బీఎస్పీ నేత దారుణహత్య

సీసీ టీవీకి చిక్కిన కాల్పుల నిందితులు
న్యూఢిల్లీ, మార్చి 26 (జనంసాక్షి): బహుజన్‌ సమాజ్‌వాది పార్టీనేత, ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి దీపక్‌ భరద్వాజ్‌(62) మంగళవారం నాడు హత్యకు గురయ్యారు. ఢిల్లీ గుర్గాం సరిహద్దుల్లోని ఆయన ఫాంహౌస్‌లో ఈ సంఘటన జరిగింది. 2009 ఎన్నికల్లో ఆయన బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేశారు. రూ.600 కోట్ల ఆస్తులు ఉన్నట్టు ఆయన అప్పుడు అఫిడవిట్లో పేర్కొన్నారు. సమచారాం తెలిసిన వెంటనే పోలీసు ఉన్నతాధికారులు సంఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు భరద్వాజ్‌ ఫాంహౌస్‌లోకి నల్ల స్కోడా కారులో వచ్చారని పోలీసులు తెలిపారు. భరద్వాజ్‌, అక్కడ ఉన్న మరో ఇద్దరు వ్యక్తులపై దుండగుటు కాల్పులు జరిపి పరారయ్యారని తెలిపారు. ఈ ఘటనకు కారణాలు ఇంకా తెలియరాలేదన్నారు. భరద్వాజ్‌తో ఉన్న తగాదాలే ఆయన హత్యకు దారితీసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కాల్పులు జరిగిన వెంటనే గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించామని, అక్కడే భరద్వాజ్‌ మృతి చెందాడని పోలీసులు తెలిపారు. పూర్తి భద్రత ఉన్న ఫాంహౌస్‌లోకి కారు రాగలిగిందంటే అక్కడ భద్రతా సిబ్బందికి, భరద్వాజ్‌కు తెలిసిన వ్యక్తులే అయి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.  గాయపడిన ముగ్గురిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. ఎయిమ్స్‌ ఆస్పత్రిలో భరద్వాజ్‌ మృతదేహానికి నిర్వహిస్తారని తెలిపారు. 2009 ఎన్నికల్లో పోటీ చేసిన అత్యంత ధనిక అభ్యర్థిగా భరద్వాజ్‌ పేరొందారు.