భూ సేకరణ బిల్లుకు అఖిలపక్షం ఆమోదం
న్యూఢిల్లీ, ఏప్రిల్ 18 (జనంసాక్షి) :
నూతన భూసేకరణ బిల్లుకు అఖిలపక్షం ఆమోదం తెలిపింది. ఈ బిల్లు త్వరలో పార్లమెంట్ ముందుకు రానుంది. వివిధ పక్షాల మధ్య నెలకొన్న విభేదాలతో భూ సేకరణ బిల్లుపై ఏర్పడిన సందిగ్ధత తొలగిపోయింది. బీజేపీ లేవనెత్తిన పలు అభ్యంత రాలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో బిల్లు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టేందుకు మార్గం సుగమమైంది. ఈ మేరకు భూసేకరణ బిల్లుపై గురువారం ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశం అంగీకారం తెలిపింది. సోమవారం నుంచి ప్రారంభం కానున్న రెండో విడత పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టేందుకు అంగీకరిం చింది. అఖిలపక్ష సమావేశంలో భూసేకరణ బిల్లుపై ఏకాభిప్రాయం వ్యక్తమైందని కేంద్ర మంత్రి కమల్‌నాథ్, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకురాలు సుష్మాస్వరాజ్ తెలిపారు. సమావేశం అనంతరం వారు విలేకరులతో మిగతా 2లోమాట్లాడారు. ‘భూసేకరణ బిల్లుపై పూర్తి ఏకాభిప్రాయం సాధించాం’ అని వారిద్దరు ప్రకటించారు.బీజేపీ లేవనెత్తిన ప్రధాన డిమాండ్‌కు ప్రభుత్వం అంగీకరించడంతో బిల్లుపై ఏకాభిప్రాయం సాధ్యమైంది. బిల్లులో సేకరణకు బదులు ‘అభివృద్ధి కోసం లీజు’ అన్న పదాన్ని చేర్చాలని బీజేపీ పట్టుబట్టింది. తద్వారా రైతులే భూ యజమానులుగా కొనసాగుతారని, ఏటేటా వారికి ఆదాయం వస్తుందని తెలిపింది. తొలుత దీనికి అంగీకరించని ప్రభుత్వం చివరకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు ‘భూసేకరణ బిల్లు-2011’లో సవరణలు చేసేందుకు అంగీకరించింది. అయితే, నూతన బిల్లుపై వామపక్షాలతో పాటు డీఎంకే వ్యతిరేకత వ్యక్తం చేసింది. ఈ బిల్లు వల్ల అనేక మంది రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతారని సీపీఎం ఆందోళన వ్యక్తం చేసింది. ‘బిల్లులో అనేక లొసుగులు ఉన్నాయి. ప్రస్తుత బిల్లు రూపం రైతుల ప్రయోజనాలకు పూర్తిగా వ్యతిరేకం. బిల్లుపై పార్లమెంట్‌లో చర్చ సందర్భంగా పలు సవరణలు ప్రవేశపెడతాం’ అని సీపీఎం నేత బసుదేవ్ ఆచార్య తెలిపారు. మరోవైపు, భూసేకరణ బిల్లు సమాఖ్య స్ఫూర్తికి పూర్తి విఘాతమని, దీన్ని తమ పార్టీ అంగీకరించబోదని డీఎంకే నేత టీఆర్ బాలు స్పష్టం చేశారు.