భగ్గుమన్న ఓయూ

బైక్‌ ర్యాలీపై పోలీసు దమనకాండ
పేలుతున్న టియర్‌ గ్యాస్‌
హైదరాబాద్‌, జూన్‌ 12 (జనంసాక్షి) :
సీమాంధ్ర సర్కారు నిర్బంధాలపై ఉస్మానియా యూనివర్సిటీ భగ్గుమంది. చలో అసెంబ్లీ కార్యక్రమానికి అనుమతి నిరాకరించిన ప్రభుత్వం పది జిల్లాల్లో ఎక్కడికక్కడ పోలీస్‌ పికెట్లు ఏర్పాటు చేసి తెలంగాణ ప్రజలను అరెస్టులు, బైండోవర్ల పేరుతో నిర్బంధించడాన్ని నిరసించారు. చలో అసెంబ్లీకి అనుమతివ్వాలంటూ విద్యార్థులు బుధవారం నిర్వహించిన బైక్‌ ర్యాలీలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. చలో అసెంబ్లీకి అనుమతి ఇవ్వాలని కోరుతూ మధ్యాహ్నం ఓయూ విద్యార్థులు ఆర్ట్స్‌ కాలేజీ నుంచి బైక్‌ ర్యాలీ ప్రారంభించారు. ఎన్‌సిసి గేటు వద్దకు ర్యాలీ చేరుకోగా అక్కడ అడ్డంగా బారికేడ్లను  ఏర్పాటు చేశారు. అప్పటికే ఎన్‌సీసీ గేటు వద్ద భారీగా మోహరించిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. క్యాంపస్‌ బయటకు రాకుండా నిలువరించారు. బైక్‌ ర్యాలీకి అనుమతి లేదని స్పష్టం చేశారు. అయితే, తాము శాంతియుతంగానే బైక్‌ ర్యాలీ నిర్వహిస్తున్నామని, తమను విడిచిపెట్టాలని విద్యార్థి నేతలు కోరారు. విద్యార్థులు ఎంతగా విజ్ఞప్తి చేసినా పోలీసులు వినలేదు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థులు రోడ్డుకు అడ్డంగా పెట్టిన బారికేడ్లను తొలగించేందుకు యత్నించారు. ఒక్కసారిగా రెచ్చిపోయిన ఖాకీలు లాఠీలు రaళిపించారు. విద్యార్థులపై గుంపులు గుంపులుగా ఎగబడ్డారు. దొరికిన వారిని దొరికినట్లు చావబాదారు. పోలీసుల చర్యతో ఆగ్రహం చెందిన విద్యార్థులు రాళ్లతో దాడి చేశారు. ఖాకీలపై రాళ్ల వర్షం కురిపించారు. దీంతో పోలీసులు భాష్పవాయు గోళాలు ప్రయోగించారు. పోలీసుల దాడితో వెనక్కు వెళ్లిన విద్యార్థులు కొద్దిసేపటి తర్వాత మళ్లీ ముందుకు వచ్చారు. మళ్లీ పోలీసులు అడ్డుకోవడం, విద్యార్థులు రాళ్ల వర్షం కురిపించడం, భాష్పవాయు గోళాలు మార్మోగడం  దాదాపు రెండు గంటలకు పైగా ఓయూలో యుద్ధ వాతావరణం నెలకొంది.