మంజీరా డ్యాం, సింగూర్ ప్రాజెక్ట్ ను పరిశీలించిన జిల్లా కలెక్టర్

టౌన్ జనం సాక్షి
వర్షాల దృష్ట్యా ఎలాంటి ప్రమాద పరిస్థితులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో అన్నివేళలా అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ నీటిపారుదల శాఖ అధికారులకు ఆదేశించారు గురువారం జిల్లా కలెక్టర్ శరత్ అదనపు కలెక్టర్లు రాజర్షి షా, వీరారెడ్డి తో కలిసి జిల్లాలోని మంజీరా డ్యామ్, సింగూర్ ప్రాజెక్టులను సందర్శించి పరిశీలించారు. గత ఆరు రోజులుగా కురుస్తున్న వర్షాల దృష్ట్యా సింగూర్, మంజీరా డ్యామ్ నీటిమట్టాలను, ప్రస్తుత పరిస్థితి ని పరిశీలించారు. మంజీరా సింగూర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వలు, ప్రస్తుత నీటిమట్టం, ఇన్ ఫ్లో,అవుట్ ఫ్లో తదితర విషయాలను నీటిపారుదల శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్ష తీవ్రత తగ్గినప్పటికీ అధికారులు అప్రమత్తంగా ఉండడంతో పాటు ప్రజలను అప్రమత్తంగా ఉండేలా చూడాలన్నారు. ముఖ్యంగా నీటిపారుదల, విద్యుత్ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితులు సమీక్షించాలన్నారు. ఎలాంటి ప్రమాద పరిస్థితులు తలెత్తకుండా ఆయా అధికారులు ముందస్తు ప్రణాళికతో అన్నివేళలా అప్రమత్తంగా ఉండి సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రాజెక్టు నుండి నీరు వదిలే ముందు ముంపు గ్రామాల ప్రజలకు టామ్ టామ్ ద్వారా తెలియజేసి అప్రమత్తం చేయాలని తాసిల్దార్, ఎంపీడీవో కు సూచించారు.వర్షాలు తగ్గేవరకు మంజీరా డ్యాం, సింగూర్ ప్రాజెక్టుల వద్దకి పర్యాటకులను అనుమతించవద్దని  సూచించారు.
కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్లు రాజర్షి షా, వీరారెడ్డి, నీటిపారుదల శాఖ ఎస్ ఈ. మురళీధర్, ఈ ఈ మధుసూదన్ రెడ్డి, విద్యుత్ శాఖ ఎస్ ఈ మాధవరెడ్డి, రెవిన్యూ డివిజనల్ అధికారి నగేష్, ఆయా ఎమ్మార్వోలు, ఎంపీడీవోలు, తదితర అధికారులు ఉన్నారు.