భారత్‌-చైనా యుద్ధం 1962 నాటి-నిజానిజాలు

దేశఅంతర్గత విధానాల గురించి ప్రభుత్వాలను, పాలకవర్గాలను ఎంతో తీవ్రంగా విమర్శించే వారికి కూడా విదేశాంగ విధానం దగ్గరికి వచ్చేసరికి ఎక్కడలేని దేశభక్తీ ఆవరిస్తుంది. అంతర్గత విధానాలలో ప్రభుత్వాలు, పాలకవర్గాలు చెప్పెవన్నీ అబద్ధాలే అని కచ్చితంగా నమ్మేవాళ్లు కూడా, విదేశాల విషయంలో, ముఖ్యంగా యుద్ధాల విషయంలో మాత్రం ప్రభుత్వాలు, పాలకవర్గాలు చెప్పేవన్నీ అక్షరాల సత్యాలేనని నమ్ముతారు, వాస్తవాలను వాస్తవాలుగా గ్రహించడం కాకుండా, మన పాలకవర్గాలు చెప్పేదంతా నిజమన్నట్లు, విదేశీ పాలకులు చెప్పేదంతా అబద్ధమన్నట్లు తమను తాము వంచించుకుంటారు. ఇతరులను వంచిస్తారు. ‘మన ప్రభుత్వం’ చెప్పేదానిలో కోంతాయినా అబద్ధం ఉండవచ్చునని, విదేశీ ప్రభుత్వం చెప్పేదానిలో కోంతాయినా నిజం ఉండవచ్చునని కూడా కూడా అనుమానించారు. ఇక ‘మన ప్రభుత్వం’ చేప్పవి అన్ని పచ్చి అబద్ధాలుగా, అవతలి ప్రభుత్వం చెప్పేవి  సగమైనా నిజాలుగా ఉండే సందర్భం వస్తుందని అనుకోనే అనుకోరు. అసలు చారిత్రిక పరిమాణాల గురించి మన, ఇతర అనే దృష్టితో కాక వాస్తవికంగా చూడాలనే అవగాహన వాళ్లలో కొరవడుతుంది. అటువంటి సమయాలలో దేశభక్తి రసం కుప్పలుతెప్పలుగా ప్రవహిస్తుంది. ‘మన’ మీద ‘వాళ్ల’ దాడి అని, ‘మనం’ అంతా ఒక్కటైనట్లు, మన పాలకవర్గాలు మన దేశం కోసమే ఉన్నట్లు అర్ధసత్యాలు, అబద్ధాలు, అతిశయోక్తులు వెల్లువెత్తుతాయి. మొత్తం మీద చరిత్ర గురించి తలకిందుల అవగాహన రాజ్యమేలుతుంది.

ఇటీవలి భారత చరిత్రలో ఇటువంటి తలకిందుల అవగాహన పెచ్చరిల్లిన సందార్భాలలో 1962లో భారత దేశానికి, చైనాకు జరిగిన యుద్ధం ప్రధానమైనది. (అసలు భాషే ఎలా ఉంటుందో చూడండి-అది భారత ప్రభుత్వానికి, చైనాప్రభుత్వానికి మధ్య , లేదా ఆ ప్రభుత్వాలు నడిపే సైనిక బలగాల మధ్య జరిగిన యుద్ధం కాగా, దాన్ని రెండు దేశాల మధ్య యుద్ధంగా చెప్పడం సాధరణమై పోతుంది. దేశమంటే మట్టి కాదని మాత్రమే కాదు, ప్రభుత్వాలు కూడా కాదని, మనుషులనీ ఆలోచిస్తే , ఆ మనుషులకూ ఈ మనుషులకూ మధ్య, ఆ దేశానికి ఈ దేశానికీ మధ్య యుద్ధం జరగవలసిన అవసరమే లేదు!) భారత్‌- చైనా యుద్ధం మొదలై ఈ యేడాది అక్టోబర్‌ 20కి యాభై సంవత్సరాలు నిండిన సందర్భంగా కూడా ఇటువంటి భావోద్వేగాల వెల్లువతో అనేక పత్రికల్లో లెక్కలేనన్నీ వార్తలు, వ్యాసాలు యవచ్చాయి. మామూలుగా ప్రగతిశీల పత్రికలుగా పేరొందిన వాటిలో కూడా ఇటువంటి వ్యాసాలు, విశ్లేషణలు వ్యాఖ్యానాలు చాలనే వచ్చాయి. నెహ్రూ మంచితనం, అమాయకత్వం వల్ల యుద్ధంలో భారత్‌ ఓడిపోయిందని, వైమానికదళాన్ని వాడి వుంటే గెలిచేదని, భారత భూభాగాన్ని చైనా దూరక్రమించిందని, భారత్‌ శాంతిముక దేశం కాగా చైనా దురాక్రామణదారులు అని యాభైఏళ్లుగా వినిపించిన వాదనలే మళ్లీ వినిపించాయి. చారిత్రాక వాస్తవాలు భిన్నంగా ఉన్నాయని, భారత ప్రభుత్వాం అప్పుడు తప్పుచేసి ఉండే అవాకాశం ఉందని, భారత ప్రజలకు ఇన్నాళ్లుగా ఈ యుద్ధం గుర్చించి అందుతున్న సమాచారమంతా నిజం కాదని ఏవో ఒకటి రెండు పత్రికల్లో ఎవరో ఒకరిద్దరు రచయితలు మాత్రమే రాశారు.

నిజానికి ఈ యాభై ఏళ్లలో కూడా భారతదేశంలో అప్పుడప్పుడు, అక్కడక్కడ ఈ యుద్ధం గురించిన నిజాలు బైటికి రాకపోలేదు. లండన్‌కు చెందిన దిటైమ్స్‌ పత్రిక దక్షిణాసియా విలేఖరిగా 1959నుంచి 1967 దాకా ఢిల్లీలో పనిచేసిన బ్రిటిష్‌ జర్నటిస్ట్‌ నెవిలీ మాక్స్‌వెల్‌ రాసిన ‘ఇండియాస్‌ చైనా వార్‌ ‘(భారతదేశపు చైనా యుద్ధం) 1970లో ప్రచురితమై చాలా సంచాలనం సృష్టించింది. సరిహద్దు వివాదంలో భారత ప్రభుత్వం అనేక తప్పులు చేసిందని, భారత ప్రభుత్వమూ దుందుడుకుగా వ్యవహరించిందని, చైనా బాధితురాలని ఆయన పూర్తిగా భాతర ఆధారాల పునాదిగానే రుజువు చేశారు. మొదట బ్రిటన్‌లో అచ్చయిన ఆ పుస్తకాన్ని భారతదేశంలో జైకో సంస్థ 1970 సెప్టెంబర్‌లో ప్రచురించింది. నవంబర్‌ కల్లా పునర్ముద్రణ అవసరమయింది. ‘ఆ పుస్తకాన్ని భారత ప్రభుత్వం నిషేధించిందని అభిప్రాయం ఉంది గాని అది నిజం కాదు’ అని ఈ అక్టోబర్‌లో ఇచ్చిన ఇంటర్వ్యూలో మాక్స్‌వెల్‌ అన్నారు. యుద్ధం జరిగిని యైభై ఏళ్లయిన సందర్భంగా ఔట్‌లుక్‌ పత్రికలో వచ్చిన ఇంటర్వ్యూలో ఎనభై ఆరు సంవత్సరాల మాక్స్‌వెల్‌ భారత ప్రజలు ఇంతకాలంగా వింటున్న అబద్ధాల నుంచి బయట పడాలని, తప్పనిసరిగా తెలుసుకోవలసిన విషయాలెన్నో చెప్పారు.

సరిహద్దు వివాదంలో భారత ప్రభుత్వ వైఖరి ఆమోదయోగ్యంగా లేదని నెహ్రూ సన్నిహిత మిత్రుడు. 1953లో ఏర్పడిన భారత్‌-చైనా మిత్రమండలి తొలి అధ్యక్షుడు పండిట్‌ సుందర్‌లాల్‌ కూడ అప్పుడే రాశారు. ఆ కాలపు అధికారిక, అనధికారిక పత్రాల మీద సాధికారికమైన, సుదీర్ఘమైన పరిశోధన జరిపిన చరిత్రకారుడు, సుప్రీం కోర్టు న్యాయవాది ఎజి సూరాని 2011లో ప్రచురించిన ‘ఇండియా-చైనా బౌండరీ ప్రాబ్లమ్‌ 1846-1947లో కూడా సరిహద్దు వివాదంలో భారత ప్రభుత్వం అనుసరించిన వైఖరి ఎంత అనుచితమో, అచారిత్రకమో రుజువు చేశారు. చైనా అధికారిక పుస్తకాలు, చైనా రచయితలు, చైనా అనుకూల రయితలు మాత్రమే కాదు, దేశాలలోని స్వతంత్ర పరిశోధకులెందరో ఈ వివాదంలో భారత ప్రభుత్వపు అపసవ్యపు మొండి వైఖరిని సాక్ష్యాధారాలతో ఎత్తిచూపారు.             అయినా ఈ వాస్తవాలన్నిటినీ పక్కనబెట్టి దేశంలోని, రాఫ్ట్రంలోని ప్రధాన పత్రికలన్నీ 1962 యుద్ధంలో చైనాదే పూర్తి తప్పు అన్నట్టుగా, చైనా భారత భూభాగాన్ని దురాక్రమణ చేసినట్టుగా, జాతీయోన్మాదాన్ని రెచ్చగొట్టే రచనలు అచ్చు వేశాయి. మరి సరిహద్దు వివాదం నిజాలేమిటి? ఆ వివాదంలో ప్రధానమైన అంశాలేమిటి? ఆ వివాదం యుద్ధానికి ఎలా దారితీసింది? యుద్ధ పర్యవసానాలేమిటి?

చైనాతో భారత దేశానికి ఉత్తర కొస నుంచి ఈశాన్యం దాకా హిమాలయ పర్వత ప్రాంతాలలో 3,225 కి.మీ. సరిహద్దు ఉంది. ఆ ప్రాంతపు భౌగోళిక దుర్గమస్థితి వల్ల ఈ సుదీర్ఘ రేఖలో చాలభాగం కచ్చితంగా, నిర్దష్టంగా, నిర్దుష్టంగా నిర్ధారణ కాలేదు. దేశ పటాలలో నమోదు కాలేదు. పైగా ఈ సరిహద్దు ప్రాంతంలో కాశ్మీర్‌ వంటి వివాదస్పద ప్రాంతాలు, నేపాల్‌, సిక్కిం, భూటాన్‌ వంటి దేశాలు ఉన్నాయి. (స్వతంత్రదేశంగా ఉండిన సిక్కింలోకి భారత ప్రభుత్వం 1975 ఏప్రిల్‌ తన సైన్యాన్ని పంపి దురాక్రమించింది. అప్పటిదాక రాచరిక పాలనలో ఉండిన ఉండిన ఆ దేశాన్ని తనలో అంతర్భాగమైన రాష్ట్రంగా 1975 మే 16న ప్రకటించింది). ఈ సుదీర్ఘ సరిహద్దు ప్రాంతంలో లడ్డాఖ్‌ను ఆనుకుని ఉన్న అక్సాయి చిన్‌, అప్పటి ఈశాన్య సరిహద్దు ప్రాంతం (ప్రస్తుత అరుణాచల్‌ ప్రదేశ్‌) సరిహద్దులలో ఉన్న మెక్‌మోహన్‌ రేఖ 1962 యుద్ధానికి తక్షణ కారణమైన, యుద్ధం జరిగిన ప్రధాన స్థలాలు.

అక్సాయి చిన్‌ అక్సాయి చిన్‌ సముద్ర మట్టం నుంచి 16,000 అడుగుల నుంచి 23,000 అడుగుల ఎత్తున ఉన్న ఎడారి. అక్కడక్కడా ఉప్పునీటి సరస్సులు మాత్రం ఉన్న ఈ 38,000 చ.కి.మీ. ప్రాంతంలో మానవ ఆవాసాలేమీ లేవు. ఈ ప్రాంతానికి లడ్డాఖ్‌ వైపునుంచి, అంటే భారతదేశం వైపు నుంచి వెళ్లే మార్గం కూడ లేదు. అటువైపు అక్సాయిచిన్‌కు ఇటువైపున భారత భూభాగానికీ మధ్యన దుర్గమమైన కారకోరం పర్వతశ్రేణి ఉంది. ఈ ప్రాంతం చైనాలోని క్సిన్‌ జియాన్‌ రాష్ట్రం (స్వతంత్ర ప్రతిపత్తిగల ప్రాంతం)లోకి చొచ్చుకుని ఉంది. టిబెట్‌ నుంచి క్విన్‌ జియాంగ్‌లోకి వెళ్లే ప్రాచీన వ్యాపార బిడారుల రహదారి అక్సాయి చిన్‌ మీదుగా వెళుతుంది. 1834లో జమ్మూ సంస్థానాన్ని తమ రాజ్యంలో విలీనం చేసుకున్నప్పుడు, లడ్డాఖ్‌లో భాగంగా ఈ ప్రాంతాన్ని కూడ ఆక్రమించుకున్నారు. పంజాబ్‌ పాలకులు ఇంకా ముందుకువెళ్లి 1841లో టెబెట్‌ మీద దాడిచేశారు. ఆ దాడిని తిప్పికొడుతూ వారిని తరుముతూ చైనా సైన్యాలు లడ్డాఖ్‌లోని లే దాకా వచ్చాయి. ఈ ఘర్షణ తర్వాత 1842 సెప్టెంబర్‌లో ఒకరి భూభాగంలోకి మరొకరు చొరబడగూడదని పంజాబ్‌ పాలకులకూ చైనా పాలకులకూ మధ్య ఒప్పందంకుదిరింది.

కాని 1846లో పంజాబ్‌ పాలకులు బ్రిటిష్‌ వారి చేతుల్లో ఓడిపోవడంతో లడ్డాఖ్‌ బ్రిటిష్‌ వారి అధీనంలోకి వచ్చింది. బ్రిటిష్‌ వారు సరిహద్దు విషయమై చైనా పాలకులతో చర్చలు జరపడానికి ప్రయత్నించారు గాని, ఆ ప్రయత్నాలు సఫలం కాలేదు. సహజమైన, నైసర్గికమైన సరిహద్దులను గుర్తించాలని, ఒకరి జోలికి ఒకరు రాగూడదని అలిఖిత ఒడంబడికకుదిరినట్టయింది. ఈ ప్రాంతానికి ఉత్తర కొసన ఉన్న కారకోరం కనుమను, దక్షిణ కొసన ఉన్న పాంగాంగ్‌ సరస్సును సహజ సరిహద్దులుగా గుర్తించడం జరిగింది గాపి ఈ రెంటి మధ్య ఉన్న 200కి.మీ. పైగా దూరానికి సరిహద్దు రేఖ లేకపోయింది. అటువంటి సరిహద్దు రేఖను తయారు చేయడానికి 1865లో సర్వే ఆఫ్‌ ఇండియా అధికారి డబ్లుహెచ్‌ జాక్సన్‌ ప్రయత్నించాడు గాని అప్పటికి క్సిన్‌ జియాంగ్‌ రాష్ట్రంలో తిరుగుబాటు జరిగి, అక్కడ చైనా అధికారం కోల్పోయినందువల్ల ఆ జాన్సన్‌ రేఖ ఇరుదేశాల ఆమోదిత రేఖ కాలేకపోయింది. ఈ రేఖను తప్పుల తడకగా తయారు చేశాడని బ్రిటిష్‌ ప్రభుత్వమే మందలించడంతో జాన్సన్‌ తన పదవికే రాజీనామా చేసి వెళ్లిపోయారు. తర్వాత 1890లలో క్సిన్‌ జియాంగ్‌ మళ్లీ చైనా అధీనంలోకి వెళ్లింది. చైనా బలహీనపడుతూ రష్యా బలం పుంజుకోవడంతో ఈ ప్రాంతం మీద తన పట్టు ఉండాలనుకున్న బ్రిటిష్‌ ప్రభుత్వం తరఫున సైనికాధికారి జాన్‌ అర్దాఘ్‌ మరొక రేఖ తయారు చేశాడు. ఈ రేఖ జాన్సన్‌ రేఖకు కొద్ది మార్పులతో తయారయింది గనుక దీన్ని జాన్సన్‌ – అర్దాఘ్‌ రేఖ అని పిలుస్తారు.

ఆ తర్వాత బ్రిటన్‌కూ చైనాకూ స్నేహం బలపడి, అక్సాయి చిన్‌ తనదేనని చైనా వాదించడంతో కారకోరం పర్వత సానువులు సహజ సరిహద్దుగా, అక్సాయి చిన్‌ను చైనాలో అంతర్భాగంగా చూపుతూ బ్రిటిష్‌ ప్రభుత్వం మెక్‌కా ర్ట్‌నీ-మెక్‌డొనాల్డ్‌ రేఖను తయారు చేసి 1899లో చైనా ప్రభుత్వానికి అందజేసింది. నైసర్గిక అంశాలను ప్రధానంగా తీసుకున్న ఈ సరిహద్దు రేఖ సింధూనది పరీవాహక ప్రాంతాన్ని చైనాలో భాగంగా చూసింది. అయితే ఈ ప్రతిపాదన పట్ల చైనా మౌనం పాటించగా, ఆ మౌనం అంగీకారమేనని బ్రిటిష్‌ ప్రభుత్వం భావించింది. ఆ తర్వాత 1899 నుంచి 1947 దాక బ్రిటిష్‌ ప్రభుత్వం తయారు చేసిన పటాలలో అటు జాన్సన్‌-అర్దాఘ్‌ రేఖ, ఇటు మెక్‌కార్ట్‌నీ-మెక్‌డొనాల్డ్‌ రేఖ రెండూ చూపేవారంటే ఈ సరిహద్దు ఎంత అనిర్దష్టంగా, అస్పష్టంగా ఉండిపోయిందో అర్థమవుతుంది.

ఆ ప్రాంతం గురించి నెహ్రూ మాటల్లోనే చెప్పాలంటే, ‘అక్సాయి చిన్‌ తమ భూభాగమేనని చైనీయులు అంటున్నారు. వారి పటాలలో కూడ, కొత్త పటాలలో మాత్రమే కాదు, పాత పటాలలో కూడ, అది వారి భూభాగంగానే ఉంది. మొత్తానికి అది వివాదాస్పద ప్రాంతం. దాని మీద రెండు అభిప్రాయాలున్నాయి.. అది సరాసరి పదహారు వేల నుంచి పదిహేడు వేల అడుగుల ఎత్తున ఉన్న చెట్లూ చేమలూ లేని, గడ్డికూడ మొలవని, ఏ రకమైన జీవజాలం లేని ప్రాంతం.

మెక్‌మోహన్‌ రేఖ

భారత్‌-చైనా సరిహద్దు పశ్చిమ దిశలో అటువంటి అనిశ్చిత స్థితి ఉండగా, తూర్పు కొసన వలస పాలకుల వల్ల ఇటువంటి స్థితే కొనసాగింది. తూర్పు వైపు చివరన భూటాన్‌, బర్మాల మధ్యన భారత, చైనా దేశాల ఉమ్మడి సరిహద్దును సూచిస్తూ గీసిన 1150 కి.మీ. రేఖను మెక్‌మోహన్‌ రేఖ అంటారు. అప్పటి భారత ప్రభుత్వ విదేశాంగ కార్యదర్శి హెన్రీ మెక్‌మోహన్‌ 1914లో బ్రిటిష్‌ ఇండియా తరఫున టిబెట్‌తో కుదుర్చుకున్న సిమ్లా ఒప్పందంలో ఈ రేఖ ఖరాయింది. కాని దానికి ఏడు సంవత్సరాల ముందు 1907లో కుదిరిన ఆంగ్లో-రష్యన్‌ ఒడంబడికకు ఇది భిన్నమైనది గనుక, టిబెట్‌ చైనా అధీన ప్రాంతమైనందువల్ల టిబెట్‌ గురించిన ఏ ఒడంబడికనైనా చైనా ఆమోదించవలసి ఉంటుంది గనుక, సిమ్లా ఒడంబడికకుదిరిన కొద్ది వారాలకే మొదటి ప్రపంచయుద్ధం మొదలయింది గనుక మెక్‌మోహన్‌ రేఖ విస్మృతిపథంలో పడిపోయింది. దాన్ని పట్టించుకున్నవారూ, సమర్థించినవారూ ఎవరూ లేకపోయారు. అది ఎక్కడా అధికారిక పట్టాల్లోకి కూడా ఎక్కలేదు.

కాని 1935లో బ్రిటిష్‌ అధికారి ఒలాఫ్‌ కారో దీన్ని తవ్వితీసి, ఇక నుంచి దాన్ని పటాల్లో చిత్రించాలని, నిజమైన భారత-చైనా సరిహద్దు అదేనని వాదించాడు. అలా 1937లో సర్వే ఆఫ్‌ ఇండియా ముద్రించిన పటాల్లో మొదటిసారిగా భారత్‌ చైనా సరిహద్దుగా మెక్‌మోహన్‌ రేఖను చిత్రించారు. మరొక దేశంతో సరిహద్దు ఒడంబడిక చేసుకునే అధికారం తమ దేశంలో ఒక భాగమైన టిబెట్‌ ప్రభుత్వానికి ఉండదని, అందువల్ల సిమ్లా ఒప్పందాన్ని, మెక్‌మోహన్‌ రేఖను తాము గుర్తించబోమని, ఆ రేఖకు దక్షిణంగా 65,000 చ.కి.మీ. భూభాగం టిబెట్‌లో, తమ దేశంలో భాగమేనని చైనా వాదించింది. దాన్ని దక్షిణ టిబెట్‌ అని పిలిచింది.

ఇక్కడ ఒక ఆసక్తికరమైన పిట్టకథ కూడా ఉంది. సి యు ఐచిసన్‌ సంపాదకుడుగా 1929లో వెలువడిన ఎ కలెక్షన్‌ ఆఫ్‌ ట్రీటీస్‌ (ఒడంబడికల సంకలనం)లో సిమ్లా ఒడంబడికను చేర్చలేదు. తమ అధీన దేశంగా ఉన్న టిబెట్‌కు సర్వాధికార సంతకం చేయడానికి అర్హత లేదని చైనా అనడం వల్ల ఒడంబడిక కుదరలేదు అని కూడ సంపాదక వ్యాఖ్య రాశారు. కాని 1938లో ఆ పుస్తకన్నే మళ్లీ ప్రచురించినపుడు సిమ్లా ఒప్పందాన్ని చేర్చారు. పాత పుస్తకాలను వెనక్కి రప్పించడం మాత్రమే కాదు, 1938 పుస్తకంలో 1929లో ముద్రణ జరిగినట్టుగా తప్పుడు సమాచారం చేర్చారు.

బ్రిటిషిండియా సైన్యాలు 1938లోనే ఈ ప్రాంతంలోని తవాంగ్‌ పట్టణంలో ప్రవేశించి, అది భారత భూభాగమని ప్రకటించాయి. టిబెట్‌ ప్రభుత్వం అందుకు అభ్యంతరం తెలిపి తన అధికారాన్ని పున: స్థాపించుకుంది. ఆ తర్వాత ఈ ప్రాంతంలో కొన్ని చోట్ల బ్రిటిషిండియా జోక్యం ఉన్నప్పటికీ, అది తన అధికారం కింది భూభాగమేనని 1947 దాకా టిబెట్‌ వాదిస్తూ వచ్చింది.

– మేజర్‌ జైపాల్‌ సింగ్‌

భారత్‌-చైనా యుద్ధానికి యాభై ఏళ్లు నిండిన సందర్భంగా ‘వీక్షణం’ సౌజన్యంతో…

(నోట్‌ : ‘యుద్ధానికి ముందు వివాదాలు’ రేపటి సంచికలో…)