బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు

1
5 మంది మృతి

ఎస్‌.రాయవరం, మార్చి 30(జనంసాక్షి) : ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ జిల్లా ఎస్‌. రాయవరం మండలం గోకులపాడులో బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించి ఐదుగురు సజీవ దహనమయ్యారు. 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద స్థలంలో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. బాధితుల సంఖ్య స్పష్టంగా తెలియడం లేదని స్థానికులు అంటున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో 15 మంది వరకు బాణసంచా తయారీ కేంద్రంలో ఉన్నట్లు తెలుస్తోంది. సంఘటనాస్థలం విశాఖ నగరానికి వంద కిలోమీటర్ల దూరంలో ఉంది. సాయంత్రం 4.30 – 5 గంటల మధ్య ఈ ప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. పోలీసులు సహాయ చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. మృతుల్లో గోకులపాడుకు చెందిన సత్యవతి, లింగంపల్లి శేషమ్మ, పాయకరావుపేటకు చెందిన సత్తిబాబు ఉన్నారు. మరో మృతదేహం గుర్తించ వీలుకాకుండా ఉండగా, మరొకరి ఆచూకీ గల్లంతెయంది. ప్రమాద ఘటనపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మంత్రి అయ్యన్నపాత్రుడు ఆయనకు ఘటన వివరాలను తెలియజేశారు. కలెక్టర్‌, ఆర్డీవోలు తక్షణమే ఘటనాస్థలానికి వెళ్లాలని సీఎం ఆదేశించారు. కాగా ఏపీ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు ఘటనపై ఆరాతీశారు. గాయపడ్డవారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రమాద ఘటనపై పోలీసులనుంచి నివేదిక కోరారు. రేపు ఆయన స్వయంగా ఘటనాస్థలానికి వెళ్లనున్నారు. బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు వల్ల గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని మరో ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు.