బిసి రాజ్యాధికారమే లక్ష్యంగా ఉద్యమించాలి.
ఉమ్మడి జిల్లాలోని 7 అసెంబ్లీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పనిచేద్దాం.
బిసి పొలిటికల్ జెఏసీ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 6(జనంసాక్షి):
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఏడు అసెంబ్లీ, ఒక పార్లమెంటు స్థానాల్లో బీసీ అభ్యర్థులను గెలిపించుకుంటామని బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ పేర్కొన్నారు.
మంగళవారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో బీసీ సంఘాల ఆధ్వర్యంలో బిసి యువజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గద్దల రాజు గౌడ్ అధ్యక్షతన బిసి పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ కు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా రాచాల మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ళయినా బీసీల బతుకు మారలేదని, ఏ రాజకీయ పార్టీ కూడా బీసీల అభివృద్ధి కోసం చర్యలు చేపట్టలేదన్నారు.చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించకుండా రాజకీయం గాను అణచివేస్తున్నారని మండిపడ్డారు.
బీసీల జనాభా దామాషా ప్రకారం చట్టసభల్లో సీట్లు కేటాయించాలనే ఏకైక నినాదంతో బీసీ రాజకీయ ఐకాస ఏర్పాటు చేసినట్లు చెప్పారు.తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏ విధంగానైతే పార్టీలకు అతీతంగా వర్గాలకతీతంగా ఉద్యమం చేసి రాష్ట్రాన్ని సాధించుకున్నామో అదే స్ఫూర్తితో సంఘాలకతీతంగా పార్టీలకతీతంగా అందరం ఏకమై బిసి రాజ్యాధికారాన్ని సాధించుకుందామని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా స్థానిక మెడికల్ కళాశాల అంశంపై మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలకు మెడికల్ కాలేజీలు మంజూరు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నామని, అదే సందర్భంలో నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో రైతులతో బలవంతంగా భూములు లాక్కుని ఆ స్థలంలో మెడికల్ కళాశాల నిర్మిస్తున్నారని, నిర్వాసితులకు సరైనటువంటి నష్టపరిహారం ఇవ్వకుండా నిర్మాణ పనులు చేపట్టడంపై మండిపడ్డారు.ప్రజలకు న్యాయం చేయాల్సినటువంటి స్థానిక ఎమ్మెల్యే నిర్వాసితులపై కనీసం కనికరం లేకుండా మార్కెట్లో కోట్ల విలువ చేసే భూమిని అతి చౌకగా లాక్కోవడంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం న్యాయం చేయాలని నిర్వాసితుల సమస్యలపై బీసీ పొలిటికల్ జేఏసీ తరపున పోరాటం చేస్తామని తెలిపారు.అనంతరం బిసి పొలిటికల్ జేఏసీ చైర్మన్ గా ఎన్నికైనటు వంటి రాచాల యుగంధర్ గౌడ్ ని మరియు జిల్లా కన్వీనర్ గా ఎన్నికైనటువంటి అరవింద చారిని సంఘాల నాయకులు శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో జాతీయ బిసి సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు డాక్టర్ కాళ్ళ నిరంజన్, బిసి యువజన సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు శశికుమార్ గౌడ్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కుంభం మల్లేష్ గౌడ్, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు నిరంజన్ యాదవ్,విశ్వ బ్రాహ్మణ సంఘం నాయకులు జయప్రకాష్ చారి,బీసీ సేన జిల్లా అధ్యక్షుడు కొట్ర శ్రీనివాసులు, ప్రచార కార్యదర్శి గంగోజి,బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు, నాయకులు భీమన్న నాయుడు, అంజన్న యాదవ్, మహీందర్ నాయుడు, రామయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.