మద్యం దుకాణాల రిజిస్టేష్రన్‌ తప్పనిసరి

దుకాణాల్లో సీసీ కెమెరాలు ఉండాల్సిందే
నల్లగొండ,నవంబర్‌4 (జనంసాక్షి) :  ఈ సారి మద్యం పాలసీలో కొన్ని కీలక మార్పులు చేశారు. దుకాణాలు పరిసర ప్రాంతాలు కన్పించేలా ఒక్కో దుకాణం వద్ద రెండు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నోటిఫికేషన్‌లో నిబంధన చేర్చారు. ఈ నిబంధన గతంలోనే ఉన్నా వ్యాపారులు పాటించలేదు. దీంతో ఒరిజినల్‌ లైసెన్స్‌ జారీ చేసే నాటికి అన్ని దుకాణాల వద్ద తప్పనిసరిగా సీసీ కెమెరాలు బిగించాల్సి ఉంది. ఈ కెమెరాలు ఎక్సైజ్‌ కంట్రోల్‌ రూంకి అనుసంధానం చేయానున్నారు. తద్వారా దుకాణం వద్ద జరిగే అమ్మకాలను అధికారులు పరిశీలించనున్నారు. కౌంటర్ల వద్ద లూజ్‌ సెల్‌ లేకుండా, మద్యం కల్తీ జరుగకుండా సీసీ కెమెరాల నిబంధన ఖచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. నూతన మద్యం దుకాణాల ఏర్పాటు పూర్తయ్యింది. దుకాణాల ఏర్పాటుకు, ఎక్సైజ్‌ శాఖ నిబంధనల మేరకు బ్యాంకు గ్యారంటీ దుకాణాలకు సంబంధించిన మ్యాప్‌లు, సిట్టింగ్‌ రూమ్‌లు ఏర్పాటు చేసుకునేందుకు వారం రోజులు గడువు ఇచ్చారు. అన్నీ పూర్తయిన తరువాతే వ్యాపారులకు ఒరిజినల్‌ లైసెన్స్‌ జారీ చేయనున్నారు. ఈ సారి కొత్తపాలసీలో మద్యం దుకాణం వచ్చిన వ్యాపారులు తమకు సంబంధించిన పూర్తి వివరాలను ఆన్‌లైన్‌లో రిజిస్టేష్రన్‌ చేసుకోవాలి. వ్యాపారి పేరుతో పాటు ఆధార్‌ కార్డు, పాన్‌కార్డు, దుకాణం గెజిట్‌ నెంబర్‌, దుకాణంకు సంబంధించిన హద్దుల వివరాలన్నీ సీ-టెల్‌ సిస్టమ్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. ఈ వివరాల ఆధారంగా యూనిక్‌ కోడ్‌ జనరేట్‌ అవుతుంది. అన్ని ప్రభుత్వ శాఖల మాదిరిగా మద్యం దుకాణాల వివరాలను ఆన్‌లైన్‌ చేస్తున్నారు. దీంతో ఏ దుకాణం ఎంత మద్యం కొనుగోలు చేసింది, ఏబ్రాండ్‌ మద్యాన్ని కొనుగోలు చేశారు. నెలలో ఎంత అమ్మకాలు చేశారనే సమాచారం మద్యం డిపోతో పాటు ఎక్సైజ్‌ కమిషనర్‌, సూపరింటెండెంట్‌ కార్యాలయాల్లో ఎప్పటికప్పుడు తెలుసుకోనున్నారు.

తాజావార్తలు