బాలలే దేశానికి దశాదిశ

బాలల వైద్యం కోసం కొత్త పథకం ప్రారంభించిన సోనియా
పాల్ఘార్‌ : పిల్లలలో జన్మత: వచ్చే వ్యాధులు, లోపాలు, అవసరాలను గుర్తించి వైద్యం అందించే కొత్త పథకాన్ని యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ బుధవారం ప్రారంభించారు. మహారాష్ట్రలోని థానే జిల్లాలో పాల్ఘార్‌లో పథకాన్ని ప్రారంభించిన అనంతరం ఆమె మాట్లాడుతూ బాలలే దేశానికి భవిష్యత్తు అని, వారి బాగోగులు చూడడం అవసరమన్నారు. కాంగ్రెస్‌ నేతృత్వంలోని ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేయడంలో ముందుంటుందని చెప్పారు. దేశ ఆర్థిక అవసరాలను తీర్చడంలో ప్రభుత్వం పలు పథకాలు ప్రారంభిస్తుందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 27 కోట్ల మంది బాలలకుఉపయోగపడే కార్యక్రమాన్ని రూపొందించామని తెలిపారు. ప్రజారోగ్య పథకాలకు నిధుల కొరత లేదని చెప్పారు. తమ ప్రభుత్వం అన్ని వర్గాలకు న్యాయం చేసే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. త్వరలో ఆహార భద్రతా చట్టం అమలులోకి తెస్తామన్నారు. పిల్లలలో పోషకాహార లోపం సమస్య ఉందని అన్నారు. దీన్ని త్వరలోనే రూపుమాపేందుకు పలు కార్యక్రమాలు చేపతామని చెప్పారు. మహిళలకు పావలావడ్డీ రుణాలు, వృద్ధులకు పింఛన్లు, విద్యార్థులకు ఉపకారవేతనాలు చెల్లించిన ఘనత కాంగ్రెస్‌ ప్రభుత్వానిదేనని చెప్పారు. ఇకమీదట ఎవరు నిరుత్సాహ పడకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.