మనది సెక్యులర్‌ దేశం మిత్రమా..

ఎంఐఎం శాసనసభ పక్షనేత అక్బరుద్దీన్‌ ఓవైసీ గత నెల 24న ఆదిలాబాద్‌ నిర్మల్‌లో నిర్వహించిన బహిరంగసభలో ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడారు. తాను చట్టసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజాప్రతినిధిని అనే విషయం మరిచి ప్రజల్లో విద్వేషాలు రగల్చేలా వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడిన తీరు, ఉపయోగించిన భాషను చూస్తే ఎలాంటి పరిస్థితుల్లో మాట్లాడుతున్నారో అర్థమవుతుంది. సమస్త ముస్లింలకు తామే ప్రతినిధులం అన్నట్లుగా ప్రకటించుకునే ఎంఐఎం వారిని తమ వైపు తిప్పుకునేందుకు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. నిజానికి భారత్‌ సెక్యులర్‌ దేశం. ఇక్కడ హిందూ, ముస్లిం, క్రిస్టియన్‌, సిక్కు, జైన, బౌద్ధ తదితర మతాల వారు సహజీవనం సాగిస్తున్నారు. ఒకరి పండుగల్లో మరొకరు పాల్గొంటూ, ఒకరి కష్టసుఖాలను మరొకరు పాలు పంచుకుంటూ కలిసి మెలిసి జీవిస్తున్నారు. సెక్యులర్‌ భారత్‌లో ఎక్కువ శాతం ముస్లింలు భద్రతలోనే బతుకుతున్నారు. గుజరాత్‌ రాష్ట్రంలో జరిగిన మారణ హోమాలు కళ్లముందు కదలాడుతున్నా అతంటా ఆ పరిస్థితి లేదు. దేశంలోని 90 శాతానికి పైగా ప్రజలు సామాన్య ప్రజలే. ఉదయం లేచింది మొదలు రాత్రి పొద్దుపోయే వరకు వారంతా వివిధ కులాలు, మతాల వారితో కలిసి పనిచేస్తారు. కలిసి భోజనం చేస్తారు. రాకపోకలు సమయంలో పిచ్చాపాటిగా మాట్లాడుకుంటారు. వీరంతా సాధారణ ముస్లింల లాంటి వారే. మరి ప్రతి పౌరుడిని టార్గెట్‌ చేసేలా అక్బరుద్దీన్‌ వ్యాఖ్యానించడంలో అర్థమేమిటి? పాతబస్తీ రాజకీయాల్లో ఆరితేరిన కుటుంబం నుంచి వచ్చిన ఆయన కేవలం ఆ ప్రాంత నాయకుడిలాగే వ్యవహరించారు. పాతబస్తీని తమ స్వార్థం కోసం ఒకవర్గానికి చెందినదిగా ప్రచారం చేసుకుంటూ అక్కడి నిరుపేద ముస్లింల పొట్ట గొడుతున్నారు. వారి ఉపాధికి పరోక్షంగా గండికొడుతున్నారు. ఇప్పుడు రాష్ట్రంలోని సమస్త ముస్లిం ప్రజానీకానికి ప్రతినిధులమని చెప్పుకోవాలనే తపనతో స్వార్థ రాజకీయాల కోసం సోదరులలాంటి అమాయక ప్రజలపై విషం చిమ్ముతున్నారు. ప్రతి మతంలోనూ అతివాద భావజాలం ఉన్నవారు ఉంటారు. వారి వల్ల ఆయా మతాలే చెడ్డపేరు మూటగట్టుకోవాల్సి ఉంటుంది. ఒక్కోసారి అది వికృతరూపం దాల్చి మారణహోమాలకు, మరెన్నో విపరిణామాలకు తెరతీయవచ్చు. ఇలాంటి ఘోర పరిస్థితులను స్వతంత్ర భారతావని ఇంతకు ముందు కొన్ని సార్లు చూసింది కూడా. కానీ వాటినే పట్టుకుని భారతీయ సమాజం వేలాడలేదు. విధ్వంసం జరిగి విద్వేషాలు ప్రజ్వరిల్లేలా చేయాలని చూసిన ప్రతీసారి సంయమనం పాటించి శాంతికాములకమని పేరును నిలుపుకున్నారు. అసలు ఇన్ని జాతులు, మతాలు, తెగల ప్రజలు సహజీవనం సాగిస్తున్నారు కాబట్టే భారత్‌ ప్రపంచ దేశాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచింది. విదేశీ శక్తులు ఇక్కడ శాంతిని విచ్ఛిన్నం చేసి చొరబాట్లకు, దురాక్రమణకు పాల్పడాలని చూసిన ప్రతీసారి ఐక్యంగా పోరాడి తమసత్తా ఏమిటో చాటి చెప్పింది. అలాంటి స్వతంత్ర భారతదేశంలో రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ఓ ఎమ్మెల్యే అదే రాజ్యాంగాన్ని అవమానించేలా మట్లాడినా ఎవరూ పట్టించుకోకపోవడం సరికాదు. సెక్యులర్‌ దేశంలో ఎవరికైనా జీవించే హక్కును రాజ్యాంగం కల్పిస్తోంది. మరి రాజ్యాంగ బద్ధంగా సంక్రమించిన హక్కును కాలరాసే యత్నం చేయడాన్ని ఏమనాలి. ఇస్లాం శాంతిని, సోదరభావాన్ని, పరమత సహనాన్ని ప్రబోధిస్తుంది. ఇస్లాంను నమ్మేవారెవరూ మనుషుల్ని మరో కోణంలో చూడరు. ఇస్లాం అంటూ ఇంసానియత్‌ (మానవత్వం) త్యాగాన్ని, ఇతరులకు సహాయం చేయడాన్ని మనుషుల్ని ప్రేమించడం నేర్పిస్తుంది. అలాంటి ఓట్లు సీట్లు రాజకీయాల్లో మతాలను జొప్పించడం సరికాదు. ఇప్పటికే మత ప్రాతిపదికన ఏర్పడిన రాజకీయ పార్టీల వల్ల సుహృద్భావపూరిత వాతావరణం కొంత కొంతైనా దెబ్బతింటోంది. పరిస్థితి అంత దారుణంగా లేకున్నా ఆ స్థితికి చేర్చాలనుకోవడం అన్యాయం. రాజ్యాంగ వ్యవస్థలపై నమ్మకం లేనివారే అక్బరుద్దీన్‌లా మాట్లాడుతారు. ఒక్క అక్బరుద్దీనే కాదు ఆయనలా ఏ మతానికి చెందిన పార్టీ నాయకుడు వ్యాఖ్యానించినా యావద్భారతం ముక్తకంఠంతో ఖండించాల్సిందే. అలాగే ముస్లిం హక్కుల పరిరక్షించే సంస్థ ఎంఐఎం అయివుంటే వక్ఫ్‌బోర్డు ఆస్థుల్ని ల్యాంకో హిల్స్‌లాంటి సీమాంధ్ర సంస్థలకు అక్రమంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం కట్టబెడుతున్నా ఎందుకు ప్రశ్నించలేదు. ఇప్పటి వరకూ ఎంఐఎం ప్రజా సమస్యలపైనే కాదు కేవలం ముస్లింల సమస్యలు తీసుకొని రోడెక్కిన సందర్భం చూడలేదు. ‘కులం, మతం పునాదులపై ఒకజాతిని నీతిని నిర్మించలేమని’ డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ ఎప్పుడో పేర్కొన్నారు. ఏ రాజకీయాలైన ప్రజల మధ్య సోదరభావాల్ని పెంపొందించాలి. ప్రజల్ని కలిపేలా ఉండాలేగాని విడదీసేదిగా ఉండకూడదు. మోడీలు, రౌడీలు మతం ప్రాతిపదికన ఓట్లడిగే వాళ్లను దేశ ప్రజలు అంతిమంగా తిరస్కరిస్తారు.