూడా కారణం. స్వతహాగానే స్థానిక నేతలను బలపడనివ్వని ఆ పార్టీ అసమర్థవిధానాలూ మోడీ గెలుపునకు పరోక్షంగా దోహదం చేశాయి. కర్ణుడి చావుకు అనేక కారణాలు దోహద పడినట్లు కాంగ్రెస్‌లో నెలకొన్న కొన్ని పరిస్థితులు మోడికి లాభించాయి. బీజేపీ వ్యక్తిస్వామ్యానికి తెరతీసిన వెంటనే కాంగ్రెస్ పార్టీ స్థానికంగా కాస్త బలమున్న నేతను ప్రోత్సహించి ముందుకు నడిపినా పరిస్థితి ఇంత అధ్వానంగా ఉండేది. ఢిల్లీ పెద్దల మీదనే కాంగ్రెస్ ప్రతి విషయానికి ఆధారపడటం కూడా గుజరాతీల ఆత్మగౌరవ నినాదానికి ఆకర్షితులను చేసింది. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత గురు వారం సాయంత్రం అహ్మదాబాద్‌లో నిర్వహించిన బహిరంగ సభలో మోడి మాట్లాడుతూ ఈ విజయం ఆరుకోట్ల గుజరాతీయులం దరిదని చెప్పాడు. కానీ ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే ఆరుకోట్ల గుజరాతీల్లో ఆయన ఒక్కరంటే ఒక్క ముస్లింకు కూడా బీజేపీ బీఫాం ఇచ్చి అభ్యర్థిగా ప్రకటించలేదు. తాను ముస్లింలకు వ్యతిరేకిని కాదని సెక్యూలర్ వాదినని చెప్పుకునే ప్రయత్నం ఎంతగా చేసిన ఆయన పూర్తిస్థాయిలో వారికి చేరువ కాలేకపోయారు. ఎన్నికల సరళిని విశ్లేసించిన కొందరు 80 శాతం మంది ముస్లింలు కాంగ్రెస్ పక్షాన నిలిచారణ చెప్పడాన్ని బట్టి చూస్తే మోడిపై వారు ఎంతగా విసు గు చెందారో అర్థమవుతుంది. ఓట్లు సీట్ల రాజకీయంలో మోడి విజయం సాధించాడమేగాని సమస్త గుజరాతీలకు ఆయన నాయకుడు కాదనడా నికి ఈ ఫలితాలే ప్రత్యక్ష నిదర్శనం. ఈ ఫలితాల తర్వాతనైనా కాంగ్రెస్ పార్టీ గుణపాఠం నేర్చుకోకుంటే అంతకుమించి క్షమించరాని విషయం మరొకటి ఉండదు.