మంత్రుల కమిటీ తొలిభేటీ

సీబీఐ స్వయం ప్రతిపత్తిపై చర్చ
న్యూఢిల్లీ, మే 23 (జనంసాక్షి) :
సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (సీబీఐ)కు స్వయం ప్రతిపత్తి కల్పించే అంశంపై కేంద్ర మంత్రివర్గ ఉప సంఘం గురువారం సాయంత్రం భేటీ అయింది. ఈ భేటీలో కేంద్ర మంత్రులు చిదంబరం, కపిల్‌ సిబాల్‌, నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు. ఈ భేటీలో అనేక అంశాలపై చర్చించారు. ఎన్నికల సంవత్సరం కావడంతో అవినీతి కేసులు, కుంభకోణాల ప్రభావం సర్కారుపై పడకుండా ఉండేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చలు జరిపారు. యూపీఏ -2 ప్రభుత్వ హయాంలో వెలుగు చూసిన కుంభకోణాలు, బొగ్గుబ్లాకుల కేటాయింపులో జరిగిన లక్షల కోట్ల కుంభకోణం తాలూకు విచారణ నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించడానిక ముందే కేంద్ర ప్రభుత్వంతో పంచుకోవడంపై సుప్రీం కోర్టు సీబీఐని, కేంద్ర ప్రభుత్వాన్ని చీవాట్లు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కోర్టు సీబీఐ వ్యవహారంపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. పంజరంలో ఉన్న చిలక మాదిరి సీబీఐ తన యజమాని (కేంద్ర ప్రభుత్వం) చెప్పినట్టుగా నడుచుకుంటోందని, దానికి విముక్తి కల్పించాలని వ్యాఖ్యానించింది. కేంద్రం ఇందుకు సంబంధించిన చర్యలు చేపట్టకుంటే తామే ఇందుకు ఉపక్రమించాల్సి ఉంటుందని హెచ్చరించింది. దీంతో దిగివచ్చిన కేంద్రం సీబీఐకి స్వయం ప్రతిపత్తి కల్పించేందుకు మంత్రులతో కూడిన ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈమేరకు ఉపసంఘం భేటీలో పలు అంశాలపై చర్చించింది.