భారత్‌ విశ్వగురు కావాలి

Untitled-1

అపార యువశక్తి, మేధోసంపత్తి మనసొంతం

మీ కలల స్వదేశాన్ని నిర్మిస్తాం

సిడ్నీ ఒలంపిక్‌లో ప్రధాని నరేంద్రమోడీ

హైదరాబాద్‌, నవంబర్‌ 17 (జనంసాక్షి) : భారతదేశం విశ్వగురు కావాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. అపార యువశక్తి, మేధోసంపత్తి మనదేశంలో మెండుగా ఉందన్నారు. సిడ్నీ ఒలంపిక్‌లో ప్రధాని ఆకట్టుకునేలా ప్రసంగించారు. భారత్‌ను విశ్వ గురువుగా మార్చాలన్నదే తన లక్ష్యమని ప్రకటించారు. భారతీయులు విశ్వ మానవులున్న పేరు సంపాదించాలని ఆయన ఆకాంక్షించారు. ప్రపంచానికి అవసరమైన బుద్ధిబలం కల మానవ వనరులను అందించే సత్తా భారత్‌కు ఉందని.. అపార యువశక్తి కలిగిన ఇండియా ఇంకా ఎందుకు వెనుకబడి ఉండాలని ప్రశ్నించారు. ప్రపంచానికి సేవలందించే మానవ వనరులను అభివృద్ధి చేస్తామని.. తద్వారా ప్రపంచ గురువుగా దేశాన్ని నిలుపుతామన్నారు. ఆస్టేల్రియా పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ సోమవారం సిడ్నీ ఒలింపిక్‌ పార్క్‌ స్టేడియంలో ప్రవాస భారతీయులు ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రధాని ఉద్వేగంగా ప్రసంగించారు. అంతకు ముందు దాదాపు 20వేల మందికిపైగా ప్రవాస భారతీయులు మోడీకి ఘనంగా స్వాగతం పలికారు. వారి కరతాళ ధ్వనుల మధ్య మోడీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఆహూతులను ఉత్తేజపరుస్తూ, వారిలో దేశభక్తి నింపుతూ తన ప్రసంగంతో వారిని కట్టిపడేశారు. విూ స్వాగత సత్కారాలు తనను పులకింపజేశాయని.. విూ ప్రేమాభినాలను దేశ ప్రజలకు అర్పిస్తున్నానని తెలిపారు. 50 ఏళ్ల క్రితమే స్వామి వివేకానందుడు తన ఆలోచనలను ప్రపంచానికి అందించారన్నారు. ప్రపంచమంతా ఒక్కతాటిపైకి రావాలని వివేకానంద పిలుపునిచ్చారని చెప్పారు. భారత్‌ను విశ్వగురువుగా మార్చాలన్నదే తన లక్ష్యమని ప్రకటించారు. స్వాతంత్య్ర భారతంలో పుట్టినందుకు సంతోషంగా ఉందని.. కానీ, స్వాతంత్య్ర సమరంలో తాను పాలుపంచుకోనందుకు బాధగా ఉందన్నారు. దేశం కోసం సేవ చేసే అవకాశం అందరికీ వస్తుందని, కానీ మరణించే అవకాశం అందరికీ రాదని పేర్కొన్నారు. స్వాతంత్య్రం కోసం ఉరికంబం ఎక్కలేదన్న బాధ ఉందని చెప్పారు. అయితే, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత పుట్టిన తొలి ప్రధానిని తానే కావడం అదృష్టమన్నారు.

ఆస్టేల్రియా అభివృద్ధి వెనక మనమే..

ఆస్టేల్రియా అభివృద్ధి వెనుక భారతీయుల శ్రమ దాగి ఉందని మోడీ అన్నారు. 200 ఏళ్ల కింద కొంత మంది భారతీయులు ఆస్టేల్రియాకు వచ్చారని, వాళ్ల జీవనశైలిని చూసి భారతీయులు గర్వపడుతున్నారని చెప్పారు. నాడకు ఇక్కడకు వచ్చిన భారతీయులు ఆస్టేల్రియాను తమ సొంత దేశంగా చూసుకుంటున్నారన్నారు. 1964లో ఒలింపిక్స్‌లో ఆస్టేల్రియా తరఫున పాల్గొన్నది ప్రవాస భారతీయు బత్వార్‌సింగ్‌ అని గుర్తు చేసిన మోడీ.. అప్పట్లో ఒలింపిక్స్‌లో ఒక దేశం తరఫున భారతీయుడు ప్రాతినిధ్యం వహించడం మామూలు విషయం కాదన్నారు. ఆంగ్లో ఇండియన్ల పాత్ర కూడా ఆస్టేల్రియాలో చాలా ఉందని తెలిపారు. రెడ్‌ సెలస్‌, స్టూవర్ట్‌ క్లార్క్‌ ఇద్దరూ ఆంగ్లో ఇండియన్లు భారత్‌ నుంచి వచ్చి ఆస్టేల్రియా క్రికెట్‌లో అగ్రస్థనంలో కొనసాగుతున్నారని చెప్పారు. భారత్‌-ఆస్టేల్రియాలను కలిపింది క్రికెట్‌ అని పేర్కొన్న మోడీ.. భారత ప్రధాని ఆస్టేల్రియా రావడానికి 28ఏళ్లు పట్టిందని తెలిపారు. భారత ఆస్టేల్రియన్‌ ఇంద్రానాయుడు ఐక్యరాజ్యసమితిలో ఇప్పటికీ సేవలందిస్తున్నారన్నారు. భారతీయులై ఉండి ఆస్టేల్రియాలో ఆ దేశ పతాకాన్ని నిలబెడుతుఉన్నారని తెలిపారు. ‘ఇదీ మన శక్తి.. భారతీయులైనందుకు మనం ప్రపంచంలో ఎక్కడ ఉన్నా.. అక్కడి వాల్ల ప్రేమను పొందుతాం. వాళ్లతో కలిసి అభివృద్ది చేస్తమని’ అన్నారు.

విూ మనసంతా భారత్‌ వైపే..

భారతీయులు ఎక్కడ ఉన్నా మనసంతా భారత్‌పైనే ఉంటుందని మోడీ తెలిపారు. ‘భారత్‌లో ఎన్నికలు జరుగుతున్నప్పుడు విూరు ఎన్నికల్లో పాల్గొనలేదు.. విూ వేళ్ల విూద సిరా పడదు. విూపై ఫలితాల ప్రభావమూ లేదు. కానీ నాకు తెలుసు. ఆ ఎన్నికల్లో ఒక్క క్షణం కూడా విూరు దాంతో సంబంధం లేకుండా ఉండలేదు.

ఇక్కడున్న ప్రతి భారతీయ కుటుంబం ఎన్నికల ఫలితాలు వెలువడే సమయంలో నిద్ర లేకుండా టీవీ చూస్తూనే ఉన్నారు. ఎవరు గెలిచారు.. ఎవరు ఓడారన్న విషయం కోసం కాదు. దేశంలో ఎలాంటి మార్పు వస్తుందోనని విూరంత ఎదురుచూశారు. ఇప్పుడు నేను ఎక్కడున్నానో.. నా దేశం ఎప్పుడు అలా అవుతుందని విూ అందరి గుండెలు మండిపోయాయి. ఎవరు గెలుస్తారన్న దాంతో విూకు సంబంధం లేదు.. భారత్‌కు ఉజ్వల భవిష్యత్తు కావాలన్న కల మాత్రమే విూకు ఉందని’ వ్యాఖ్యానించి ప్రవాస భారతీయులను కట్టిపడేశారు.

యువతతోనే మార్పు

భారత్‌కు అతిపెద్ద సంపద యువతేనని మోడీ పేర్కొన్నారు. అద్భుత వనరులున్న భారత్‌ ఎందుకు వెనుకబడి ఉండాలని ప్రశ్నించారు. ‘భారతమాతకు 250 కోట్ల చేతులు ఉన్నాయి.. అందులో 200 కోట్ల చేతులు యువతరానివే. దేశ కలలను నిజం చేసే సత్తా యువతరానికే ఉందని’ స్పష్టం చేశారు. అద్భుత వనరులున్న భారత్‌ ఎందుకు వెనకబడి ఉండాలన్నారు. భారతదేశంలో ఉన్న కోట్లాది మంది ఇప్పటికీ పేదరికంలో మగ్గుతున్నారని మోడీ ఆవేదన వ్యక్తం చేశారు. ‘చాలా మందికి ఇప్పటికీ కరెంటు లేదు, స్వాతంత్య్రం వచ్చి ఎన్నేళ్లయినా తాగడానికి మంచినీళ్లు లేవు. కనీసం మరుగుదొడ్లు కూడా లేవు. చాలా మందికి పెద్ద పెద్ద పనులు చేయాలన్న కలలుంటాయి. కానీ నాకు చిన్న చిన్న లక్ష్యాలే ఉన్నాయి. చిన్న వాళ్ల కోసం పని చేయాలని.. వాళ్లను పెద్ద చేయడానికి పని చేయాలని’ అని అన్నారు.

పేదలకు సలాం

భారతదేశంలో నిరుపేదల నీతి, నిజాయతీలకు ప్రధాని సలాం చేశారు. ప్రధానమంత్రి జన్‌ధన్‌ యోజన కింద పేదలతో బ్యాంకు ఖాతాలు తెరిపించిన విషయాన్ని మోడీ తన ప్రసంగంలో ప్రస్తావించారు. ఈ సందర్భంగా పేదల నిజాయతీ గురించి చెబుతూ ఉద్వేగానికి గురయ్యారు. అత్యంత పేదవాళ్లు ఎప్పుడైనా బ్యాంకుకు వెళ్లడం ఎవరైనా చూశారా? ఇప్పుడు వెళ్తున్నారు. వాళ్లకూ ఖాతాలొచ్చాయని సంతోషంగా ప్రకటించారు. జన్‌ధన్‌ యోజన కింద ఒక్క రూపాయి కూడా వేయకుండా ఖాతాలు ప్రారంభించుకోవచ్చని తాము ప్రకటించామన్నారు. కానీ, ‘మోడీ చెబితే చెప్పారు… మనం నిజాయతీగా ఉండాలనే వాళ్లు (పేదలు) భావించారు. అందుకే ఒక్కొక్కళ్లు వారికి వీలైనంత రూ.100, రూ.200 చొప్పున ఆ ఖాతాల్లో జమ చేశారు. అలా మొత్తం రూ.5 వేల కోట్లతో ఖాతాలు తెరిచారని’ ప్రకటించారు. ప్రతి పేదవాడిని అభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశ్యంతోనే ప్రధాని జన్‌ధన్‌ యోజన కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. ఏడాది లోగా కోటి ఖాతాలు తెరవాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, కానీ పది వారాల్లోనే జన్‌ధన్‌ యోజన కింద ఏడు కోట్ల ఖాతాలు తెరిచామని వెల్లడించారు. జీరో బ్యాలెన్స్‌తో ఖాతా తెరవాలని పిలుపునిచ్చాం.. కానీ పేదలు తమ ఖాతాల్లో 5 వేల కోట్ల రూపాయాలు జమ చేశారని చెప్పారు. ఈ విషయాన్ని మోడీ ఉద్వేగంగా పేర్కొనగా.. వీక్షకులంతా కరతాళ ధ్వనులతో అభినందించారు. దాదాపు 75 కోట్ల మంది పేదరికంలో మగ్గిపోతున్నారని మోడీ అన్నారు. ‘వారిని అభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలని.. తాను ఈ విషయం గురించి రిజర్వ్‌బ్యాంక్‌ను అడిగితే చేయొచ్చు కానీ కనీసం మూడేళ్లు పడుతుందని చెప్పారన్నారు. ఆర్తిక మంత్రిత్వ శాఖను అడిగితే రెండేళ్లు పడుతుందని చెప్పారు. ప్రధాని కార్యాలం వారిని పిలిచి అడిగాను.. కనీసం ఏడాది పడుతుందని వాళ్లు బదులిచ్చారు. చివరకు ఆగస్టు 15న ఎర్రకోట నుంచి చెప్పేశాను.. 150 రోజుల్లో పని పూర్తి చేయాలని’ అన్నారు.

గాంధీజీకి కానుక ఇద్దాం

భారత్‌ను 2019 నాటికి పరిశుభ్ర భారత్‌గా మార్చి జాతిపిత గాంధీజీకి కానుకుగా ఇద్దమని మోడీ పిలుపునిచ్చారు. 150 జయంతి నాటికి దేశాన్ని పరిశుభ్రంగా మారుస్తామని తెలిపారు. అందుకోసమే స్వచ్ఛభారత్‌ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. పరిశుభ్రత విషయంలో మన వైఖరి మారాలని అన్నారు. దేశంలో మహిళలకు మరుగుదొడ్లు లేకపోవడం సిగ్గుచేటు అని వ్యాఖ్యానించారు. మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రవాస భారతీయుల సహకారం కావాలని కోరారు. విదేశాలకు వెళ్లినప్పుడు అక్కడ అద్దల్లాంటి రోడ్లు చూసి ముచ్చట పడతామని, అదే సమయంలో మనకు మన దేశంలో చెత్తతో నిండిన రోడ్లు గుర్తుకు వస్తాయని మోడీ తెలిపారు. ఈ పరిస్థితిని మార్చడానికే బాపూజీ జయంతి రోజున స్వచ్ఛభారత్‌ అభియాన్‌ ప్రారంభించామన్నారు. భారత్‌లోని అన్ని వర్గాల వాళ్లు హృదయపూర్వకంగా స్వచ్ఛభారత్‌ కార్యక్రమంలో పాల్గొంటున్నారని తెలిపారు. చెత్తను శుభ్రం చేసుకోవడాన్ని తాను గౌరవంగా భావిస్తానని చెప్పారు. చెత్త ఎత్తడానికి చెత్తవాళ్లే రానక్కర్లేదని అన్నారు. దీపావళి తర్వాతి రోజు ఇళ్లు శుభ్రం చేసుకోవాలంటేనే కష్టపడతామని, అలాంటిది ఊరు మొత్తాన్ని కొద్ది మంది ఎలా శుభ్రం చేస్తారని ప్రధాని ప్రశ్నించారు. ఆస్టేల్రియాలో ఏం నేర్చుకున్నారని అడిగితే.. శ్రమకిచ్చే గౌరవం అని చెబుతానన్నారు. 2019 నాటికి స్వచ్ఛభారత్‌ను గాంధీజీకి కానుకగా ఇద్దామన్నారు.

బుద్ధిబలం కావాలి..

ప్రపంచ దేశాలతో పోటీపడే సత్తా మనకుందని ప్రధాని తెలిపారు. సామాన్యుల జీవితాల్లో మార్పు కోసమే సంస్కరణలు తీసుకురానున్నట్లు చెప్పారు. రైల్వేలో వంద శాతం ఎఫ్‌డీఐలకు అనుమతులిచ్చామని తెలిపారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రపంచానికి మానవ వనరులు అవసరమని అభిప్రాయపడ్డారు. కేవలం టెక్నాలిజీతోనే అంతా నడవదు. దాన్ని నడిపించేందుకు మానవ వనరులు కావాలన్నారు. ప్రపంచానికి అవసరమైన మానవ వనరులను అందించే సత్తా మనకుందని చెప్పారు. ప్రపంచ దేశాల్లో వైద్యులు, నర్సులు, ఉపాధ్యాయుల కొరత ఉందని తెలిపారు. భారత్‌కు అపార మేధా సంపత్తి ఉంది.. ప్రపంచానికి సేవలందించే మానవ వనరులను తయారుచేయాలని సూచించారు. భారతీయులు విశ్వమానవులు అన్న పేరు సంపాదించాలని ఆకాంక్షించారు.

కలల భారత్‌ను సాధిద్దాం

‘విూరు కలలుగన్న భారత్‌ను రూపొందించాలని అనుకుంటున్నా. అందుకు అందరి సహకారం కావాలని’ మోడీ పిలుపునిచ్చారు. సమాజంలోని అన్ని వర్గాలను కలుపుకొని ముందుకు వెళ్తాతామని హావిూ ఇచ్చారు. అందుకే శ్రమయేవ జయతే కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. మన ప్రజలను మనం నమ్మకపోతే ఎవరు నమ్ముతారు. మన వాళ్లను మనం నమ్మకపోతే పక్కవాళ్లను నమ్ముతామా? అని అన్నారు. పేదలను నమ్మకపోతే ఖాతాల్లో 5 వేల కోట్లు వచ్చేవా? అని ప్రశ్నించారు. పాస్‌పోర్టుల కోసం, ఇంకా వివిధ రకాల పనుల కోసం గెజిటెడ్‌ అధికారుల వద్ద సంతకాలు చేయించుకొనే సంస్కృతికి ఇక కాలం చెల్లాల్సిందేనన్నారు. అవతల ఎవరో సర్టిఫై చేస్తేనే మన వాళ్ల నిజాయతీని నమ్మాలా? అని ప్రశ్నించారు. ఈ సమస్యను చాలా మంది ఎదుర్కొంటారని, ఇక మిదీట అలాంటి సమస్య ఉండబోదని స్పష్టం చేశారు. 125 కోట్ల మంది భారతీయుల విూద తనకు పూర్తి నమ్మకం ఉందని, అందుకే గెజిటెడ్‌ అధికారుల సంతకాల అవసరాన్ని పూర్తిగా తప్పించానని చెప్పారు. మాడిసన్‌ స్వ్కేర్‌లో చెప్పినట్లు అన్నీ అమలు చేస్తున్నామన్నారు. ప్రవాస భారతీయులందరికీ జీవిత కాల వీసా ఇవ్వనున్నట్లు తెలిపారు. జనవరి 9 నాటికి పీఐవో, ఓసీఐలను విలీనం చేస్తామని చెప్పారు. ఫిబ్రవరి నాటికి సిడ్నీలో ఇండియన్‌ కల్చరల్‌ సెంటర్‌ను ఏర్పాటుచేస్తామని తెలిపారు.