బెంగళూర్‌లో భాజపా కార్యాలయం వద్ద బాంబు పేలుడు

పలువురికి గాయాలు
బెంగళూరు, ఏప్రిల్‌ 17 (జనంసాక్షి) : బెంగళూరులో భారతీయ జనతా పార్టీ కార్యాలయం వద్ద బుధవారం జంట బాంబు పేలుళ్లు జరిగాయి. ఉదయం బీజేపీ కార్యాలయం వద్ద బుధవారం పేలుడు సంభవించింది. తర్వాత మధ్యాహ్నం సమయంలో హెబ్బల్‌ ప్రాంతంలో మరో బాంబు పేలింది. రెండు ఘటనల్లో ఎనిమిది మంది పోలీసులు సహా 35 మందికి పైగా గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఇది పక్కా వ్యూహం ప్రకారం జరిపిన దాడి అని పోలీసులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న జాతీయ దర్యాప్తు బృందం (ఎన్‌ఐఏ) బృందం హుటాహుటిన బెంగళూరు చేరుకొంది. ఘటన స్థలం నుంచి పలు ఆధారాలు సేకరించింది. భారీ శబ్ధం రావడంతో తొలుత కారులో ఉన్న సిలిండర్‌ పేలిందని అంతా భావించారు. కానీ, వ్యూహం ప్రకారమే మోటార్‌ సైకిల్‌పై బాంబు అమర్చి పేల్చినట్లు పోలీసులు నిర్ధారించారు. పేలుడు దాటికి పక్కనే ఉన్న నాలుగు వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. బెంగళూరులోని మల్లేశ్వరంలో ఉన్న బీజేపీ కార్యాలయం వద్ద బుధవారం పలు వాహనాలు పార్కు చేసి ఉంచారు. వాటి పక్కనే దుండగులు ఓ మైటార్‌సైకిల్‌కు బాంబు అమర్చి పేలుడుకు పాల్పడ్డారు. పేలుడు దాటికి పలు వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో ఎనిమిది పోలీసులతో పాటు 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.పేలుడు శబ్ధం మూడు కిలోవిూటర్ల దూరం వరకు వినిపించింది. ఒక్కసారిగా భారీ శబ్ధం రావడంతో అక్కడే ఉన్న జనం భయంతో పరుగులు తీశారు. సమాచారమందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానాకి చేరుకున్నారు. బాంబు స్క్వాడ్‌తో తనిఖీలు నిర్వహించారు. పేలుడు ఘటనపై విచారణ ప్రారంభించారు. మోటార్‌సైకిల్‌లో బాంబు పేలడంతోనే ప్రమాదం సంభవించిందని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఇది బాంబు పేలుడేనని బెంగళూరు పోలీసు కమిషనర్‌ రాఘవేంద్ర ఔరద్కర్‌ తెలిపారు. ఘటన స్థలాన్ని పరిశీలించిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ… మోటార్‌సైకిల్‌లో బాంబు అమర్చి పేల్చారని చెప్పారు. కార్ల మధ్యలో మోటార్‌సైకిల్‌ నిలిపి ఈ ఘటనకు పాల్పడినట్లు తెలిపారు. అయితే, ఇందుకు ఏయే పేలుడు పదార్థాలు ఉపయోగించారనేది ఇప్పుడే చెప్పలేమన్నారు. మరోవైపు, పేలుడు సమాచారమందుకున్న ఎన్‌ఐఏ అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. పేలుడు జరిగిన ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకొని, ఆధారాలు సేకరించారు. పేలుడు జరిగిన సమయంలో బీజేపీ కార్యాలయంలో నేతలు ఎవరు లేరు. కర్ణాటక అసెంబ్లీకి మే 5న ఎన్నికలు జరగనున్న తరుణంలో పేలుడు చోటు చేసుకోవడం గమనార్హం. ఈ ఘటనతో పోలీసులు అప్రమత్తమయ్యారు. నగర వ్యాప్తంగా తనిఖీలు, సోదాలు ముమ్మరం చేశారు.