బాబ్లీపై అఖిలపక్షం ఏర్పాటు చేయండి

పోరుబాటలో టీడీపీ
కార్యాచరణ ప్రకటించిన ఎర్రబెల్లి
కరీంనగర్‌, మార్చి 1 (జనంసాక్షి) :
బాబ్లీపై అఖిలపక్షం ఏర్పాటు చేయాలని టీటీడీపీ ఫోరం డిమాండ్‌ చేసింది. సుప్రీంకోర్టు బాబ్లీ ప్రాజెక్టును పూర్తిచేసుకోవచ్చని తీర్పునివ్వడంతో ఆగ్రహించిన టీటీడీపీ ఎమ్మెల్యేలు శుక్రవారం కరీంనగర్‌లోని ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ ఇంట్లో సమావేశం నిర్వహించారు. సుమారు రెండున్నర గంటలు చర్చలు జరిపి ఉద్యమ కార్యచరణ ప్రకటించారు. ఈనెల 4వతేదీన ఎస్సారెస్పీ ప్రాజెక్టు పరిధిలోని అన్ని మండలాల్లో ధర్నా లు, రాస్తారోకోలు చేయాలని నిర్ణయించారు. అలాగే 7వతేదీన ఆదిలాబాద్‌ జిల్లా కలెక్టరేట్‌ ముట్టడించాలని, 8వ తేదీన ఆదిలాబాద్‌, కరీంనగర్‌ కలెక్టరేట్లు, 9న వరంగల్‌, నల్గొండ కలెక్టరేట్లను ముట్టడించాలని నిర్ణయం తీసుకున్నారు.ఈఆందోళనల్లో పెద్దఎత్తున రైతులను సవిూకరించాలని, అలాగే కలిసివచ్చే అన్ని పార్టీల సహ కారం తీసుకోవాలని నిర్ణయించారు. సమావేశం అనంతరం పోరం కన్వీనర్‌ ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లా డుతూ బాబ్లీప్రాజెక్టు నిర్మాణానికి పూర్తిబాధ్యత టిఆర్‌ఎస్‌అధినేత కేసిఆరేనన్నారు. టిఆర్‌ఎస్‌ పార్టీవల్లే నేడు తెలంగాణాలో అన్యాయం పెరిగిపోతోందని దుయ్యబట్టారు. కేంద్రమంత్రిగా ఉన్న సమయంలో బాబ్లీ ప్రాజె క్టు నిర్మాణం జరుగుతున్నా కూడా ఒక్కరోజు కూడా నోరు మెదపని కేసిఆర్‌, టిఆర్‌ఎస్‌ ప్రతినిధులు తమను నిందితులుగా చిత్రీకరించడాన్ని చూస్తూ ఊరుకోమన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా రివ్యూపిటీషన్‌ వేయాల ని డిమాండ్‌ చేశారు. కేంద్రప్రభుత్వం మహారాష్ట్ర,ఆంధ్రప్రదేశ్‌ రాష్టాల్రముఖ్యమంత్రులతో సమావేశం నిర్వ హించాలని డిమాండ్‌ చేశారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వంసైతం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించి ప్రతిని ధులను ప్రధానివద్దకు తీసుకువెళ్లాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో నిజామాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌ జిల్లాలకుచెందిన ఎమ్మెల్యేలు పలువురు హాజరయ్యారు.