భూకంపం ఎట్లుంటదో చూపెడుతా : కేసీఆర్‌

తెలంగాణ సమస్యలపై పోరుకు కార్యవర్గ నిర్ణయం
హైదరాబాద్‌, మే 8 (జనంసాక్షి) :
భూకంపం ఎట్లుంటదో చూపెడుతానని టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ అన్నారు. బుధవారం తెలంగాణ భవన్‌లో నిర్వహిం చిన పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. భూకంపాన్ని ఎదుర్కొంటానని అన్న ముఖ్యమంత్రి కిరణ్‌కు తెలంగాణ ప్రజల శక్తిని రుచి చూపిస్తామని హెచ్చరించారు. టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పలు నిర్ణయాలను పార్టీ ఎల్‌పీ నేత ఈటెల రాజేందర్‌ మీడియాకు వెల్లడించారు. బయ్యారం ఉద్యమం ఉధృతం,    ఈనెల 15 నుంచి జూన్‌ 2 వరకు నియోజకవర్గ కార్యకర్తల శిక్షణా తరగతులు ఉంటాయని ఆయన పేర్కోన్నారు. శిక్షణా తరగతులకు 7వేల నుంచి 10 వేల వరకు కార్యకర్తలు హాజరవుతారని తెలిపారు. ఈ నెల 10 తేదిన జిల్లా కేంద్రాల్లో ధర్నాలు, 14న మండల కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహించాలని తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు. నిజాం షుగర్స్‌ని సర్కారు తిరిగి స్వాధీనం చేసుకోవాలని, లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని తెలిపారు. జీహెచ్‌ఎంపీ కార్మికుల ఆందోళనకు మా పూర్తిస్థాయి మద్దతు ఉంటుందని, కాంట్రాక్ట్‌ కార్మికులను రెగ్యులరైజ్‌ చేయాలని టీఆర్‌ఎస్‌ పొలిట్‌బ్యూరో సభ్యుడు నాయిని నర్సింహరెడ్డి డిమాండ్‌ చేశారు. జేఏసీ ఇచ్చే ‘ఛలో హైదరాబాద్‌’కు లక్షలాది మంది కార్యకర్తలతో కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని తెలిపారు. కార్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ ఓడిపోయినట్లు గానే ఇక్కడ కూడా కాంగ్రెస్‌ తుడుచుపెట్టుకు పోతదని నాయిని జోష్యం చెప్పారు. మెదక్‌ ఎంపీ విజయశాంతి తదితరులు సమావేశంలో పాల్గొన్నారు