మన ఊరు, మనబడి లో ఎంపికైన పాఠశాలల నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయండి జిల్లా కలెక్టర్ శ్రీ హర్ష
జోగులాంబ గద్వాల బ్యూరో (జనంసాక్షి) జూలై 21 : జిల్లాలో మన ఊరు, మనబడి కార్యక్రమం క్రింద ఎంపికైన పాఠశాలల నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలనీ జిల్లా కలెక్టర్ శ్రీ హర్ష అన్నారు.
గురువారం గద్వాల్ మండలం సంగాల, గోనుపాడు, ధరూర్ మండలం కోతుల గిద్ద, ఆల్వాల్ పాడు, కె టి దొడ్డి మండలం నందిన్నె, కేట్టిదొడ్డి మండలాలలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మన ఊరు, మనబడి క్రింద చేపట్టిన మండల ప్రాథమిక పాటశాల, ప్రాథమికొన్నత పాఠశాలలో పై కప్పు, కిచెన్ షెడ్, ప్యాచ్ వర్క్, త్రాగు నీరు, లైట్స్, ఫ్యాన్స్ ,మొదలైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు పనులు త్వరగా పూర్తి చేయాలనీ అధికారులకు ఆదేశించారు. ప్రాథమిక పాటశాల సంగాల, గోనుపాడు , కోతుల గిద్ద , అల్వాల్ పాడు, పాఠశాలలను తనిఖి చేసి పనుల పురోగతి అడిగి తెలుసుకున్నారు. ప్రతి పాటశాలలో ఎంత మంది పిల్లలు ఉన్నారు, టిచర్స్ ఎంత మంది, క్లాసు రూమ్ లు ఎన్ని ఉన్నాయని అక్కడ అధికారులను అడిగి తెలుసుకున్నారు. కోతుల గిద్ద అంగన్ వాడి భవనాన్ని పరిశీలించారు. మన ఊరు, మనబడి కింద ఇంకా మొదలు పెట్టని చోట ఎం పి డి ఓ లు , సర్పంచులు, ఏ ఇ లు చొరవ తీసుకొని పనులు మొదలు అయ్యేటట్లు చూడాలన్నారు. కె టి దొడ్డి మండలం నందిన్నె, కాలూర్ తిమ్మన్ దొడ్డి గ్రామల పాఠశాల లో మన ఊరు మనబడి కార్యక్రమం ద్వారా చేపట్టిన పనులను కలెక్టర్ పరిశీలించారు. గ్రామంలోని పాఠశాల విద్యార్థులకు తాగునీరు అందించే ఏర్పాట్లను కలెక్టర్ తనిఖీ చేశారు. పాఠశాల గదులకు ఏర్పాటు చేసే కిటికీలు ,ఫ్యాన్ ల పనులను పరిశీలించి వెంటనే పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. . గద్వాల నుండి ధరూర్ వెళ్లే రహదారి పొడవున పెద్ద మొక్కలు నాటుతున్న సందర్భంగా కలెక్టర్ పరిశీలించారు. కె టి దొడ్డి పల్లె ప్రకృతి వనం లో పెద్ద మొక్కలు నాటి నీళ్లు పోశారు. వర్షాకాలంలో పెద్ద మొక్కలు నాటి మొక్కలను సంరక్షించే విదంగా చర్యలు తీసుకోవాలన్నారు.
అనంతరం కె టి దొడ్డి మండల కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. 252 సర్వే నెంబర్ పై వచ్చిన భూ సమస్య పై అరా తీశారు. కాస్తూ లో ఉన్న పేర్లను పరిశీలించారు. కాత నెంబర్ ఉంటే కుటుంబ సబ్యుల సర్టిఫికెట్లను వెరిఫై చేయాలనీ ఆర్ ఐ నగేష్ కు ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జడ్ పి సి ఇ ఓ విజయ నాయక్, డి పి ఓ శ్యాం సుందర్, ఎం పి పి రాజశేఖర్, ఎం పి డి ఓ లు, సర్పంచులు,పంచాయతీ కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.