మట్టి పొరల్లోంచి ఎగిసిన జ్వాలలు

వసంత మేఘాలు గర్జించినపుడు ఉరుములు ఉరుముతాయి. మట్టి పొరల్లోకి వాన చినుకులు ఇంకగానే  చిరుమొక్కలు మొలకెత్తుతాయి. కొత్త ఆశలు చిగురిస్తాయి. పోరుగాలి వీచగానే నివురు గాలికెగరగానే నిప్పులు నిరసన జ్వాలలై ఎగిసిపడుతాయి. సీమాంధ్రులు తెలంగాణ ఆత్మ గౌరవాన్ని గాయపర్చడం జరిగినపుడు తెలంగాణ ఆత్మగౌరం కెరటాలు మహాజ్వాలలై నింగికెగపాయి. పడిలేచే అలలే ఈ నిరసన జ్వాలలకు ఆదర్శం. అది ఓయూలో ఐనా, కాకుంటే కెయు లో అయినా , మరోసారి మహబూబాబాద్‌ అయినా, అవే మంటలు సిరిసిల్లలో  అయినా నింగికంటుతాయి. ఆరిపోని అగ్నిజ్వాలలు కణకణ మండే నిప్పు తెలంగాణ ఉద్యమం. ఉద్యమం తగ్గిపోయిందనో, వాడివేడి చల్లబడిందనో భ్రమించి మేక వన్నె పులిలా  తెలంగాణలో  పాగా వేద్దామని నేతన్నల హంతకులే ప్రయత్నిస్తే, తెలంగాణకు దొడ్డిదారిన వస్తే తెలంగాణ ఉద్యమ పోరుబిడ్డలు నిప్పుకు చెదలెట్ల బడుతయి అని నిగ్గదీసి అడిగిండ్రు.ఎగిసిబడ్డ జ్వాలలను చూసి సీమాంధ్ర కిరాయి సైన్యం తోకముడిచింది. అర్దాంతరంగా దీక్ష విరమించింది. విజయమ్మ చేనేత దీక్ష ఓడ్రామా అంటూ తెలంగాణ ప్రాంత నాయకులు..విజయమ్మ మా గడ్డపై అడుగుపెట్టొద్దు…. అంటూ తెలంగాణవాదులు ఎంతలా మొత్తుకొన్న సీమాంధ్ర అహంకారంతో సిరిసిల్ల పోరుగడ్డపై చేనేత దీక్ష పేరుతో అడుగుపెట్టిన విజయమ్మకు తెలంగాణవాదులు చుక్కలు చూపించారు. కాదు..కాదు చెప్పులు చూపించారు. హైద్రాబాద్‌ నుండి బయలుదేరినప్పటి నుండి విజయమ్మకు అడ్డంకులు ప్రారంభమయ్యాయి. హైద్రాబాద్‌లో అడుగడుగునా విద్యార్థి నాయకులపై పోలీసులు తమ ప్రతాపం చూపారు. అక్కడి నుండి దారిపొడుగునా తమను అడ్డుకొన్న వారందరిపై పోలీసులతో, కిరాయిగూండాలతో దాడులు చేయించి అక్రమంగా సిరిసిల్లలో విజయమ్మ అడుగుపెట్టింది. సిరిసిల్లలో అడుగుపెట్టిన వెంటనే మంగళహారతులతో స్వాగతం పలుకుతుందనుకొన్న విజయమ్మకు చెప్పులతో స్వాగతం పలికారు. భ నడుస్తున్నంతసేపు తెలంగాణవాదులు ఆందోళనలు చేశారు. దీంతో ఏ నేతన్నలకొరకు తాను దీక్ష చేపట్టినట్లు చెప్పుకొందో అదే నేతన్నలపై తమ పార్టీ కార్యకర్తలు, సీమాంధ్ర కిరాయీ గూండాలను ఉసిగొల్పింది. ఇక్కడే సీమాంధ్ర నాయకుల దుర్మార్గం బయటపెడింది. ఈ పర్యటన చూస్తే ఏ అఫ్గాన్‌లోనో, ఇరాక్‌లోనో అమెరికా అధ్యక్షుడి పర్యటనలాగా సాగింది. నిరసన తెలియచేయడమే పాపం అన్నట్టుగా, వైఖరి తెలపడమే నేరం అన్నట్లుగా నిరసన తెలుపుతున్న ఓ మహిళపై సీమాంధ్ర రౌడీనో, మఫ్టీలో ఉన్న పోలీసో తెలియదు గానీ మీద చేయివేసి కిందికి నెట్టాడు. ఇది మానవ హక్కుల ఉల్లంఘన కాదా? మహిళలు నిరసన తెలుపుతున్నప్పుడు మహిళా పోలీసులను నియమించాలనీ తెలియని పోలీసుశాఖ కేవలం తెలంగాణ అన్న పదం వినగానే బాదడం ఒక్కటే తెలుసున్నట్లుగా సీమాంధ్ర గుండాలు, వైయస్‌ పార్టీ కార్యకర్తలు వ్యవహరిస్తుంటే మౌన ప్రేక్షకుల్లా మిగిలి పోయింది. తెలంగాణవాదులపై దాడిని కాంగ్రెస్‌ నాయకులు కూడా ఖండించాలి. మన బిడ్డలపై సీమాంధ్ర గుండాలు చేస్తున్న దాడులను అందరూ ఖండించి వారు మరోసారి మన బిడ్డలపై దాడి జరగకుండా భాద్యత అన్ని రాజకీయ పార్టీలపై ఉంది.