భారత్‌లో రేస్‌ ఆఫ్‌ ఛాంపియన్స్‌ ఆసక్తి చూపిస్తోన్న నిర్వాహకులు

న్యూఢిల్లీ,నవంబర్‌ 9(:ఫార్ములావన్‌ తరహా రేసులకు భారత్‌ క్రమంగా వేదికవుతోంది. ఇప్పటికే రెండు ఎఫ్‌వన్‌ రేసులను సక్సెస్‌ఫుల్‌గా నిర్వహించి ప్రశంసలందుకోన్న భారత్‌పై పలు రేసింగ్‌ క్లబ్స్‌ కన్నేశాయి. ఇక్కడ తమ మార్కెటింగ్‌ మరింత పెంచుకునేందుకు వ్యూహాలు సిధ్దం చేసుకుంటున్నాయి. దీనిలో భాగంగా రేస్‌ ఆఫ్‌ ఛాంపియన్స్‌ (ఆర్‌వొసి) రేసును భారత్‌లో కూడా నిర్వహించేందుకు ఆ సంస్థ ప్రయత్నిస్తోంది. వచ్చే నెలలో థాయ్‌లాండ్‌ రేసు ముగిసిన తర్వాత దీనిపై ఒక స్పష్టత వచ్చే అవకాశముంది. ప్రపంచంలోని అత్యుత్తమ రైసింగ్‌ డ్రైవర్ల పాల్గొనే ఈ ఈవెంట్‌ ప్రతీ ఏడాదీ చివర్లో జరుగుతుంది. ఫార్ములావన్‌ , వరల్డ్‌ ర్యాలీ ఛాంపియన్‌షిప్‌ , నాస్కార్‌ , స్పోర్ట్స్‌ కార్స్‌ లాంటి ఈవెంట్స్‌కు చెందిన స్టార్‌ డ్రైవర్లు దీనిలో పోటీపడతారు. 1988లో తొలిసారిగా ఈ రేస్‌ నిర్వహించారు. క్రమక్రమంగా ఆదరణ పెరగడంతో ప్రతీ ఏడాదీ సక్సెస్‌ఫుల్‌గా కండక్ట్‌ చేస్తున్నారు. 2012 సీజన్‌కు గానూ థాయ్‌లాండ్‌లో రేస్‌ జరగనుంది. అయితే వచ్చే ఏడాది వేదికగా భారత్‌ను కూడా పరిశీలిస్తున్నారు. గత ఏడాదితో పాటు ఈసారి కూడా ఫార్ములావన్‌ రేసులకు మంచి స్పందన రావడంతో నోయిడా వేదికగా నిర్వహించేందుకు సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవలే భారత డ్రైవర్లు నారాయణ్‌ కార్తికేయన్‌ , కరణ్‌ చందోక్‌ రేస్‌ ఆఫ్‌ ఛాంపియన్స్‌లో అరంగేట్రం చేస్తున్నారు. ఈ మేరకు వారికి ఆర్గనైజర్ల నుండి ఆహ్వానం కూడా అందినట్టు ఇటీవలే తెలిసింది. మోటార్‌ స్పోర్ట్స్‌లో ఇండియా సత్తా చాటేందుకు ఈ రేస్‌ చక్కని అవకాశంగా భావిస్తున్నారు. అదే సమయంలో భారత్‌ను కూడా ప్రధాన వేదికగా మార్చేందుకు కూడా ఉపయోగపడుతుందని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే ఇండియాలో కూడా ఎఫ్‌1 రేసులకు మంచి భవిష్యత్తు ఉంటుంది. అలాగే భారత టూరిజంతో పాటు వ్యాపార వర్గాల అభివృధ్ధికి ప్రత్యక్షంగానూ , పరోక్షంగానూ లాభం కలిగినట్టే.. ఇదిలా ఉంటే థాయ్‌లాండ్‌ జరిగే రేసులో సెబాస్టియన్‌ వెటెల్‌ , మైకేల్‌ షూమాకర్‌ , లొరెంజో లాంటి స్టార్‌ డ్రైవర్స్‌ పోటీ పడుతుండడంతో పోటీ ¬రా¬రీగా సాగడం ఖాయమని ఎక్స్‌పర్ట్స్‌ చెబుతున్నారు.