భార్య శవాన్ని భుజాన వేసుకుని భర్త
ఓ చేత పసిగుడ్డు.. మరో చేత కట్టెగా మారిన ఆలి.. ఏంచేయాలో తోచక.. శవం, పిల్లలతోపాటు అర్థరాత్రి సొంతూరికి బస్సెక్కాడా భర్త. భార్య లేదనే బాధను పంటిబిగువన బిగబట్టి పిల్లలను సముదాయిస్తూ.. తనను తాను సముదాయించుకుంటుండగానే.. బస్సు ఆగింది. భార్యశవాన్ని భుజానేసుకుని.. పిల్లలతోపాటు బస్సు దిగి.. ఖర్మను నిందిస్తూ.. బస్టాండులోనే రోదిస్తూ కూర్చున్నాడు. ఈ హృదయ విదారక ఘటన తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యంతో ఓ గర్భవతి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చి ఆ తల్లి కన్నుమూసింది. ఈ విషయం తెలుసుకున్న భర్త .. తన భార్య శవాన్ని సొంతూరుకు తరలించేందుకు పడిన పాట్లు ప్రతి ఒక్కరినీ కన్నీరు పెట్టించేలా ఉన్నాయి.
మహబూబ్‌నగర్ జిల్లా ఊట్కూర్ మండల కేంద్రానికి చెందిన మమ్మద్ షఫి హైదరాబాద్‌లోని కాటేదాన్‌లో భార్యా పిల్లలతో ఉంటు లారీ క్లీనర్‌గా పనిచేస్తున్నాడు. మంగళవారం ఉదయం ఎప్పటిలాగే షఫి తన విధులకు వెళ్ళాడు. నిండు గర్బిణీ అయిన షఫి భార్య ముష్రత్‌బేగ్ (35)ను రాత్రి 10 గంటల సమయంలో కాలనీలోనే ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లింది. 10:50 గంటల సమయంలో ఆడశిశువుకు జన్మనిచ్చి తల్లి చనిపోయింది. అయితే.. వెంట ఎవరూ లేకపోవటంతో ఆసుపత్రి సిబ్బంది శవాన్ని ఓ మూలన వేడేశారు.
రాత్రి పొద్దుపోయాక ఇంటికి వచ్చిన షఫి.. తన భార్య ఆస్పత్రిలో ప్రసవించిన విషయాన్ని తెలుసుకుని పరుగుపరుగునా ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడకు వెళ్లేసరికి భార్య కట్టెగా మారివుంది. దీంతో కన్నీరుమున్నీరుగా విలపించాడు. ఇక చేసేదేం లేక మృతదేహాన్ని భుజాన వేసుకుని, పసిగుడ్డు, తన ఇద్దరు కొడుకులతో కలిసి అర్థరాత్రి రాయచూర్ బస్సు ఎక్కాడు.
అయితే, హైదరాబాద్ నుంచి మక్తల్ వెళ్లాలంటే.. ఒక్కొక్కరికి రూ.156 చొప్పున రూ.312 అవసరం. కానీ షఫి జేబులో రూ.200 మాత్రమే ఉన్నాయి. దీంతో తనకు, భార్య శవానికి పాలమూరు వరకే టికెట్ తీసుకున్నాడు. బస్సులో ప్రయాణికులకు మాత్రం తన భార్య బాలింత అని చెప్పి వెనుక సీటులో పడుకోబెట్టాడు. తెల్లవారుజామున పాలమూరు బస్టాండులో శవాన్ని దించి గేటు పక్కన పడుకోబెట్టాడు. అక్కడి నుంచి ఊరికి వెళ్ళేందుకు డబ్బులు లేకపోవడంతో పిల్లలు, భార్య శవంతో అక్కడే రోదిస్తూ కూర్చున్నాడు.
ఇంతలో కార్మికుల సార్వత్రి సమ్మెలో భాగంగా ఆర్టీసీ కార్మికులు.. గేటు పక్కన రోదిస్తున్న షఫి వద్దకు వెళ్లి విచారించడంతో అతను అసలు విషయం వెల్లడించాడు. దీంతో వారంతా దయదలచి.. చందాలు వేసుకోగా మొత్తం రూ.8 వేలు వసూలైంది. ఈ సొమ్మును అతనికిచ్చి.. స్వగ్రామం ఉట్కూర్‌కు పంపించారు. ఈ విషయం తెలుసుకుని బస్టాండుకు వచ్చిన సీఐ సోమ్‌నారాయణ్ సింగ్ వివరాలు నమోదు చేసుకుని.. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.