భరద్వాజకు జ్ఞానపీఠ అవార్డు

చదివింది ఏడో తరగతే..
ఎక్కింది ఎన్నో మెట్లు
న్యూఢిల్లీ, ఏప్రిల్‌17 (జనంసాక్షి) : తెలుగు సాహితీ జగత్తులో మరో ఆణిముత్యం వెలిగింది. తెలుగు సాహిత్యానికి పరిమళం అబ్బందా అన్నట్లుగా అరుదైన గౌరవం మరోమారు దక్కింది. ప్రతిష్టాత్మక జ్ఞానపీఠ అవార్డుకు ప్రముఖ రచయిత రావూరి భరద్వాజ ఎంపికయ్యారు. జ్ఞానపీఠ అవార్డు పొందిన తెలుగువారిలో రావూరి మూడోవారు. ఆయక  కంటే ముందు విశ్వనాథ సత్యనారాయణ, డాక్టర్‌ సి. నారాయణరెడ్డి పురస్కారం అందుకున్నారు. భరద్వాజ రాసిన పాకుడు రాళ్లు నవలకు  జ్ఞానపీఠ దక్కడం విశేషం. సినీ జగత్తులోని వ్యక్తుల అంతరాంతరాలను ప్రతిభావంతంగా బొమ్మ కట్టించిన తొలి తెలుగు నవలగా పాకుడురాళ్లు పేరొందింది. 2011లో త్రిపురనేని గోపీచంద్‌ సాహిత్య పురస్కారం, 2009లో లోక్‌నాయక్‌ ఫౌండేషన్‌ సాహిత్య పురస్కారం ఆయన అందుకున్నారు. 1983లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును పొందారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో రావూరి భరద్వాజ 1927లో జన్మించారు. తరవాత కాలంలో గుంటూరు జిల్లా తాడికొండకు వలస వచ్చారు. 17వ ఏటనే కలం పట్టిన ఆయన 130కి పైగా గ్రంథాలు రాశారు. కథనాలు, నవలలు, నాటకాలు, వ్యాసాలు, విజ్ఞానశాస్త్రం, బాల సాహిత్యం వీరి కలం నుంచి జారాయి. ఆయన చదివింది ఏడో తరగతే అయినా సాహిత్యంలో ఎన్నో మెట్లు ఎక్కారు. 1946లో ప్రసిద్ధి చెందిన జమీన్‌రైతు తెలుగు వార పత్రికలో పనిచేశారు. 1948లో దీనబంధులో జర్నలిస్టుగా సేవలందించారు. జ్యోతి, సమీక్ష, అభిసార, చిత్రసీమ వంటి సినిమా పత్రికల్లో వీరు పనిచేశారు. 1959లో ఆల్‌ ఇండియా రేడియేలో చేరారు. నాలోని నీవు, అంతరంగిణి, ఒక ఏకాంతం, ఒకింత వేకువ కోసం వంటి కవితా సంకలనాలు రచించారు. భరద్వాజ రచించిన ‘కౌముది’ హిందీ, గుజరాతీ భాషల్లోకి అనువాదమయింది. ఆత్మగతం, భానుమతి, దూరపుకొండలు, జీవనాడి, మనోరత్నం, నీరు లేని నది, సశేషం, స్వప్నసీమలు, స్వర్ణమంజరి వంటి 11 నాటకాలు రచించారు. బాల సాహిత్యపు పుస్తకాలు 33 వరకు రాశారు. బాలలకోసం ఏడు నవలలు రాశారు. మణిమందిరం, మహాలోకం, సముద్రవీరుడు, పాకాడురాళ్లు మంచి పేరు తెచ్చిపెట్టాయి. 1968, 1983లో రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డును అందుకున్నారు. 1980లో ఆంధ్రయూనివర్సిటీ కళా ప్రపూర్ణతో సత్కరించింది. జెయన్‌టియు 1980లో, నాగార్జున యూనివర్సిటీ 1977లో గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేశాయి.