బీసీసీఐకు లోథా కమిటీ షాక్
భారత క్రికెట్ నియంత్రణ మండలిలో ఆఫీస్ బేరర్లుగా ఉన్నవాళ్లను తొలిగించాలని లోథా కమిటీ అభిప్రాయపడింది. బోర్డు కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు మాజీ సెక్రటరీ జీకే పిళ్లేను అబ్జర్వర్‌గా నియమించాలని కమిటీ సూచించింది. బీసీసీఐ కార్యకలాపాలను ఆడిట్ చేసేందుకు అధికారులను నియమించే బాధ్యత కూడా పిళ్లేకు కల్పించాలని లోథా ప్యానెల్ కోరింది. ఐపీఎల్ కుంభకోణం బయటపడడంతో బీసీసీఐలో ప్రక్షాళన చేపట్టేందుకు సుప్రీంకోర్టు లోథా కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే లోథా ప్యానెల్‌కు, క్రికెట్ బోర్డు అనేక అంశాలపై అభిప్రాయ భేదాలు ఉన్నాయి. లోథా చేసిన అన్ని ప్రతిపాదనలను అమలు చేయడం సాధ్యం కాదని బీసీసీఐ ఇప్పటికే స్పష్టం చేసింది. డిసెంబర్ 3వ తేదీలోపు లోథా సూచనలను అమలు చేయాలని బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్‌కు కోర్టు ఆదేశాలు కూడా జారీ చేసింది.