బోస్టన్‌ పేలుళ్ల అనుమానితుడి కాల్చివేత

మరొకరి కోసం గాలింపు
బోస్టన్‌, (జనంసాక్షి) : బోస్టన్‌ మారథాన్‌లో పేలుళ్లకు పాల్పడినట్లుగా అనుమానిస్తున్న వారిలో ఒకరిని పోలీసులు కాల్చింపారు. మరో వ్యక్తి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ప్రతి ఇంటినీ క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. బోస్టన్‌ మారథాన్‌లో పేలుళ్లకు పాల్పడిన ఇద్దరు అనుమానితుల ఫొటోలను భద్రతా బలగాలు విడుదల చేశాయి. వారు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశాయి. ఇదిలా ఉంటే, ఇద్దరు వ్యక్తులు ‘మిట్‌’ క్యాంపస్‌లోకి చొరబడి, భద్రతా సిబ్బంది ఒకరిని కాల్చివేశారు. అనంతరం తుపాకీ చూపి ఓ కారులో పరారయ్యారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు కారును వెంబడించారు. ఈ సంద్భంగా జరిగిన ఎదురుకాల్పుల్లో దుండగుడు తీవ్రంగా గాయపడ్డాడు, మరో వ్యక్తి పరారయ్యాడు. గాయపడిన దుండగుడిని పోలీసులు ఆస్పత్రికి తరలిస్తుండగా మధ్యలోనే మృతి చెందాడు. కాల్పుల్లో హతమైన వ్యక్తిని బాంబు పేలుళ్లకు పాల్పడిన వ్యక్తిగా గుర్తించారు. ఇద్దరు ఉగ్రవాదులు ప్రజలను చంపడానికే బోస్టన్‌ వచ్చారని పోలీసులు తెలిపారు. పారిపోయిన ఉగ్రవాది కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ఎవరైనా అనుమానితులు కనిపిస్తే సమాచారమివ్వాలని కోరారు. మరోవైపు, ఈ ఉదంతంపై ఎఫ్‌బీఐ దృష్టి సారించింది. ఏం జరిగిందనేది స్థానిక అధికారుల నుంచి ఆరా తీస్తోంది. ఎఫ్‌బీఐ ఏజెంట్లు మిట్‌ క్యాంపస్‌ను సందర్శించి దర్యాప్తు చేపట్టారు.

తాజావార్తలు