భారత్‌ను డిజైనింగ్‌ హబ్‌గా మారుస్తాం

పవర్‌లూమ్‌ కార్మికులకు ఆరోగ్య బీమా
కేంద్ర మంత్రి ఆనంద్‌శర్మ
హైదరాబాద్‌, మే 25 (జనంసాక్షి) :
భారతదేశాన్ని డిజైనింగ్‌ హబ్‌గా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి ఆనంద్‌శర్మ వెల్లడించారు. వచ్చే ఐదేళ్లలో పదిహేను వేల క్రాఫ్ట్‌ డిజైనర్లను తయారు చేస్తామని ప్రకటించారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ‘నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌’ (ఎన్‌ఐజీ) భవన నిర్మాణానికి ఆయన కేంద్ర మంత్రి పల్లం రాజు, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో కలిసి శనివారం శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఆనంద్‌శర్మ ప్రసంగించారు. హైదరాబాద్‌లో ఎన్‌ఐడీ ఏర్పాట్లు 1961 తర్వాత ఇదే తొలిసారని చెప్పారు. డిజైనింగ్‌ రంగంలో ఏపీ హబ్‌గా మారుతోందన్నారు. ఎన్‌ఐడీ ఏర్పాటుతో చాలా రంగాలు అబివృద్ధి చెందుతాయన్నారు. త్వరలో హైదరాబాద్‌లో పవర్‌ ట్రేడ్‌ ఫార్మా సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ప్రకాశం జిల్లాలో ఉత్పాదక మండలి ఏర్పాటు చేస్తామని చెప్పారు. చెన్నై, బంగెళూరు ఇండస్ట్రీయల్‌ కారిడర్‌లో చిత్తూరు, అనంతపురం, నెల్లూరు జిల్లాలను చేర్చామన్నారు. ప్రపంచ దేశాలకు దీటుగా భారత్‌ను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. డిజైనింగ్‌ రంగంలోఎన్‌ఐడీ ఏర్పాటుతో ఔట్‌సోర్సింగ్‌లో అవకాశాలు పెరుగుతాయన్నారు. త్వరలోనే ఆహార భద్రతా బిల్లు ప్రవేశపెడతామని తెలిపారు. ఆహార భద్రత బిల్లు పార్లమెంట్‌లో చర్చకు రాకుండా బీజేపీ అడ్డుకుంటోందని విమర్శించారు. చేనేత రంగంలో 52 క్లస్టర్లకు కేంద్ర సాయం అందించామని చెప్పారు. త్వరలోనే 48 క్లస్టర్లుకు సాయం చేస్తామన్నారు. పథకాల్లో పారదర్శకతకు పెద్దపీట వేసేందుకే నగదు బదిలీ పథకం అమల్లోకి తీసుకొస్తన్నట్లు చెప్పారు. పెట్టుబడులు పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్‌ సరైన రాష్ట్రమని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ జాతీయ సంస్థల ఏర్పాటుకు అనువైన ప్రాంతమని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఇప్పటికే చిత్తూరు, మెదక్‌ జిల్లాలకు మంజూరైన నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ జోన్స్‌తో పాటు ఒంగోలులోనూ మరోటి ఏర్పాటు చేయాలని కిరణ్‌ కేంద్ర మంత్రిని కోరారు. దీనిపై స్పందించిన ఆనంద్‌ శర్మ భూమి లభ్యతను అంచనా వేసి, ప్రతిపాదనలు సమర్పించాలని సూచించారు. రాష్టాన్రికి మరో మ్యానుఫ్యాక్చరింగ్‌ జోన్‌ మంజూరు చేసేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపారు.
పవర్‌లూమ్‌ కార్మికులకు ఆరోగ్య బీమా
రాష్ట్రంలోని పవర్‌లూమ్‌ కార్మికులకు పైలట్‌ ప్రాజెక్టు కింద ఆరోగ్య బీమా వర్తింప చేస్తామని కేంద్రమంత్రి ఆనంద్‌శర్మ తెలిపారు. కేంద్ర పారిశ్రామిక విధానం ద్వారా రాష్ట్రానికి అందుతున్న ప్రాజెక్టులపై శనివారం స్థానిక సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, సంబంధిత మంత్రులతో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పారిశ్రామిక అభివృద్ధికి కేంద్రం పూర్తి సహాయ సహకారాలు అందిస్తోందని ఆయన తెలిపారు. నగరంలో త్వరలో ఎఫ్‌డీడీఐతో పాటు వరల్డ్‌ ఫార్మా ట్రేడ్‌ సెంటర్‌కు శంకుస్థాపన చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే విశాఖలో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. ఇప్పటికే మెదక్‌, చిత్తూరు జిల్లాల్లో ప్రకటించిన రెండు కేంద్ర ఉత్పాదక మండలాలతో పాటు ప్రకాశం జిల్లాలో మూడో కేంద్ర ఉత్పాదక మండలి కేటాయించేందుకు ఆయన సానుకూలంగా స్పందించారు.