బొగ్గు మాది.. కరెంట్ మీదా?
విద్యుత్ సౌధాలో మిన్నంటిన జై తెలంగాణ
పాలకుల వివక్షపై ధ్వజమెత్తిన ఈటెల, దేవీప్రసాద్
హైదరాబాద్, మార్చి 5 (జనంసాక్షి) :
బొగ్గు ఉత్పత్తి అయ్యేది తెలంగాణలోని సింగరేణి బొగ్గు గనుల్లో కరెంట్ మాత్రం సీమాంధ్ర ప్రాంతానికి ఇస్తారా అంటూ టీఆర్‌ఎస్ ఎల్పీ నేత ఈటెల రాజేందర్, టీఎన్‌జీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు దేవీప్రసాద్ ప్రశ్నించారు. మంగళవారం నగరంలోని ఖైరతాబాద్ విద్యుత్ సౌధాలో తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజినీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో వారు మాట్లాడారు. తెలంగాణ ప్రాంతంలోని రైతాంగానికి వ్యవసాయానికి సరేపడే విద్యుత్ సరఫరా చేసే వనరులు తెలంగాణలో ఉన్న విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటులో సీమాంధ్ర పాలకులు తీవ్ర వివక్ష చూపుతున్నారని మండిపడ్డారు. ప్రత్యేక రాష్ట్రం అడుగుతున్నారనే ప్రజలను కరెంటు కష్టాల పాలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రబీలో తెలంగాణ భూములకు సరిపడా విద్యుత్ ఉత్పత్తి చేసే అవకాశమున్నా ప్రభుత్వం అలా చేయకుండా కావాలని పంటలను ఎండబెడుతోందని తెలిపారు. తెలంగాణ రైతులను, ప్రజలను ఇబ్బంది పెట్టడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఆరోపించారు. 2006లో నియమితులైన జూనియర్ లైన్‌మన్లను కాంట్రాక్టు ఉద్యోగులుగా మార్చాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కుట్రలను సమర్థవంతంగా ఎదుర్కొని తిప్పికొడుతామని వారు హెచ్చరించారు. విద్యుత్ శాఖలో డైరెక్టర్ పోస్టులను తెలంగాణ ప్రాంతం వారికే ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ప్రజాగాయకుడు గద్దర్, తెలంగాణ నగారా సమితి నాయకులు నాగం జనార్దన్‌రెడ్డి, వేణుగోపాలాచారి తదితరులు పాల్గొన్నారు.