మన వనరులు దోచేస్తున్న సీమాంధ్ర సర్కార్‌

బయ్యారంలోనే ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించాలి
పార్లమెంట్‌ బయట రెండోరోజూ టీ ఎంపీల ప్లకార్డుల ప్రదర్శన
న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 23 (జనంసాక్షి) :
తెలంగాణ ప్రాంత వనరులను సీమాంధ్ర సర్కారు దోచేస్తుందని కాంగ్రెస్‌ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పాటు బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్‌ చేస్తూ ఎంపీలు మందా జగన్నాథం, పొన్నం ప్రభాకర్‌, సిరిసిల్ల రాజయ్య, డాక్టర్‌ వివేకానంద రెండో రోజు మంగళవారం పార్లమెంట్‌ గేట్‌ ఎదుట ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఖమ్మం జిల్లా బయ్యారంలోనే ఉక్కు కర్మాగారం నిర్మించాలని వారు డిమాండ్‌ చేశారు. తెలంగాణ ప్రాంతంలోని వనరులు దోచుకెళ్లి ఆంధ్రలో పరిశ్రమలు పెట్టుకొని అక్కడ ఉద్యోగాలు ఇచ్చుకోవడానికి ప్రయత్నిస్తుంటే ఇకపై చూస్తూ ఊరుకోబోమని అన్నారు. ఐదున్నర దశాబ్దాల ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలోని వనరులన్నీ దోపిడీకి గురయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికీ సీఎం, పీసీసీ చీఫ్‌ అహంభావంతో మాట్లాడుతున్నారని అన్నారు. ఇంకా దోపిడీ చేయాలని చూస్తే ఎదురయ్యే ప్రతిఘటన ఎలా ఉంటుందో వారు ఊహించుకోలేరని పేర్కొన్నారు.