మనగుట్టకు రూ.100 కోట్లు

C

సీఎం కేసీఆర్‌ ఏరియల్‌ సర్వే

బృహత్‌ ప్రణాళికపై అధికారులతో చర్చ

నల్లగొండ,ఫిబ్రవరి25(జనంసాక్షి): యాదగిరిగుట్ట అభివృద్దికి సంబంధించి మాస్టర్‌ ప్లాన్‌ చూశాక సిఎం కెసిఆర్‌ బుధవారం గుట్ట ప్రాంతాన్ని మరోమారు పరిశీలించారు. విహంగ వీక్షణం ద్వారానే కాకుండా గుట్టపైన కాలినడకన ఆయా ప్రాంతాలను పరిశీలించారు. ముఖ్యమంత్రి యాదగిరిగుట్టపై ప్రముఖ ఆర్కిటెక్టులు రాజ్‌, జగన్‌, టెంపుల్‌ ఆర్కిటెక్ట్‌ ఆనంద్‌సాయి, స్థపతి సౌందర్‌రాజన్‌, యాదగిరిగుట్ట డెవలప్‌మెంట్‌ ఆధారిటీ సారధి కిషన్‌రావులతో కలిసి ఏరియల్‌ సర్వే నిర్వహించారు. యాదగిరి లక్ష్మీనరసింహస్వామికి ప్రత్యేక పూజలు చేసిన తరువాత ఆలయ ప్రాంగణమంతా కలియతిరిగారు. దాదపు 40 నిమిషాల పాటు గుట్టపైన, మధ్య భాగంలో, గుట్ట పాద ప్రాంతంలో కాలినడక తిరిగి అణువణువు పరిశీలించారు. ఎక్కడెక్కడ ఏమి చేయాలో అధికారులతో కలిసి అంచనా వేశారు. అనంతరం దేవాదాయ శాఖ, రెవిన్యూ శాఖ, అటవీ శాఖ అధికారులు, ఆలయ ఆర్కిటెక్టులు, స్థపతి తదితరులతో సవిూక్ష నిర్వహించారు.భక్తుల పరిపూర్ణ ఆధ్యాత్మిక భావన పొందడంతో పాటు నిత్య జీవన వత్తిడి నుండి విముక్తి పొందే వాతావరణాన్ని యాదగిరిగుట్టలో కల్పించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు సంకల్పించారు. ప్రతి ఏటా బడ్జెట్‌లో 100 కోట్ల రూపాయలకు తక్కువ కాకుండా కేటాయిస్తూ యాదగిరిగుట్టను సమగ్ర ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. తెలంగాణలో అతి పెద్ద దైవ క్షేత్రమైన యాదగిరిగుట్టను అధ్బుత రీతిలో తీర్చిదిద్దాలని చేప్పారు. ఆగమ శాస్త్ర నియమాల ప్రకారం నిర్మాణాలు జరగాలని, ప్రస్తుతం ఉన్న వాటిలో మార్పు చేర్పులు చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు. చిన్న జియర్‌ స్వామిని కూడా త్వరలోనే యాదగిరిగుట్టకు తీసుకువచ్చి ఆయన సలహాలు, సూచనలు కూడా తీసుకుంటామని వెల్లడించారు. రాయగిరి నుండి యాదగిరిగుట్ట వరకు నాలుగు లైన్ల రోడ్డు నిర్మించాలని ఆర్‌ అండ్‌ బి అధికారులను ఆదేశించారు. గుట్టకు నాలుగు వైపులా ఉన్న వంగపల్లి, తుర్కపల్లి, రాయగిరి, రాజుపేట రోడ్లను బాగా అభివృద్ది చేయాలని, రోడ్ల ప్రక్కన ఆకర్శణీయమైన పూలు పూసే చెట్లు పెట్టాలని, గుట్ట చుట్టూ సుగంధం వెదజల్లే చెట్లు పెంచాలని ముఖ్యమంత్రి అటవీ శాఖ అధికారులను ఆదేశించారు. నాలుగు దిక్కుల నుండి యాదగిరిగుట్టకు వెళ్లే మార్గంలో ప్రవేశించగానే వేద మంత్రాలు, స్తోత్రాలు, భక్తి గీతాలు, ఆలయ ప్రకటనలు వినిపించే విధంగా సౌండ్‌ సిస్టం ఏర్పాటు చేయాలన్నారు. రోడ్లకు ఇరువైపులా భక్తి భావాన్ని పెంచే, నైతికి విలువలు పెంపోందించే, పర్యవరణాన్ని కాపాడే విధంగ రాతలు కనిపించలని ముఖ్యమంత్రి సూచించారు. రాయగిరి, యాదగిరి గుట్టల చెరువులను మిషన్‌ కాకతీయ కార్యక్రమం ద్వారా పునరుద్దరించి వాటిని టూరిస్టు స్పాట్‌లుగా అభివృద్ది చేయాలని నీటి పారుదల శాఖాదికారులను ఆదేశించారు. గుట్టపై భాగంలో దాదాపు 14.5 ఎకరాల స్థలం ఉందని, దీనిని అణువణువు సమర్ధవంతంగా, వ్యూహాత్మకంగా ఉపయోగించుకోవాలని చెప్పారు. ప్రధాన ఆలయం చూట్టూ మాడ వీధులు నిర్మించాలని చెప్పారు. చాలా దూరం నుంచి కూడా గోపురం, ఆలయం చక్కగా కనిపించే విధంగా నిర్మాణం ఉండాలన్నారు. గుట్టపైభాగంలోనే ప్రధాన ఆలయంతో పాటు కళ్యాణ మంటపం, యాగశాల, ప్రవచన శాల, వ్రతశాల, వంటశాల నిర్మించాలని చెప్పారు. కనీసం 500గదులు వచ్చే విధంగా గుట్టలోని వివిధ ప్రాంతాలలో కాటేజిలు నిర్మించాలని సూచించారు. గుట్టపైన కొన్ని వాహనాలు పట్టే విధంగా పార్కింగ్‌ స్థలం ఏర్పాటు చేయాలని, వచ్చి పోవడానికి వేరు వేరు దారులు నిర్మించాలని చెప్పారు. పెళ్లిళ్లు,వ్రతాలను పునరుద్దించాలని, సామూహిక సత్యనారాయణస్వామి వ్రతాలు చేసుకునే వెసులుబాటు కల్పించాలని ముఖ్యమంత్రి సూచించారు. నిర్మాణాలు జరిగే సందర్భంగా కూడా పూజలు ఆటంకం కలగని ప్రత్యుమ్నాయ మార్గాలను చూడాలని చెప్పారు. గుట్టపై హెలిప్యాడ్‌ నిర్మించాలని కొందరు అధికారులు చేసిన సూచనను ముఖ్యమంత్రి తిరస్కరించారు. ఆలయాన్ని అభివృద్ది చేసే క్రమంలో సంప్రదాయాలను, పవిత్రతను కాపాడటం కూడా అత్యంత కీలకమని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రభుత్వం ఇచ్చే నిధులతో పాటు అనేక మంది దాతలు కూడా ముందుకు వస్తారని, కార్పోరేట్‌ సంస్థలు, బహుళ జాతి కంపెనీలు కూడా  ఆలయ అభివృద్దిలో పాలు పంచుకునే అవకాశం ఉందని ముఖ్యమంత్రి అన్నారు. తాను ఎప్పటికప్పుడు యాదగిరిగుట్టకు వస్తూనే ఉంటానని, నిత్యం పనులను పర్యవేక్షిస్తానని చెప్పారు. యాదగిరిగుట్టలో నిర్మించే ఎత్తైన ఆంజనేయ స్వామి విగ్రహానికి కావలసిన రాయి ఎక్కడ దొరుకుందో తెలుసుకోవాలని, మంచి నైపుణ్యం కలిగిన శిల్పులకు బాధ్యత అప్పగించాలని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మల్యే గొంగిడి సునీత, ఆలయ ఇఒ గీత, ఆలయ పూజారులు లక్షి నర్సింహాచారి, కారంపూడి నరసింహాచారి తదితరులు పాల్గొన్నారు. ఎమ్మల్యే తీగల కృష్ణారెడ్డి ప్రచురించిన శరణు శరణు అని ఆధ్యత్మిక పుస్తకాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు ఆవిష్కరించారు. యాదగిరిగుట్ట, లక్ష్మీనరసింహస్వామిలకు చెందిన తైలవర్ణ చిత్రాలు, స్తోత్ర్రాలు, భక్తి గీతాలు, స్థల పురాణ గాధలు, దైవ మహత్యపు వివరణలు ఈ పుస్తకంలో ఉన్నాయి.