భారీవర్షాలకు నేలకూలిన చెట్టు
కాకినాడ,జూలై10(జనం సాక్షి ): తూర్పుగోదావరిలో పలు ప్రాంతాల్లో వర్షం జోరుగా కొడుతోంది. సామర్లకోట మండలం సామర్లకోట కాకినాడ రోడ్డులో వికే రాయపురం వద్ద భారీ వృక్షం రోడ్డుకు అడ్డంగా కూలింది. సోమవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి రాయపురం బస్సు షెల్టర్ వద్ద ఉన్న భారీ వృక్షంమంగళవారం మధ్యాహ్నం నేలకూలింది. సవిూప దుకాణాల వద్ద నిలుపుదల చేసిన మోటర్ సైకిళ్లపై పడటంతో ఒక మోటర్ సైకిల్ ధ్వంసం కాగా, రెండు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ప్రతి రోజు వేలాది సంఖ్యలో వాహనాల రాకపోకలు సాగిస్తుండగా వృక్షం కూలే సమయంలో వాహనాలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కిలో విూటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. ఇకపోతే ఎగువ ప్రాంతాల్లో గత కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో ధవళేశ్వరం ఆనకట్ట వద్ద గోదావరి నీటిమట్టం స్వల్పంగా పెరిగింది. దాంతో దిగువకు సుమారు లక్ష క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు జల వనరుల శాఖ హెడ్‌వర్క్ ఈఈ ఆర్. మోహన్ రావు తెలిపారు. రానున్న మూడు నాలుగు రోజుల్లో సుమారు రెండు నుంచి రెండున్నర లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసే అవకాశం ఉందన్నారు.