భద్రాచలం పట్టణ పరిశుభ్రతకు సహకరించండి
ఖమ్మం, అక్టోబర్ 28 : ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలం పట్టణ పరిశుభ్రతకు అందరూ సహకరించాలని భద్రాచలం పట్టణ ప్రత్యేకాధికారి, సబ్ కలెక్టర్ భరత్‌గుప్తా వ్యాపారులను కోరారు. భద్రాచలం పట్టణంలోని షాపుల యజమానులు దుకాణాల ముందు డ్రైనేజీలను పూర్తిగా మూసివేయడం వల్ల లోపల చెత్తాచెదారం పేరుకుపోయి మురుగునీటి ప్రవాహం నిలిచిపోతుందన్నారు. ఫలితంగా వర్షం వచ్చినప్పుడు రహదారులపై మురుగునీరు ప్రవహిస్తుందన్నారు. భద్రాచలంలోని ఉదయభాస్కర్ రోడ్డు, మార్కెట్ రోడ్డు, పిల్లల పార్క్ రోడ్డు, బ్రిడ్జి రోడ్లలో ఈ పరిస్థితి ఎదురవుతుందన్నారు. భద్రాచలం బస్టాండ్ వెనక ఉన్న పార్క్ రోడ్డు, బ్రిడ్జిరోడ్డులోని బస్టాండ్ ముందు, కనకదుర్గ గుడి పక్కన వాహనాల పార్కింగ్ వెనకకు జరిపించాలని ఆయన అధికారులకు సూచించారు. భద్రాచలంలోని గోదావరి స్నాన ఘట్టాల వద్ద మురుగునీరంతా గోదావరిలో కలవకుండా చర్యలు చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. స్నానాల ఘట్టాల సమీపంలో, గోదావరి తీరమంతా పరిశుభ్రంగా ఉండాలని ఆయన అధికారులను ఆదేశించారు.