భద్రాద్రి మాస్టర్‌ప్లాన్‌ వెనక్కి పోయినట్లేనా?

హడావిడి చేసినా ముందుకు సాగని వైనం

భద్రాద్రి,జూలై11(జనం సాక్షి): యాదాద్రి తరహాలోనే భద్రాద్రిని కూడా అద్భుత పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దే సంకల్పానికి ముహూర్తం కుదరడం లేదు. మరోవైపు పోలవరంతో భద్రాద్రికి ముప్పు అన్న ఆందోళన వస్తోంది. ఈ రెడు విషయాలపై ఎలాంటి స్పందనా కానరావడం లేదు. మరోవైపు భద్రాద్రి రక్షణకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. దీనికితోడు కరోనాతో భద్రాద్రి ఆదాయం కూడా పూర్తిగా పడిపోయింది. భద్రాచలం ఆలయ అభివృద్ధికి సంబంధించిన మాస్టర్‌ప్లాన్‌ రూపకల్పన పై ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు సూచన మేరకు చినజీయ్యర్‌ స్వామి గతంలో ప్రత్యేక భద్రాచలానికి వచ్చి అధికారులు, ఆనాటి మంత్రి తుమ్మల తదితరులతో చర్చించారు. పలుసూచనలు చేశారు. ఆలయ అధికారులు, దేవస్థానం పండితులు, స్తపతులతో కలిసి భద్రాద్రి అభివృద్ధి మాస్టర్‌ ప్లాన్‌ గురించి చర్చించారు. కానీ అవన్నీ పక్కకుపోయాయి. తుమ్మల రాజకీయంగా తెరవెనక్కి వెళ్లారు. చినజీయర్‌తో సిఎం కెసిఆర్‌ సంబంధాలు బెడిసికొట్టాయి. ముఖ్యమంత్రి ప్రకటించిన వంద కోట్ల అభివృద్ధి నిధులతో చేపట్టబోయే పనుల కోసం ప్రస్తుతం మాస్టర్‌ప్లాన్‌ రూపొందించాలని స్థానికులు కోరుతున్నారు. యాదాద్రి లాగా కాకాపోయిన కొంతయినా చేసి భద్రాద్రిని పునర్నించాలని కోరుతున్నారు. భద్రాద్రి ఆలయాన్ని జాతీయస్థాయిలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలన్నదే తెలంగాణ ప్రభుత్వ సంకల్పంగా ఉందని నాటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. ఇప్పుడు ఆయన కూడా రాజకీయంగా కనుమరుగయ్యారు. ఏళ్లు దాటినా కార్యాచరణ గడపదాటలేదు. ఇక్కడ ఏటా శ్రీరామ నవమి, సీతారామ చంద్రస్వామి కల్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. అయినా ఆలయ అభివృద్ది ప్రణాళిక మాత్రం ముందుకు సాగడం లేదు. కరోనాతో గత రెండేళ్లు ఆదాయం పోయింది. భక్తులురాఏలక పోయారు. ఇప్పుడిప్పడే మళ్లీ భక్తులు వస్తున్నారు. ఈ క్రమంలో ఆదాయం పెరగగలదని భావిస్తున్నారు. ఆలయ అభివృద్దిని చేపట్టి భద్రాద్రినిపర్యాటకకేంద్రంగా తీర్చి దిద్దాలని స్థానికులుకోరుతున్నారు.