‘బాబూ’.. నీబడాయి చాలు

1

హైదరాబాద్‌పై తెలుసుకో నిజాలు

ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడకముందే హైదరాబాద్‌ నాలుగో అభివృద్ధి నగరం

విలీనం తర్వాత ఐదో స్థానానికి పతనం

ఆంధ్రా కంటే 17 ఏళ్ల ముందు తెలంగాణకు విద్యుత్‌ వెలుగులు

వ్యాపారవృద్ధి, సామ్రాజ్యవాద విస్తరణే ఆంధ్రోళ్ల ఆకాంక్ష

తెలంగాణ వనరులు కొల్లగొట్టి వలసవాదులు బలపడ్డారు

హైదరాబాద్‌ బిర్యానీ, షేర్వానీ, ఖుర్భానీ ప్రపంచమంతా తెలుసు

ఆంగ్లేయులు దేశాన్ని అభివృద్ధి చేశామన్నారు

మీరు తెలంగాణను అభివృద్ధి చేశామంటున్నారు

వారికి మీకు తేడా ఏముంది..?

తెలంగాణ అభివృద్ధంతా నిజాం సర్కారు పుణ్యమే

హైదరాబాద్‌ అభివృద్ధిలో బాబు అబద్దపు ప్రచారంపై ‘జనంసాక్షి’ ప్రత్యేక కథనం…

హైదరాబాద్‌, నవంబర్‌ 6 (జనంసాక్షి) : చంద్రబాబు.. భలే అబద్దాల కోరు..! ఎంతంటే.. చెప్పలేనంత..!! హైదరాబాద్‌ను ఆయనే ఉద్దరించిండంట..! ఆయనకు మించిన పాలనాదక్షుడే లేడంట..!! అదే నిజమైతే.. ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడక ముందు దేశంలో అభివృద్ధి చెందిన నగరాల్లో హైదరాబాద్‌ నాలుగో స్థానంలో ఉన్నది.. ఏర్పడ్డాక ఐదో నగరంగా ఎందుకు పడిపోయింది..? ఇంకా.. తెలంగాణలో విద్యుత్‌ వెలుగులు ఆంధ్రా కంటే 17 ఏళ్ల ముందే విరజిమ్మాయి..! అంతవరకూ ఆంధ్రాలో చీకట్లే కమ్మాయి..!! అంతేకాదు.. హైదరాబాద్‌ బిర్యానీ, షేర్వానీ, ఖుర్భానీ ఆంధ్రోళ్ల రాకకు ముందే ప్రపంచమంతా పరిచయం..! హైదరాబాద్‌లోని చారిత్రక కట్టడాలు, విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థలు, పేరుగాంచిన పారిశ్రామిక వాడలు, ప్రజారవాణా వ్యవస్థలు అన్నీ నిజాం పాలనలోనే కార్యరూపం దాల్చాయి..! మరి.. బాబుగారి అభివృద్ధి ఎక్కడ..? తాను లేకుండా హైదరాబాద్‌ అభివృద్ధి లేదని చెబుతున్న చంద్రబాబు మాటల్లో అర్థమేంటి..? అర్థమేం లేదు.. అవి బడాయి మాటలు..! అందుకే.. ‘బాబూ.. చాలు నీ బడాయి మాటలు.. హైదరాబాద్‌ గురించి తెలుసుకుని మాట్లాడు నిజాలు’ అంటున్నారు యావత్‌ తెలంగాణ ప్రజలు. దీనిపై ‘జనంసాక్షి’ ప్రత్యేక కథనం అందిస్తోంది.

1956కు ముందే అభివృద్ధి పథంలో హైదరాబాద్‌…

హైదరాబాద్‌ నగరం 1956కు ముందే దేశంలోనే అభివృద్ధి పథంలో పయనిస్తోంది. నిజాం పరిపాలనలో హైదరాబాద్‌ నగరం అన్నిహంగులు, సౌకర్యాలతో రూపుదిద్దుకుని దేశంలోని అభివృద్ధి చెందిన నగరాల్లో నాలుగో నగరంగా పేరు తెచ్చుకుంది. నగరం నడిబొడ్డున హుస్సేన్‌ సాగర్‌ నిర్మాణంతో హైదరాబాద్‌కు మణిహారంగా మారింది. అంతేకాదు.. సాగర్‌ ఒడ్డున 1910లో థర్మల్‌ పవర్‌ ప్లాంటును స్థాపించడంతో దక్షిణ భారతదేశంలోనే మొదటి సారిగా హైదరాబాద్‌ విద్యుత్‌ వెలుగులతో కాంతులీనింది. తెలంగాణకు కరెంటు వచ్చిన 17 ఏళ్ల తర్వాతగానీ ఆంధ్రాకు, మద్రాసు నగరానికి విద్యుత్‌ వెలుగులు అందలేదు. దీంతో హైదరాబాద్‌ 1930లో దేశంలోనే అత్యుత్తమ ఎలక్ట్రిసిటీ నగరంగా పేరుగడించింది. హైదరాబాద్‌ రాష్ట్రాన్ని పారిశ్రామికతకు, వ్యవసాయానికి, విద్యావిస్తరణకు, ప్రజారవాణా పటిష్టతకు ఇలా వివిధ అంశాల అభివృద్ధికి నిజాం పాలకులు అవిరళ కృషి చేశారు. తద్వారా యావత్‌ దేశానికే తమ పాలనను రోల్‌మోడల్‌గా తీర్చిదిద్దారు. 1871లోనే తెలంగాణను పారిశ్రామిక హబ్‌గా అభివృద్ధి చేశారు. పారిశ్రామికీకరణలో భాగంగా నిజాం సర్కార్‌ స్థాపించిన కంపెనీలను మచ్చుకు కొన్నింటిని తెలుసుకుందాం. 1871లో సింగరేణి కాలరీస్‌, 1873లో స్పిన్నింగ్‌ మిల్స్‌, 1866లో కస్టమ్స్‌ ఫ్యాక్టరీ, 1910లో ఐరన్‌ ఫ్యాక్టరీ, 1919లో విఎస్‌టి ఫ్యాక్టరీ, 1921లో కెమికల్‌ ల్యాబొరేటరీ, 1927లో దక్కన్‌ గ్లాస్‌ ఫ్యాక్టరీ, 1929లో రాంగోపాల్‌ కాటన్‌ ఫ్యాక్టరీ, 1933లో కోహినూర్‌ వజ్రాల ఫ్యాక్టరీ, 1941లో గోల్కొండ సిగరెట్‌ ఫ్యాక్టరీ, అలాగే నిజాం షుగర్‌ ఫ్యాక్టరీని స్థాపించారు. 1956 వరకు.. అంటే.. తెలంగాణలో ఆంధ్రరాష్ట్రం విలీనం అయ్యే సమయానికి తెలంగాణ ప్రాంతంలో మొత్తం 50 స్టీల్‌ ఫ్యాక్టరీలున్నాయి. నాలుగు ఎలక్ట్రికల్‌ వస్తువుల తయారీ కంపెనీలు ఏర్పడ్డాయి. అప్పటికే హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌, ముషీరాబాద్‌, అజామాబాద్‌ ప్రాంతాలు పారిశ్రామిక వాడలుగా అభివృద్ధి చెందాయి. 1942లో హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌ ప్రాంతంలో అల్విన్‌ కంపెనీని స్థాపించి వేలాది మందికి ఉపాధి కల్పించారు.

ఆంధ్రోళ్ల రాకకు ముందే హైదరాబాద్‌లో ప్రముఖ సంస్థలు..

హైదరాబాద్‌ రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రం విలీనం కాకముందే హైదరాబాద్‌లో ప్రముఖ సంస్థలు ఏర్పాటయ్యాయి. రాష్ట్రంలో వ్యవసాయాభివృద్ధి కోసం 1896లో ఇరిగేషన్‌, 1913లో అగ్రికల్చర్‌ విభాగాలను స్థాపించారు. నగరంలో శాంతిభద్రతల స్థాపన కోసం 1893లోనే పటిష్టమైన పోలీసింగ్‌ విభాఘం ఏర్పాటైంది. రాష్ట్ర ప్రజలకు సరైన న్యాయం అందించాలనే సత్సంకల్పంతో నిజాం నవాబులు 1870లోనే హైదరాబాద్‌లో హైకోర్టును నిర్మించారు. ప్రస్తుతం ఉపయోగించుకుంటున్న అసెంబ్లీ భవనం కూడా వారు నిర్మించిందే. ప్రభుత్వం, ప్రజలకు మధ్య స్నేహపూర్వక సంబంధాలు నెలకొల్పేందుకు ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చేందుకు 1932లో ఆకాశవాణి కేంద్రాన్ని నెలకొల్పారు. అంతేకాదు.. ప్రజలకు టెలీకమ్యూనికేషన్‌ వ్యవస్థ ఉండాలనే సంకల్పింతో 1885లోనే టెలీఫోన్‌ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. 1856లో మొదటి పోస్టాఫీస్‌ హైదరాబాద్‌లో ఉండేది. 1940కి ముందే హైదరాబాద్‌లో ఎన్నో పత్రికలు వెలువడ్డాయి. ఈ అభివృద్ధి అంతా 1956కు ముందే జరిగింది. మరి ఆంధ్రోళ్లోమో 1956లో తెలంగాణకు వచ్చారు. పైగా నిజాములు చేసిన అభివృద్ధినంతా తామే చేశామని గొప్పలు పోతున్నారు. ముఖ్యంగా ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు నాయుడైతే.. హైదరాబాద్‌ అభివృద్ధి తనతోనే సాధ్యమైందని, తాను లేకుంటే హైదరాబాద్‌ అభివృద్ధి లేదని బీరాలు పలుకుతున్నారు. ఈ నేపథ్యంలో.. బాబు మాటల్లో నిజం లేదని చెప్పడానికి.. నిజాం కాలంలో హైదరాబాద్‌లో జరిగిన అభివృద్ధి సంవత్సరంతో సహా నిర్ధిష్టంగా, సవివరంగా చరిత్ర సాక్ష్యం చెబుతోంది.

విద్యావికాసానికి విశ్వవిద్యాలయాల ఏర్పాటు…

హైదరాబాద్‌ రాష్ట్రంలోని విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేందుకు నిజాం పాలకులు స్కూళ్లు, కాలేజీలు, వర్శిటీలు, హైదరాబాద్‌ పబ్లిక్‌స్కూళ్లు వంటి విద్యాసంస్థలను భారీగా నిర్మించారు. అందుకు అత్యుత్తమమైన విద్యావిధానాన్ని రూపొందించారు. పేదలు చదువుకునేందుకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహక పథకాలను ప్రవేశపెట్టారు. ప్రస్తుత స్కాలర్‌షిప్‌ విధానం నైజాములు ప్రవేశపెట్టిన పథకమే. 1872లోనే స్కూల్స్‌, కాలేజీలను ఏర్పాటు చేశారు. విద్యార్థులు నాలుగు భాషల్లో విద్యనభ్యసించేందుకు హిందీ, ఉర్దూ, తెలుగు, ఆంగ్ల భాషలను అందుబాటులోకి తెచ్చారు. పై చదువుల కోసం విశ్వవిద్యాలయాలు స్థాపించారు. 1894లో మెడికల్‌ కాలేజీ, 1920లో సిటీ కాలేజీ, అదే సంవత్సరంలో ఉస్మానియా యూనివర్శిటీ, 1921లో ఉస్మానియా మెడికల్‌ కళాశాలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌ నగరంలో సివిల్‌ ఇంజనీరింగ్‌ విద్యను 1869లోనే అందుబాటులోకి తెచ్చారు. అంతేకాదు.. ప్రజలకు విజ్ఞానాన్ని అందించాలనే సంకల్పంతో 1872లోనే మొదటి గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. పేదలు చదువుకునేందుకు 1897లో స్టడీస్కీమ్‌ను ప్రవేశపెట్టారు. ఈ స్కీం ద్వారా విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందజేసేది. ఈ స్కీం ద్వారానే భారత నైటింగేల్‌గా ప్రఖ్యాతిగాంచిన సరోజినీనాయుడు లండన్‌కు వెళ్లి విద్యనభ్యసించారు.

పటిష్టమైన ప్రజారవాణా అప్పుడే…

హైదరాబాద్‌ రాష్ట్రం అభివృద్ధి వేగంగా జరగాలంటే.. అందుకు అనుగుణంగా ప్రజారవాణా వ్యవస్థ ఉండాలనే సంకల్పంతో పటిష్టమైన ప్రజారవాణాను రూపొందించారు. 1866లోనే రైలు మార్గాన్ని వేశారు. విమానాయానానికి సంబంధించి ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న బేగంపేట, హకీంపేట విమానాశ్రయాలు నిజాములు స్థాపించినవే. ప్రజారవాణాను తెలంగాణ ప్రజలకు మరింత చేరువచేసేందుకు 1932లో ఆర్టీసిని స్థాపించారు. రైలు, విమాన మార్గాల ద్వారా దూరపు ప్రయాణాలకు మాత్రమే అవకాశం ఉండేది. ఆర్టీసిని అందుబాటులోకి తెచ్చి దగ్గరి ప్రయాణాలకు అవకాశం కల్పించారు. ఆర్టీసి రావడంతో ప్రజారవాణా మరింత సులభతరమై అభివృద్ధి వేగానికి బాటలు వేసింది. రోడ్డు మార్గాలను అభివృద్ధి చేశారు. మొట్టమొదటి సారిగా సిమెంటు రోడ్లను హైదరాబాద్‌లోనే నిర్మించారు. అట్టడుగు ప్రజల రవాణా కోసం తన భార్య ‘మహర్‌ డబ్బుల’తో ఆర్టీసిని స్థాపించి లాభనష్టాలు ఆశించకుండా అత్యుత్తమ సేవలందించారు నిజాములు.

బాబూ.. ఏదీ నీ అభివృద్ధి…?

1956లో హైదరాబాద్‌కు వచ్చిన ఆంధ్రోళ్లు చేసిన అభివృద్ధి హైదరాబాద్‌లో శూన్యం. ఉన్న అభివృద్ధిని నాశనం చేశారు. ఆంధ్రోళ్ళ పుణ్యమాని అప్పటి వరకు దేశంలో అభివృద్ధి చెందిన నగరాల్లో నాలుగోస్థానంలో ఉన్న హైదరాబాద్‌ నగరం ఐదో స్థానానికి పతనమైంది. 1910లో నిజాములు హుస్సేన్‌ సాగర్‌ ఒడ్డున థర్మల్‌ పవర్‌ ప్లాంటును నిర్మిస్తే.. దాన్ని ఎన్టీరామారావు 1984లో తన అధికారాన్ని ఉపయోగించి కారుచౌకగా రూ.6 కోట్లకు అమ్మేశారు. అదే కోవలో అనేక పేరుగాంచిన పరిశ్రమలకు పీకనొక్కారు. వేలాది కార్మికులను రోడ్డున పడేశారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన బాబు పదేళ్లపాటు అధికార పగ్గాలు గుప్పిటపట్టి ఒక్క హైటెక్‌ సిటీ నిర్మాణం తప్ప చేసిందేమీ లేదు. హైదరాబాద్‌లో ఉన్న డ్రైనేజీ వ్యవస్థ కూడా నిజాములు రూపొందించినదే ఇప్పటికీ కొనసాగుతోంది. హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూళ్లూ అప్పటివే ఉన్నాయి. వర్శిటీలు, చారిత్రక కట్టడాలు ఆ కాలం నాటివే. మరి చంద్రబాబు చేసిన అభివృద్ధి ఎక్కడుంది..? తాను అది చేశాను.. ఇది చేశాను.. అని ఎందుకు గొప్పలు చెప్పుకుంటున్నారు..? అని యావత్‌ తెలంగాణ ప్రశ్నిస్తున్నారు. తాను ఎంత చెప్పుకున్నా.. తాను చేసిన అభివృద్ధి ప్రజలందరికీ తెలుసు. తన విధానాల వల్ల ప్రజాగ్రహం పెంపొందించారు. రైతులు, ఉద్యోగులు, కార్మికుల్లో అభద్రతాభావాన్ని రెట్టింపు చేశారు. హక్కులడిగితే మక్కెలిరిగేలా లాఠీలు ఝుళిపించారు. గొంతెత్తితే తూటాల వర్షం కుపించారు. భాష్పవాయుగోళాలు ప్రయోగించారు. ఇలా అనేక సందర్భాల్లో బాబుపాలనపై ప్రజలు ఆగ్రహం వెళ్లగక్కారు. చివరికి అధికారం లేకున్నా.. ప్రతిపక్షంలో ఉండి కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడుగడుగునా అడ్డుకున్నారు. తెలంగాణ ప్రజలకు మోసం చేశారు. కాబట్టి.. ఇప్పటికైనా బాబు హైదరాబాద్‌ అభివృద్ధిపై నిజాలు తెలుసుకుని మాట్లాడితే ప్రజలు సంతోషిస్తారు. అప్పుడు చేసిన అభివృద్ధి దేవుడెరుగు. కానీ.. రాష్ట్రం విడిపోయాక కూడా తెలంగాణపై కుట్రలు మానుకోవడం లేదు. ఇక నుంచైనా చిత్తశుద్ధితో.. నిజాయితీగల రాజకీయ నాయకుడిలా.. విభజన చట్టం ప్రకారం.. తెలంగాణకు రావాల్సిన వాటాలు, దక్కాల్సిన హక్కులు సమంగా ఇచ్చేందుకు సహకరించాలి. అసత్య, అబద్దపు ప్రచారం మానుకుంటే తన రాజకీయ భవిష్యత్‌కు మరింత మంచిదని తెలంగాణ ప్రజానీకం సూచిస్తోంది.