బ్రాహ్మణి స్టీల్స్‌ భూముల కేటాయింపు రద్దు

నేడో రేపో జీవో
హైదరాబాద్‌, ఏప్రిల్‌ 25 (జనంసాక్షి): కడప జిల్లా జమ్మలమడుగులో బ్రాహ్మణిస్టీల్‌ సంస్థ ఏర్పాటు కోసం వైఎస్‌ ముఖ్యమంత్రిగా ఉన్నసమయం లో సుమారు 11వేల ఎకరాల భూములను కేటాయించారు. గాలి జనార్దన్‌రెడ్డికి చెందిన బ్రాహ్మణిస్టీల్‌ సంస్థ ఆనాడు ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను తుంగలో తొక్కడం వల్ల నేటికి అక్కడ స్టీల్‌ సంస్థ ఏర్పాటు అడుగులు వేయలేదు. ఆతర్వాత జరిగిన పరిణామాల వల్ల గాలిజనార్దన్‌రెడ్డి జైలు పాలు కావడం, వైఎస్‌ మరణించడంతో సమస్య జటిలంగానే మారింది. దీంతో అటు కాంగ్రెస్‌ నేతలు, ఇటు ప్రతిపక్షాలు సైతం ప్రభుత్వంపై భూముల రద్దుకు డిమాండ్‌ చేస్తూ ఆందోళనలు సైతం చేపట్టారు. తీవ్ర ఒత్తిళ్లకు లొంగిన కిరణ్‌కుమార్‌రెడ్డి ఎట్టకేలకు బ్రాహ్మణిస్టీల్స్‌కు కేటాయించిన 10వేల 760 ఎకరాల భూముల కేటాయింపును రద్దు చేస్తూ సిఎం సంతకం చేశారు. దీనివల్ల అటు కాంగ్రెస్‌, ఇటు ప్రతిపక్షాలు హర్షం వ్యక్తంచేస్తున్నాయి. అయితే ఇదే స్థలంలో మరో కంపెనీని పిలిపించి స్టీల్‌ సంస్థగానిక మరేదైనా స్థానికులకు ఉపాధి కల్పించే సంస్థను నెలకొల్పాలని కోరుతున్నారు. బద్వేలు మాజీ ఎమ్మెల్యే శివరామకృష్ణారావు సిఎంను కలిసి బ్రాహ్మణి సంస్థకు భూముల కేటాయింపును రద్దు చేసినందుకు కృతజ్ఞతలు చెప్పడమేకాక, మరో సంస్థతో పరిశ్రమను నెలకొల్పాలని కోరారు. ఇదిలా ఉంటే ఎన్టీఆర్‌ట్రస్ట్‌ భవన్‌లో టిడిపినేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఈ చర్యను ఎప్పుడో తీసుకోవాల్సిందంటున్నారు. అయితే ఇంతటితో ఆగకుండా ఆనాడు జరిగిన కుట్ర, అవినీతికి పాల్పడిన వ్యవహారంపై కూడా చర్యలుతీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు.