బిజెపిని గెలిపిస్తేనే అభివృద్ధి సాధ్యం
మోడీ సారధ్యమే శ్రీరామరక్ష: సోయం బాపురావు
ఆదిలాబాద్,మార్చి28(జనంసాక్షి): కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఉంటేనే దేశానికి రక్ష అని ఆదిలాబాద్ లోక్‌సభ భాజపా అభ్యర్థిగా పోటీచేస్తున్న సోయం బాపురావు అన్నారు. అన్నిరంగాల్లో దేశం అభివృద్ది చెందాలంటే మోడీ నాయక్తంవ కొనాగాలని అన్నారు. ఈ ఎన్నికల్లో తనను గెలిపిస్తే, ప్రజల కష్టాలను తీర్చడంతో పాటు లోక్‌సభ నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తానని అన్నారు. వివిధ గ్రామాల్లో ఆయన ఉదయమే ప్రచారం చేపట్టారు. ప్రజలను నేరుగా కలసి ఓట్లు అభ్యర్థించారు. కేంద ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల్ ఏ పనీ పూర్తి కాకుండా పోయిందన్నారు. ఆదివాసీల కష్టాలు తీర్చడంతో పాటు ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూరు కేంద్రంగా గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయిస్తానన్నారు. జిల్లా కేంద్రంలో విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయించి జిల్లాను అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా అందిస్తున్న నిధులతో రాష్ట్రంలో తెరాస ప్రభుత్వం పథకాలను అమలు చేస్తూ, అన్నీ తామే చేస్తున్నామంటూ ప్రజలను మభ్యపెడుతోందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో కేంద్ర ప్రభుత్వ వాటాను ప్రజలు గుర్తించేలా నాయకులు, కార్యకర్తలు ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు.సామాన్య కుటుంబం
నుంచి దేశ ప్రధానిగా ఎదిగిన నరేంద్రమోదీ పేదప్రజలు, అట్టడుగు వర్గాల అభివృద్ధిని కోరి పనులు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ హయాంలో జరగని అభివృద్ధి, భాజపా అయిదేళ్ల పాలనలో చేసి చూపిందన్నారు. భాజపా ప్రభుత్వం అందిస్తున్న నిధులతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ బర్రెలు, గొర్రెలు అందజేస్తూ గొప్పలు చెప్పుకుంటూ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. మత్స్యకారులకు అందించే పరికరాల్లో సైతం 50 శాతం రాయితీని కేంద్ర ప్రభుత్వమే అందిస్తోందన్నారు. కేంద్రం ఇచ్చే నిధులతోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రాయితీ పథకాలు అమలు చేస్తోందన్నారు. కాంగ్రెస్ హయాంలో గ్యాస్ సిలిండర్ కోసం ప్రజలు వరుసలు కట్టేవారన్నారు. భాజపా హయాంలో పేదలకు ఉచిత గ్యాస్‌కనెక్షన్లు అందించడంతో పాటు ఫోన్‌లో గ్యాస్ బుక్ చేస్తే ఒకరోజులో ఇంటివద్దకు గ్యాస్ సిలిండర్ వస్తోందన్నారు. కాంగ్రెస్, తెరాస మోసపూరిత మాటలను నమ్మకూడదని ప్రజలకు సూచించారు. ఆయనవెంట ఆదిలాబాద్ భాజపా జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్, ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్‌ఛార్జి ఆదినాథ్ తదితరులు పాల్గొన్నారు.