మండలంలో మళ్లీ మొదలైన చోరీలు

చండ్రుగొండ జనంసాక్షి (జూలై  21): చోరీలకు పాల్పడే  దొంగలు పంట పొలాల్లోని  మోటార్లపై కన్నేస్తున్నారు. గతంలో  ఈ సంఘటనలు అనేకం జరిగాయి. తిప్పనపల్లి, మొహమ్మద్ నగర్  గ్రామాల పరిధిలోని రైతులకు చెందిన   నీళ్ల మోటార్లు, కరెంట్ వైర్లు,  కరెంటు డీవీల లో రాగితీగలు చివరకు కల్లాల్లో ఆరబోసిన  మిర్చి  ఒడ్ల ను సైతం  దొంగలు వదలకుండా దోచేసుకున్నారు.  ఇలాంటి సంఘటనలకు ఈమధ్య కాస్త బ్రేక్ పడినప్పటికీ  తాజాగా విద్యుత్ నీళ్ల మోటార్ దొంగతనం జరిగిన సంఘటన గురువారం మండలంలో జరగడంతో  రైతుల్లో భయం మొదలైంది. ఇక వివరాల్లోకెళితే… తిప్పనపల్లి గ్రామానికి చెందిన అంచా సత్యనారాయణ కు చెందిన  వ్యవసాయ క్షేత్రంలో  కరెంట్ మోటార్ ను  గుర్తుతెలియని వ్యక్తులు  అపహరించుకెళ్లారు. ఈ విషయం తెలియని సదరు రైతు  రోజూ లాగానే  తన వ్యవసాయ క్షేత్రానికి వెళ్లాడు మోటార్  అపహరణకు గురైనట్లు గుర్తించారు. బోరుబావిలో  రాళ్లు, మట్టి గడ్డలు, మోటార్ కు సంబంధించిన  పనిముట్లను వేయడంతో  ఇక ఆ బోరుబావి కూడా పనిచేయకుండా పోయిందని  బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు  లక్షా యాభై వేల రూపాయలు నష్టం జరిగిందని  తెలిపారు. అయితే  బోరు బావిలో ఉన్న మోటార్ ను పైకి లాగేందుకు ఎక్కువ సమయం పడుతుందని   ఈ పని  ఒక్కరూ ఇద్దరితో అయ్యే పనికాదని రైతులు  అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి దొంగతనాలు  పునరావృతం కాకుండా చూడాలని పటిష్ట పెట్రోలింగ్  నిర్వహించాలని  రైతులు  కోరుకుంటున్నారు.