బెంగాలీ దర్శకుడు ఘోష్‌ ఇకలేరు

పిన్న వయసులో ప్రతిభ చాటిన రితూపర్ణ
12 జాతీయ అవార్డులు సొంతం
కోల్‌కతా, మే 30 (జనంసాక్షి) :
ప్రఖ్యాత బెంగాలీ దర్శకుడు రితుపర్ణో ఘోష్‌ (49) ఇకలేరు. గురువారం తెల్లవారుజామున గుండెపోటుతో ఆయన తన నివాసంలో కన్నుమూశారు. కొంతకాలంగా పాంక్రియాటిస్‌ సమస్యతో బాధ పడుతున్న ఆయన గుండెపోటు రావడంతో గురువారం ఉదయం 7.30 గంటలకు మృతిచెందారని కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రఖ్యాతిగాంచిన సినిమాలు తీసిన ఘోష్‌.. అతి తక్కువ సమయంలోనే అనేక అవార్డులు గెలుచుకున్నారు. 12 జాతీయ పురస్కారాలతో పలు అంతర్జాతీయ అవార్డులు ఆయనను వరించాయి. ఆయన రూపొందించిన ‘అబొమోన్‌’ బెంగాలీ చిత్రానికి గాను 2012లో స్పెషల్‌ జ్యూరీ జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. 19 ఏళ్ల సినీ జీవితంలో ఆయన తీసిన 12 జాతీయ పురస్కారాలు సాధించారు. 1994లో చిన్నారుల చిత్రం ‘హిరర్‌ అంగ్తి’కి దర్శకత్వం వహించి సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. తర్వాతి సంవత్సరంలో ఆయన నిర్మించిన ‘యునిశే ఏప్రిల్‌’ చిత్రం జాతీయ అవార్డును సాధించిపెట్టింది. ఆయన నిర్మించిన దహాన్‌, అశుఖ్‌, చక్కర్‌ బాలి, రెయిన్‌కోట్‌, బారివాలి, అంతర్‌మహాల్‌, నౌకాదుబి వంటి చిత్రాలు విమర్శకుల ప్రశంసలందుకున్నాయి. ఘోష్‌ తండ్రి కూడా డాక్యుమెంటరీ చిత్ర నిర్మాతగా ప్రముఖ స్థానం సంపాదించుకున్నారు.చిన్న వయస్సులోనే ప్రఖ్యాతిగాంచిన ఘోష్‌ మరణంపై బాలివుడ్‌, బెంగాలీ చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ఘోష్‌ మృతదేహానికి నివాళులర్పించారు. ఒక మంచి ప్రతిభావంతుడ్ని కోల్పోయామని ఆమె పేర్కొన్నారు. పలువురు సినీ ప్రముఖులు ఘోష్‌ మృతికి సంతాపం ప్రకటించారు. ఆయనతో కలిసి పని చేసిన నటీ నటులు కోల్‌కతాలోని ఘోష్‌ ఇంటికి వచ్చి నివాళులు అర్పించారు. ఘోష్‌ మృతిపై సౌమిత్రా చటార్జి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఇక లేరంటే నమ్మలేక పోతున్నానని, ఈ విషయం అంగీకరించడం చాలా ఇబ్బందిగా ఉందని పేర్కొన్నారు. తక్కువ సమయంలో ప్రఖ్యాతికెక్కిన ఓ మంచి దర్శకుడ్ని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. శేఖర్‌ కపూర్‌, అనుపమ్‌ ఖేర్‌, అర్జున్‌ రాంపాల్‌, గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ తదితరులు సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్లలో తమ సంతాపాన్ని ప్రకటించారు.