బీబీనగర్ నిమ్స్‌ను ఎయిమ్స్‌గా మారుస్తాం
తెలంగాణ పది జిల్లాలకు బీబీనగర్ అనుకూలం
ఆసుపత్రిని సందర్శించిన సీఎం కేసీఆర్
నల్లగొండ,జనవరి20(జనంసాక్షి): బీబీనగర్ నిమ్స్ స్థానంలో ఎయిమ్స్ రానుంది. దీనిని ఎయిమ్స్ స్థాయిలో అభివృద్ది చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. మంగళవారం సాయంత్రం ఆయన ఈ ఆస్పత్రిని సందర్శించి పరిశీలించారు. నల్గొండ జిల్లా బీబీనగర్ గ్రామ పరిధిలో నిర్మిస్తున్న నిమ్స్ స్థానంలో ఏయిమ్స్‌ను నెలకొల్పనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. విభజన బిల్లు ప్రకారం కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఏయిమ్స్‌ను మంజూరు చేసింది. ఏయిమ్స్ స్థాపించడానికి అనువైన ప్రాంతం, స్థలం కేటాయించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. ఈనేపధ్యంలో ముఖ్యమంత్రి కేసిఆర్ మంగళవారం బీబీనగర్‌లోని నిర్మాణంలో ఉన్న నిమ్స్‌ను సందర్శించారు. అధికారులతో సవిూక్ష జరిపారు. బీబీనగర్, కొండమడుగు తదితర ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న భూమి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతానికి 400 ఎకరాల భూమి అందుబాటులో ఉందని, మరికొంత భూమి సేకరించే అవకాశం ఉందని అంచనాకు వచ్చారు. హైదరాబాద్‌కు సవిూపంలో ఉండటం, హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారి ప్రక్కనే ఉండడం, రింగురోడ్డు కూడా దగ్గరే ఉండడం తదితర సానుకులతలు బీబినగర్‌కు ఉన్నాయని ముఖ్యమంత్రి చెప్పారు. బీబీనగర్‌లో జాతీయ స్థాయి వైధ్య శాఖ అయిన ఏయిమ్స్ ఏర్పాటు కానుండడం తెలంగాణలోని అన్ని జిల్లాలకు అనుకూలంగా ఉంటుందన్నారు. రోగులు, వైద్యులకు కూడా ఈస్థలం అనువైనదన్నారు. వైద్య శాలతో పాటు వైద్యకళాశాల, నర్సింగ్ లాంటి కళాశాలలు వినోద, వ్యాపార, విద్యా సంస్థలు కూడా వస్తాయని, అద్బుతమైన టౌన్‌షిప్ అభివృద్ది చెందుతుందని ముఖ్యమంత్రి అన్నారు. బీబినగర్‌లో హెల్త్ స్మార్ట్ సిటి రావాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న భవనం, స్థలం ఏయిమ్స్‌కు అప్పగిస్తామని వెల్లడించారు. బీబీనగర్‌లో ఎయిమ్స్ ఏర్పాటైతే అన్ని జిల్లాలకు అందుబాటులో ఉంటుందని సీఎం అభిప్రాయమని ఉపముఖ్యమంత్రి రాజయ్య చెప్పారు. బీబీనగర్ నిమ్స్‌కు 400 ఎకరాల స్థలం అందుబాటులో ఉందన్నారు. ఎయిమ్స్ కోసం మరికొంత స్థలం కేటాయిస్తామన్నారు. బీబీనగర్ నిమ్స్‌లో మంగళవారం మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో సీఎం కేసీఆర్ సవిూక్ష నిర్వహించారు. ఆ సవిూక్ష వివరాలను ఉపముఖ్యమంత్రి రాజయ్య, ఎంపీ బూర నర్సయ్య గౌడ్ విలేకరులకు వివరించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో హెల్త్‌హబ్‌లను ఏర్పాటు చేసి బీబీనగర్‌ను స్మార్ట్‌సిటీగా తీర్చిదిద్దేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. డిప్యూటి సిఎం డా.టి.రాజయ్య,ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, ఎంపి బూర నర్సయ్యగౌడ్, పార్లమెంటరీ కార్యదర్శి జి.కిషోర్, ఎమ్మల్యేలు శేఖర్ రెడ్డి, గొంగిడి సునీత, సుధీర్‌రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, మండలి వైస్ చైర్మన్ ఎన్.విద్యాసాగర్, ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, పూల రవీందర్, వైద్యశాఖ కార్యదర్శి సురేష్ చంద్ర, కలెక్టర్, జడ్పి చైర్మన్ బాలునాయక్, తదితరులు పాల్గొన్నారు.