భారత్‌కు పాక్‌ స్నేహహస్తం

కాశ్మీర్‌తో సహా అన్ని సమస్యలు చర్చించి పరిష్కరించుకుంటాం
నవాజ్‌ షరీఫ్‌
ఇస్లామాబాద్‌, (జనంసాక్షి) :
భారత్‌తో స్నేహ హస్తాన్ని కోరుకుంటున్నట్లు పాకిస్తాన్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ తెలిపారు. బుధవారం ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. భారత్‌తో స్నేహ సంబంధాలు కోరుకుంటున్నట్లు తెలిపారు. కాశ్మీర్‌ సహా అన్ని సమస్యలు చర్చల ద్వారా సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుంటామని తెలిపారు. అఫ్ఘనిస్తాన్‌లో సుస్థిర ప్రభుత్వం ఏర్పడటమే తమ అభిమతమని పేర్కొన్నారు. అగ్రరాజ్యం అమెరికాతో స్నేహబంధాన్ని కొనసాగిస్తామని తెలిపారు. పాకిస్తాన్‌ ఆర్థిక పరిపుష్టి సాధించేందుకు, పేదరిక నిర్మూలన కోసం కృషి చేస్తానని అన్నారు. 14 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత పాక్‌లో ప్రజాస్వామిక ప్రభుత్వం ఏర్పడం హర్షదాయకమని, ప్రజలు ఇచ్చిన ఈ అవకాశాన్ని వారి సేవకోసమే కేటాయిస్తానని తెలిపారు. చర్చల ద్వారా ఎంతటి జఠిలమైన సమస్యలకైనా పరిష్కారం దొరుకుతుందని, దానిని తాము సదా పాటిస్తామని తెలిపారు.