బాబు ములాఖతయిండు
నయవంచన, మోసం ఆయన నైజం : కేసీఆర్
హైదరాబాద్,మార్చి13(జనంసాక్షి):
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కాంగ్రెస్‌తో ములాఖత అయ్యిండని, అందుకే అవిశ్వాసానికి వెనుకడుగు వేస్తున్నాడని టీఆర్‌ఎస్ అధినేత కె. చంద్రశేఖర్‌రావు అన్నారు. దమ్ముంటే టీడీపీ కాంగ్రెస్ ప్రభుత్వంపై అవిశ్వాసంపెట్టాలని, లేదంటే తాము పెట్టే అవిశ్వాసానికి మద్దతు ఇవ్వాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని చెబుతున్న బాబు అవిశ్వాసానికి ఎందుకు వెనుకడుగు వేస్తున్నాడని ప్రశ్నించారు. అవిశ్వాసానికి సరిపడా 30 మంది మద్దతు తమకు ఉందన్నారు. జయప్రకాశ్ నారయణ, సీపీఐ, సీపీఎం మద్దతు ఇస్తానన్నాయన్నారు. కాంగ్రెస్‌కు మద్దుతు ఇస్తున్నందున ఇక నుంచి తెలుగు దేశం పార్టీ కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ అని రుజువైందని టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ అన్నారు. నయవంచన, మోసం ఆయన నైజమని, తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం టీడీపీ పెడితే ఇప్పుడా ఆత్మగౌరవాన్ని చంద్రబాబు కాంగ్రెస్‌కు తాకట్టు పెట్టారని అన్నారు. అవిశ్వాస తీర్మానానికి బీజేపీ, సీపీఐ, జేపీ అవిశ్వాసానికి మద్దతు తెలిపారని, దీంతో సభ్యుల సంఖ్య సరిపోయిందని కేసీఆర్ తెలిపారు. చిదంబరంతో చీకటి ఒప్పందం చేసుకున్న చంద్రబాబు ఎఫ్‌డీఐలకు అనుకూలంగా వ్యవహరించాడని కేసీఆర్ మండిపడ్డారు. తనపై కేసులు విచారణ లేకుండా ఉండేందుకే ఎఫ్‌డిఐలపై మద్దతు తెలిపి కేంద్రంలో కాంగ్రెస్‌ను కాపాడారని అన్నారు. ఇప్పుడు ఆ ఒప్పందం మేరకే ఇక్కడ కాంగ్రెస్‌ను కాపాడుతున్నారని అన్నారు. ‘బయట తోడలు గొట్టి ప్రభుత్వాన్నిపడగొట్టే అవకాశం ఉన్న చంద్రబాబు అసలు సమాయానికి తోక ముడిచి మమ్ముల్ని
తోక పార్టీలని అంటాడా?’ అని కేసీఆర్ ప్రశ్నించారు. తోక పార్టీలైతే 2009 లో ఎందుకు పొత్తు పెంటుకున్నారని, అప్పుడు తొండం లాగ కనపడ్డామా’ అని కేసీఆర్ తీవ్రంగా స్పందించారు. చంద్రబాబు చేస్తున్నది చారిత్రక తప్పిదమని, ఆ ఆపర్టీని ప్రజలు తిరస్కరించడం ఖాయమన్నారు. ఇప్పటికైనా తప్పు సరిదిద్దుకొని అవిశ్వాసం పెట్టాలని కేసీఆర్ చంద్రబాబుకు సూచించారు. రాజీనామాలు చేసి పారిపోయిన చరిత్ర ఎవరిదో ప్రజలకు తెలుసునన్నారు. చంద్రబాబు ఊసరవెల్లి కంటే అధ్వానంగా రంగులు మారుస్తన్నాడని తేలిపోయిందన్నారు. చంద్రబాబు చేస్తున్న నిందలన్నీ నటనేనని తెరాస అధినేత కేసీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ భవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ ఆయన 2009 లో తమతో పొత్తు పెట్టుకున్నప్పుడు తోకపార్టీ అన్పించలేదా అని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీలో ఎన్టీఆర్ స్ఫూర్తి ఇప్పుడు లేదని, చంద్రబాబు చారిత్రక తప్పిదం చేస్తున్నారని కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్‌పై చంద్రబాబు చేస్తున్న విమర్శలను ఎవరూ నమ్మరన్నారు. అవిశ్వాస తీర్మానంపై చంద్రబాబు ఇప్పటికైనా మనసు మార్చుకోవాలని, ఒకవేళ అవిశ్వాస తీర్మానం పెడితే తెరాస మద్దతిస్తుందని కేసీఆర్ అన్నారు. అవిశ్వాస తీర్మానం పెడతామని సాయంత్రంలోగా చంద్రబాబు ప్రకటిస్తే చాలన్నారు. ఇప్పటికే బాబు నిర్ణయంతో పార్టీలో వ్యతిరేకత వస్తోందని కొందరు రాజీనామా కూడా చేశారని అన్నారు. కిరణ్ కుమార్‌రెడ్డి ప్రభుత్వానికి మద్దతు తెలుపుతున్నట్టు ఇవాళ బాబు అడ్డంగా దొరికిపోయి టీడీపీ అసలు రంగు బయట పడ్డదని కేసీఆర్ విమర్శించారు. ప్రభుత్వాన్ని పడగొట్టే అవకాశం వున్న చంద్రబాబు ఎందుకు పారిపోతున్నడో ప్రజలకు అర్థమైందని దీంతో ‘థూ చంద్రబాబు, ఛీ, చంద్రబాబు అని ఎస్సేఎమ్మెఎస్‌లు పెడుతున్నరని కేసీఆర్ పేర్కొన్నారు. ఇక అంధ్రజ్యోతి పత్రిక పైశాచిక ఆనందాన్ని పొందుతుందని, దాని పాలసీ ఎంటో ప్రజలు గమనిస్తున్నారని కేసీఆర్ వివరించారు. ముందే వీగిపోయిన తీర్మానం అని ఎలా రాస్తారని అన్నారు. వారికా ఆనందం ఎందుకని ప్రశ్నించారు. ఇష్టం వచ్చినట్లు రాస్తే ఇక్కడ చేతులు ముడుచుకుని ఎవరూ కూర్చోలేదన్నారు. అవిశ్వాసం అనేది ప్రజా సమస్యలపై చర్చించడానికని, ఒక్కోసారి అవిశ్వాసం వల్ల ప్రభుత్వం పడిపోతుందని అన్నారు. తాము తెలంగాణపై చర్చిస్తే ఒక్కో పార్టీ ఒక్కో అంశంపై చర్చిస్తుందని అన్నారు. తెలంగాణలో కరెంట్ కోతలు రైతులను అతలాకుతం చేస్తున్నాయని అన్నారు. ఇక్కడ విద్యార్థులకు చదువుకునేందుకు కూడా కరెంట్ ఇవ్వడం లేదన్నారు. మంచినీటి కోసం ప్రజలు నానాయాతన పడుతున్నారని అన్నారు. ఇంతకన్నా సమస్యలు ఇక ఏముంటాయని అందుకే అవిశ్వాసం ప్రతిపాదిస్తున్నామని కెసిఆర్ చెప్పారు.