భోజన ఏజెన్సీలకు అడ్వాన్స్‌గా నిధులు

నిజామాబాద్‌,మే24(జ‌నం సాక్షి): భోజన ఏజెన్సలీలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. వచ్చే ఏడాదికి సంబంధించిన మధ్యాహ్న భోజనం నిధులు ముందుగానే విడుదల చేయడంతో ఏజెన్సీల నిర్వాహకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వండివార్చిపెట్టిన వారికి ఆర్థిక కష్టాలు లేకుండా చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వ, జడ్పీ, ట్రైబల్‌ వెల్ఫేర్‌, ఎయిడెడ్‌ పాఠశాలల్లో కొన్నేళ్లుగా మధ్యాహ్న భోజనం అమలవుతోంది. దీని కోసం ప్రత్యేకంగా ఏజెన్సీలను ఏర్పాటు చేసి ప్రతి రోజూ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. ప్రభుత్వ విద్యారంగంలో చదివే ప్రతి విద్యార్థికి కనీసం ఒక్కపూటైనా పౌష్ఠికాహారం అందించాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రారంభించారు. కానీ ఏజెన్సీలకు ముందస్తుగా నిధులు రాకపోవడం, వంట చేసినా నెలల తరబడి బిల్లుల కోసం వేచి చూడాల్సి రావడంతో అనేక సార్లు మధ్యాహ్న భోజనం నిర్వాహకులు ధర్నాకు సైతం దిగేవారు. ఇప్పుడా సమస్య లేకుండా గతానికి భిన్నంగా మొదటి సారి విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే నిధులు రావడంతో మధ్యాహ్నభోజన ఏజెన్సీల నిర్వాహకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే పేద విద్యార్థులకు ప్రత్యేకమైన పౌష్ఠికాహారంలో భాగంగా ఏడాది నుంచి వారానికి మూడు సార్లు కోడిగుడ్లను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో మధ్యాహ్నభోజన ఏజెన్సీలు ఒక్కో కోడిగుడ్డు రూ.5కు వస్తుందని ఇంత భారీ మొత్తంలో కోడిగుడ్లకు ఖర్చు చేయలేమని అనేక
పాఠశాలల్లో విద్యార్థులకు కోడి గుడ్లు అందించడం మానేశారు. మధ్యాహ్న భోజనానికి ఆయా రోజుల్లో ఇస్తున్న దాంట్లోనే గుడ్డును అందించాల్సి ఉండేది. దీంతో ఈ ఏడాది ప్రతీ విద్యార్థికి తప్పని సరిగా కోడి గుడ్డు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ముందుగానే కోడిగుడ్లకు ప్రత్యేకంగా నిధులు విడుదల చేసింది.దీంతో జిల్లాలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు పౌష్ఠికాహారం అందించనున్నారు.