మమతా కాలనీలో సీఎం కాన్వాయ్‌ ఆగింది

C

ఏమిటీ మురికి?

సమస్యలపై కాలనీవాసులతో సీఎం ముఖాముఖి

హైదరాబాద్‌, ఫిబ్రవరి 22(జనంసాక్షి): ముఖ్యమంత్రి కేసీఆర్‌ మధ్యాహ్నం అనంతరం ఓ పెళ్లికి వెళుతూ నాగోల్‌లో ఆకస్మాత్తుగా ఆగారు. మమతాకాలనీలో అపరిశుభ్రతను గమనించిన సీఎం తన కాన్వాయ్‌ను ఆపి స్థానికులను పిలిచి మాట్లాడారు. ఈ సందర్భంగా స్థానికులు ముఖ్యమంత్రికి కాలనీ సమస్యలను విన్నవించారు. అదేవిధంగా చైన్‌ స్నాచింగ్‌లు, దొంగతనాలు మితివిూరిపోయాయని తెలిపారు. ఫిర్యాదులపై వెంటనే స్పందించిన సీఎం సీపీ సీవీ ఆనంద్‌కు కాలనీ సమస్యలపై వాకబు చేయాల్సిందిగా కోరారు. కాలనీని శుభ్రంగా ఉంచుకోవాలని, వారంలో మళ్లీ వస్తానని సీఎం తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాలమేరకు సీవీ ఆనంద్‌ వెంటనే కాలనీవాసులతో రెండు గంటలపాటు చర్చించారు. అనంతరం మమతాకాలనీని ‘సేఫ్‌ కాలనీ’ లో చేర్చుతున్నట్లు సీపీ ప్రకటించారు.

తెలంగాణ రాష్ట్రాన్ని బందారు తెలంగాణగా తీర్చిదిద్ది ఆదర్శంగా రూపొందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ కలలు కంటున్నారు. ఈ నేపధ్యంలోనే హైదరాబాద్‌ అభివృద్ధిపై ప్రధానంగా  దృష్టి సారించారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధంచేయాలని అధికారులను ఆదేశించారు. నగరంలో ఆకాశహర్మ్యాలు, రోడ్లు విస్తరణ, స్కైవేలు, సుందర నగరంగా చేసేందుకు హరితహారం ఇలా పలు రకాల కార్యక్రమాలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో ఎక్కడ తేడాగా కనిపించినా దానిపై దృష్టి సారిస్తున్నారు. ఇప్పటికే మురికివాడల ఆధునీకరణకు నడుంబిగించిన సర్కారు ఆదిశగా ఆధునిక లేఅవుట్లతో పేదలకు సుంధరమైన కాలనీలు, ఇళ్లు నిర్మించ తలపెట్టారు. ఇలాంటి నేపథ్యంలో హైదరాబాద్‌లోని ఓ కాలనీ అస్థవ్యస్థంగా ఉండటం సహించలేకపోయారు. ముఖ్యమంత్రి వెళ్తున్న దారిన సమస్యలతో సతమతమవుతున్న ఆ కాలనీ కనిపించగానే కాన్వాయ్‌ నిలిపివేశారు. కాలనీవాసులతో సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వెంటనే సమస్యలు పరిష్కరిస్తామని కాలనీవాసులకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కాసేపు కాలనీవాసులతో, పిల్లలతో సమస్యలను అడిగి తెలుసుకుంటూ,ముచ్చటిస్తూ సరదాగా గడిపారు.