బెయిల్‌ ఫర్‌ ఓట్‌ విభేదాలు మరిచి ప్రణబ్‌కు

ఓటెయ్యాలని వైకాపా నిర్ణయం
రాజకీయాలకు అతీతంగా వ్యవహరిస్తారనే నిర్ణయం తీసుకున్నారట !
మేకపాటి వెల్లడి
హైదరాబాద్‌, జూలై 18:రాష్ట్రపతి ఎన్నికల్లో యుపిఎ అభ్యర్ధి ప్రణబ్‌కు మద్దతు తెలుపుతున్నట్టు వైఎస్‌ఆర్‌సిపి నేత, ఎంపి మేకపాటి రాజ్‌మోహన్‌రెడ్డి తెలిపారు. అలాగే యుపిఎ ఉపరాష్ట్రపతి అభ్యర్ధిగా పోటీ చేస్తున్న హమీద్‌ అన్సారీకి కూడా మద్దతు తెలుపుతున్నామన్నారు. స్థానిక లోటస్‌పాండ్‌లోని పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆ పార్టీ నేతలు మేకపాటి రాజ్‌మోహన్‌రెడ్డి, మైసూరారెడ్డి మాట్లాడారు. తొలుత మేకపాటి మాట్లాడుతూ అత్యంత గౌరవప్రదమైన రాష్ట్రపతి పదవికి ఎన్నిక జరుగుతుంటే తటస్థంగా ఉండకూడదని, ప్రణబ్‌కే మద్దతు ఇవ్వాలని పార్టీలోని అందరితో చర్చించి నిర్ణయం తీసుకున్నామన్నారు. రాష్ట్రపతిగా దేశంలోని అందరికి పార్టీలకు అతీతంగా న్యాయం చేయగలరన్న విశ్వాసంతోనే తమ పార్టీ ఆయనకు మద్దతు ఇస్తోందన్నారు. సంకీర్ణ యుగంలో ప్రణబ్‌ అందరికీ సహకరిస్తారని భావించామన్నారు. కోర్టు పరిధిలో ఉన్న విషయానికి, రాష్ట్రపతి అభ్యర్ధి ప్రణబ్‌కు మద్దతు తెలిపే విషయానికి ముడిపెట్టొద్దన్నారు. అనంతరం మైసూరారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రపతి ఎన్నికల బరిలో నిలిచింది ఇద్దరేనని, వారిలో ఒకరికి మద్దతు ఇవ్వాలన్న విషయంపై చర్చించుకున్నామని, ప్రణబ్‌కే ఇవ్వాలని తుది నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.