బిజెపి నాయకులవి దొంగ దీక్షలు

దమ్ముంటే యాసంగి పంట కొంటామని ప్రకటించాలి
కేంద్రం అలా ప్రకటిస్తే ..నేనే రాజీనామా చేస్తా
లేకుంటే కిషన్‌ రెడ్డి, బండి సంజయ్‌ రాజీనామాలు చేయాలి
మంత్రి నిరంజన్‌ రెడ్డి సవాల్‌
హైదరాబాద్‌,అక్టోబర్‌28 జనం సాక్షి: స్వార్థ రాజకీయ లబ్ది కోసం బిజెపి నాయకులు దొంగ దీక్షలు చేస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి ఎద్దేవా చేశారు. బిజెపి నాయకులు ఒట్టి మోసగాళ్లని ఆయన మండిపడ్డారు. బిజెపి నాయకులకు చిత్తశుద్ధి ఉంటే యాసంగి పంటలు కొనేలా కేంద్రాన్ని ఒప్పించాలని, అందుకోసం వారు చిత్తశుద్దితో దీక్షలు చేయాలని నిరంజన్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. తెలంగాణలో యాసంగి పంటలు కొనేలా బిజెపి నాయకులు గురువారం సాయంత్రం లోగా కేంద్రాన్ని ఒప్పించాలని, వారు ఈ మేరకు కేంద్రాన్ని ఒప్పిస్తే, తాను తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని, లేనిపక్షంలో కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి, బిజెపి తెలంగాణ శాఖ అధ్యక్షుడు బండి సంజయ్‌లు తమ పదవులకు రాజీనామా చేయాలని నిరంజన్‌ రెడ్డి సవాల్‌ విసిరారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికల కోసమే బిజెపి నాయకులు దొంగ దీక్షలు చేస్తున్నారని, అయితే ఇక్కడ వారి పప్పులు ఉడకవని, హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో అధికార టిఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ అఖండ మెజార్టీతో విజయం సాధించడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. ఈ ఉపఎన్నికలో బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్‌కు గెల్లు శ్రీనివాస్‌ చేతిలో ఘోర పరాభావం తప్పదని ఆయన స్పష్టం చేశారు.