భారీ వర్షాల దృష్ట్యా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి:

పినపాక నియోజకవర్గం జూలై 11 (జనం సాక్షి): జిల్లా మణుగూరు మండలంలో గత మూడు రోజులుగా విస్తారంగా కురుస్తున్న భారీ వర్షాలతో చిన్నరాయిగూడెం, కొండాయిగూడెం , గ్రామాలలో గోదావరి నది ఉదృతీ పెరగటం తో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ , పినపాక శాసనసభ్యులు , భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రేగా కాంతారావు గోదావరి నది ప్రాంతాన్ని ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. లోతట్టు ప్రాంత ప్రజలకు ఇబ్బంది కలగకుండా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ,రోడ్లపై నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. నైరుతి రుతుపవనాలు ప్రభావంతో రాష్ట్రమంతటా రానున్న 48 గంటలపాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరిచ్చిందని ఆయన తెలిపారు. జిల్లాలోని పలుచోట్ల వాగులు వంకలు వరద నీటితో పోటెత్తుతున్నాయని ఎలాంటి ప్రాణహాని జరగకుండా రెవిన్యూ పోలీస్, వైద్య, విద్యుత్ శాఖల అధికారులు 24 గంటలపాటు ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఎవరు బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు. ప్రజా ప్రతినిధులు అధికారులు సమన్వయంతో సహాయ చర్యలలో పాల్గొనాలని కోరారు. భారీ వర్షాల వల్ల సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రాంత ప్రజలకు సమస్య ఎక్కువగా ఉంటుందన్నారు, వైద్య ఆరోగ్య శాఖాధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మణుగూరు మండల టిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పార్టీ నాయకులు, పలు శాఖల ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు.