బొగ్గు బొక్కేశారు

జేపీసీ నివేదిక బట్టబయలు
న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 23 (జనంసాక్షి) : బొగ్గు బ్లాకుల కేటాయింపుల్లో అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయని సంయుక్త పార్లమెంటరీ సంఘం (జేపీసీ) తేల్చిచెప్పింది. తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ కళ్యాణ్‌బెనర్జీ నేతృత్వంలో ఏర్పాటు చేసిన జేపీసీ బొగ్గు బ్లాకు కేటాయింపుల్లో జరిగిన అవకతవకలను కడిగి పారేసింది. ఎలాంటి టెండర్లు ఆహ్వానించకుండా చేపట్టిన ప్రైవేటు సంస్థలకు బ్లాకుల కేటాయింపుల్లో అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయని పేర్కొంది. జేపీసీ దర్యాప్తు నివేదికను మంగళవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన అనంతరం బెనర్జీ పార్లమెంట్‌ వెలుపల మీడియాతో మాట్లాడారు. 1993 నుంచి జరిగిన బొగ్గు బ్లాకుల కేటాయింపులన్నింటిలో  అక్రమాలు జరిగాయని, వాటన్నింటినీ రద్దు చేయాలని జేపీసీ సూచించినట్లు చెప్పారు. లైసెన్స్‌లు రద్దు చేసి కేటాయింపులు చేసిన వారిని విచారణ జరపాలని కోరారు. ఈ కేటాయింపుల జరిగిన నష్టాన్ని మాత్రం స్పష్టంగా చెప్పలేమన్నారు. ఈ విషయంపై తాము బొగ్గు మంత్రిత్వ శాఖను పలుమార్లు సంప్రదించినా స్పందనలేదని పేర్కొన్నారు. కేటాయించిన 218 బొగ్గు బ్లాకుల్లో 30 బ్లాకుల్లో మాత్రమే బొగ్గు ఉత్పత్తి జరగడం అనేక ప్రశ్నలకు తావిస్తోందని పేర్కొన్నారు. అక్రమ కేటాయింపుల వల్ల ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం రాకుండా పోయిందని, ప్రైవేటు వ్యక్తులు, సంస్థలు లబ్ధిపొందాయని చెప్పారు. అవే బొగ్గు బ్లాకులను ప్రజల ప్రయోజనార్థం వినియోగించి ఉంటే ఎంతో విద్యుత్‌ ఉత్పత్తి జరిగేదని పేర్కొన్నారు. ఎలాంటి టెండర్లు ఆహ్వానించకపోవడం, డిస్కమ్‌లు, ప్రభుత్వాల అధీనంలోని విద్యుత్‌ ఉత్తత్తి సంస్థలను బిడ్డింగ్‌కు ఆహ్వానించకపోవడం వెనుక పెద్ద తతంగామే నడించిందన్నారు. అందుకే బొగ్గు మంత్రిత్వ శాఖ పూర్తిస్థాయి వివరాలు వెల్లడించనట్టుగా అర్థమవుతోందని అన్నారు.